
సాక్షి, హైదరాబాద్: పర్యావరణ కాలుష్యానికి ప్రధాన కారణమవుతున్న పెట్రోల్, డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విధానానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తోంది. భారీ సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేసేలా కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్–2020 (ఎన్‌ఈఎమ్‌ఎమ్‌పీ)ని తీసుకొ చ్చింది.
మేకిన్ ఇండియాలో భాగంగా అటోమోటివ్ మిషన్ ప్లాన్ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకుంటోంది. ఇందుకోసం ఇప్పటికే వివిధ రాయితీలతో ప్రత్యేక ప్రణాళికను రూపొందించిన సర్కారు... దానికి తుది మెరుగులు దిద్దుతోంది. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమలను ప్రోత్సహించేలా ఈ ఏడాది డిసెంబర్‌కల్లా ప్రణాళికను ప్రకటించే అవకాశం ఉందని ప్రభుత్వవర్గాలద్వారా తెలుస్తోంది.
తయారీ రంగానికి అధిక ప్రాధాన్యం..
రాష్ట్ర ప్రభుత్వం తన ప్రణాళికలో తయారీ రంగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వబోతోంది. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమలకు టీఎస్‌ఐపాస్ కింద అనుమతులు ఇవ్వనుంది. ఎన్‌ఈఎమ్‌ఎమ్‌పీ కింద కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలో పరిశోధనలు, అభివృద్ధిపై భారీ ఎత్తున నిధులు ఖర్చు చేయనుంది.
పలు చోట్ల అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆర్‌అండ్‌డీ కేంద్రాలను ఏర్పాటు చేసే అవకాశం ఉండడంతో రాష్ట్రంలోనూ యూనిట్లు ఏర్పాటయ్యేలా ప్రణాళిక రూపొందిస్తోంది. ప్రస్తుతం మెదక్ జిల్లా తూప్రాన్ సమీపంలోని కలకల్ వద్ద ఆటోమోబైల్ సెజ్ ఉంది. ఇది హైదరాబాద్ నగరానికి చేరువలో ఉండడంతో అటువైపే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమల ఏర్పాటును పరిశీలిస్తోంది. ప్రభుత్వ ప్రణాళిక ఖరారైతే మరింత స్పష్టత రానుంది. ఎలక్ట్రిక్ వాహనాల ఎగుమతులను అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహించేలా ప్రభుత్వం కార్యాచరణను రూపొందిస్తోంది.
నెలన్నరలోపు ప్రకటిస్తాం
హైదరాబాద్ వంటి నగరాల్లో ఎలక్ట్రిక్ వాహనాల ఆవశ్యకత ఎంతో ఉంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వాహనాల వినియోగాన్ని అంచనా వేసి ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ప్రత్యేక ప్రణాళిక రూపొందించే ప్రక్రియ దాదాపు పూర్తయింది. నెలన్నరలోపు ప్రకటించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. కార్యాచరణ ప్రకటిస్తే పరిశ్రమల ఏర్పాటు వేగవంతం అవుతుంది. –జయేశ్‌రంజన్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి