
ఎగ్జిబిషన్ మైదానంలో స్టాళ్ల నిర్మాణానికి చురుగ్గా సాగుతున్న పనులు
అబిడ్స్/గన్‌ఫౌండ్రీ: ఎగ్జిబిషన్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంతో రెండు రోజులు మూతపడిన నుమాయిష్ తిరిగి శనివారం తెర్చుకోనుంది. శుక్రవారం సాయంత్రం ఎగ్జిబిషన్ సొసైటీ కార్యాలయంలో ఏర్పాటైన ఎగ్జిబిషన్ సొసైటీ మేనేజింగ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సొసైటీ గౌరవ కార్యదర్శి జి.వి.రంగారెడ్డి వెల్లడించారు. స్టాళ్ల నిర్మాణం ఒకవైపు జరుగుతున్నప్పటికి మిగత స్టాళ్లవారికి ఇబ్బందులు కలుగకుండా ఎగ్జిబిషన్ తెరవాలని కమిటీ నిర్ణయించినట్లు తెలిపారు. బుధవారం రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంతో ఎగ్జిబిషన్ చరిత్రలో ఎన్నడు లేని విధంగా మధ్యలో రెండు రోజులు మూతపడింది. దాదాపు 300 స్టాల్స్ కాలి బూడిదకావడంతో స్టాళ్ల నిర్వాహకులు ఎగ్జిబిషన్ సొసైటీ వారు చెల్లించిన అద్దెలు తిరిగి చెక్కుల రూపంలో అందించారు. కోటి రూపాయలు నష్టపోయిన స్టాళ్లవారికి అందజేశారు.
ప్రారంభమైన స్టాళ్ల నిర్మాణం...
తిరిగి 300 స్టాళ్లను నిర్మించేందుకు ఎగ్జిబిషన్ సొసైటీ సన్నాహాలు ప్రారంభించింది. శుక్రవారం ఉదయం నుంచే కాలిపోయిన స్టాళ్ల చెత్త చెదారాన్ని తొలగించడం ప్రారంభించింది. సొసైటీ సొంత ఖర్చులతోనే తిరిగి స్టాళ్లను నిర్మిస్తామని సొసైటీ గౌరవ కార్యదర్శి రంగారెడ్డి వివరించారు. రెండు లేదా మూడు రోజుల్లో నూతన స్టాళ్ల నిర్మాణం పూర్తిచేస్తామన్నారు. జమ్మూకాశ్మీర్, గుజరాత్‌లతో పాటు పలు రాష్ట్రాల వారి స్టాళ్లు కాలిపోవడంతో వారందరినీ ఆదుకుంటున్నట్లు వివరించారు.
వేగంగా నివేదిక అందిస్తాం:ఆర్డీఓ శ్రీనివాస్...
300 స్టాళ్లు కాలిపోవడంతో రెవెన్యూ బృందాలు వేగంగా ఆస్తి నష్టం అంచనా వేస్తున్నాయని ఆర్డీఓ శ్రీనివాస్ తెలిపారు. త్వరలోనే 15 రెవెన్యూ బృందాలు సేకరించిన వివరాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందిస్తామని ఆయన ‘సాక్షి’కి తెలిపారు.
బాధితులకు భోజన వసతులు..
ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో బాధితులకు భోజన వసతులు ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో సొసైటీ నిర్వాహకులు స్టాళ్ల నిర్వాహకులకు భోజనాలతో పాటు వసతి సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు.
ఖైరతాబాద్ విద్యార్థుల చేయూత...
పలు రాష్ట్రాల నుంచి వచ్చి రోడ్డుపాలైన ఎగ్జిబిషన్ స్టాళ్ల బాధితులకు ఖైరతాబాద్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చేయూత అందించారు. శుక్రవారం పలు తినుబండారాలను విద్యార్థులు స్వయంగా వారికి అందించి శభాష్ అనిపించుకున్నారు.
మెప్మా స్టాల్ నిర్వాహకుల ఆందోళన..
బుధవారం రాత్రి చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో గుర్తుతెలియని కొందరు దుండగులు స్టాల్‌లోకి చొరబడి అందినకాడికి దోచుకెళ్లారని మెప్మా బజార్ కో ఆర్డినేటర్ శ్రీదేవి తెలిపారు. సుమారు రూ.6 లక్షల విలువగల ఉత్పత్తులను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఎగ్జిబిషన్ సొసైటీ, ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
బీజేపీ ఆధ్వర్యంలో నిరసన..
అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యలో ఎగ్జిబిషన్ సొసైటీ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఆందోళన నిర్వహిస్తున్న బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి నారాయణగూడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment