కొత్తగూడెం: కొత్తగూడెం పట్టణంలోని క్లబ్‌లో నిర్వహిస్తున్న జాతీయ బాలోత్సవ్-14కు రెండోరోజు సుమారు ఎనిమిది వేల మంది చిన్నారులు హాజరై తమ ప్రతిభను చూపారు. జానపదనృత్యాలు, తొలిసారిగా పేరిణినృత్యం, వివిధ అంశాల్లో చిన్నారుల ప్రదర్శనలు అద్భుతంగా కనువిందు చేశాయి.
హోరెత్తించిన జానపదాలు...
జానపదం అంటేనే జనపదం.. జనం గుండెల్లోనుంచి పుట్టుకొచ్చిన జానపదానికి ప్రత్యేక స్థానం కల్పిస్తూ బాలోత్సవ్‌లో జానపద పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో చిన్నారులు అదేస్థాయిలో తమ సత్తా చాటారు. ‘కోయిలో కోయిల’ అంటూ హన్మకొండకు చెందిన తరుణి కరావ్ చేసిన నృత్యం హుషారెత్తించింది. ‘ఈలవేసిండు పోరగాడు’.. అంటూ వరంగల్‌కు చెందిన చందన చేసిన నృత్యం ప్రతీ ఒక్కరిచేత ఈల వేయించింది.
‘ఆటోరిక్షా తోలేటోడా’.. అంటూ నల్లగొండ జిల్లా కోదాడకు చెందిన సుమన చేసిన నృత్యానికి హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. ‘నా అందం చూడు బాబయ్యో’... అంటూ నల్లగొండ జిల్లా కోదాడకు చెందిన సాహితి చేసిన నృత్యానికి స్టేడియంలో ఉన్న విద్యార్థులు కూడా నృత్యం చేశారు. ‘కారనమ్మ కారణం’... అంటూ విజయవాడకు చెందిన నిఖితశ్రీ చేసిన నృత్యం ఎంతగానో అలరిచింది.
తొలిసారిగా పేరిణి నృత్యం...
తెలంగాణ నృత్యంగా పేరుగాంచిన పేరిణి నృత్య పోటీలను తొలిసారిగా బాలోత్సవ్‌లో ఈ సారి చేర్చారు. దీంతో తెలంగాణలోని పలువురు విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపారు. ఈ పోటీలు తొలిసారి కావడంతో 26 మంది విద్యార్థులు ఈ విభాగంలో ప్రదర ్శన ఇచ్చి ఆకట్టుకున్నారు. ఖమ్మంకు చెందిన దత్తు, పాల్వంచకు చెందిన వరుణ్, సూర్యాపేటకు చెందిన వినయ్‌లు ప్రదర్శించిన పేరిణి నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఇక శాస్త్రీయ నృత్యాలు భరతనాట్యం, కూచిపూడిలో చిన్నారుల ప్రదర్శనలు ఔరా అనిపించాయి. భరతనాట్యం జూనియర్స్ విభాగంలో 170 మంది, కూచిపూడి జూనియర్స్ విభాగంలో 150 మంది ప్రదర్శన ఇచ్చారు. సంప్రదాయ నృత్యాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో విద్యార్థులు సైతం అదే రీతిలో పాల్గొని అబ్బురపరిచారు.
రెండోరోజు 8 వేల మంది హాజరు...
రెండో రోజైన శనివారం జరిగిన పోటాలకు సుమారు 8వేల మంది చిన్నారులు హాజరయ్యారు. కథారచన జూనియర్స్ విభాగంలో 260 మంది, సీనియర్స్ విభాగంలో 260, భరతనాట్యం జూనియర్స్‌లో 170, కూచిపూడి జూనియర్స్‌లో 150, తెలుగు పద్యాలులో 180 మంది, జానపద నృత్యాల్లో 175 మంది, ఫ్యాన్సీడ్రెస్ (వితౌట్ సెట్టింగ్)లో 120 మంది, విత్‌సెట్టింగ్‌లో 180 మంది, ఎలక్యూషన్ తెలుగు జూనియర్స్‌లో 250 మంది, ఎలక్యూషన్ ఇంగ్లిష్ జూనియర్స్‌లో 225 మంది, ఎలక్యూషన్ తెలుగు సీనియర్స్‌లో 270 మంది, ఎలక్యూషన్ ఇంగ్లిష్ సీనియర్స్‌లో 240 మంది, ఫోక్‌డాన్స్ సీనియర్స్‌లో 150 మంది, లేఖారచన (తెలుగు)లో 240 మంది, పేరిణి నృత్యంలో 26 మంది, వ్యర్థంతో అర్థం జూనియర్స్‌లో 121 మంది, సీనియర్స్‌లో 118 మంది పాల్గొన్నారు.
భారీగా తరలివచ్చిన తల్లిదండ్రులు..
పిల్లల పండుగైన బాలోత్సవ్‌కు పిల్లలే కాదు పెద్దలు కూడా భారీగానే తరలివచ్చారు. పిల్లల ప్రదర్శనలు చూస్తూ ఆనందించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చిన్నారులకు తోడుగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తరలివ చ్చారు. గతంలో ఒక పాఠశాల నుంచి కొంతమంది విద్యార్థులతో గైడ్‌లు మాత్రమే వచ్చేవారు.
కానీ ఈ సారి మాత్రం చిన్నారుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ప్రదర్శనలు తిలకించేందుకు రావడం గమనార్హం. అంతేకాక పట్టణంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు రాగా వారితో పాటు తల్లిదండ్రులు కూడా వచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు వసతి, భోజన సౌకర్యాలు కల్పించారు.
ఉల్లాసంగా... ఉత్సాహంగా
Published Sun, Nov 9 2014 4:07 AM | Last Updated on Sat, Sep 2 2017 4:06 PM
Advertisement
Advertisement