
కందకాలపై అవగాహన అవసరం
రైతులకు ఎంపీ గుత్తా పిలుపు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: కందకాల విషయంలో రైతులందరూ అవగాహన పెంచుకోవాలని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లాలో ‘సాక్షి’, తెలంగాణ విశ్రాంతి ఇంజనీర్ల వేదిక ఆధ్వర్యంలో రెండో రోజు గురువారం తిప్పర్తి, తుంగతుర్తి మండల కేంద్రాల్లో రైతు అవగాహన సదస్సులు జరిగాయి. తిప్పర్తిలోని టీఎన్నార్ ఫంక్షన్‌హాలులో జరిగిన సదస్సులో గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రతి విషయానికి రైతులు ప్రభుత్వాలపై ఆధారపడాల్సిన పనిలేదన్నారు.
తక్కువ ఖర్చుతో పూర్తయ్యే కందకాలను రైతులే తమ పొలాల్లో స్వయంగా తవ్వించుకుని భూగర్భ జలమట్టాలను పెంచుకోవాలని కోరారు. రైతులంతా తమకు అందుబాటులో ఉన్న అన్ని సౌకర్యాలను వినియోగించుకోవాలని ఆయన కోరారు. ‘ నా మామిడి తోటలో నీళ్లు లేవు.. ఎండిపోతుందనే భయంతో రెండు ట్యాంకర్లు పెట్టి నీళ్లు తెచ్చి పోస్తున్నాం. కందకాలు తీయిస్తే నీటి సమస్య ఉండేది కాదు. ఇప్పుడు మీకు వీలుంటే చిట్యాల వరకు వచ్చి నా పొలంలో కందకాలు తీసి వెళ్లండి.’ అని గుత్తా కోరారు.
తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల వేదిక అధ్యక్షుడు సంగెం చంద్రమౌళి మాట్లాడుతూ కందకాల ఏర్పాటు ద్వారా రెండేళ్ల వరుస కరువు వచ్చినా నీటికి ఇబ్బంది లేకుండా పంటలు పండించుకోవచ్చని చెప్పారు. ఈ సందర్భంగా కందకాలు ఎలా తవ్వుకోవాలనే దానిపై ఆయన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సదస్సు సమన్వయకర్త, సాక్షి సాగుబడి డెస్క్ ఇంచార్జి పంతంగి రాంబాబు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) ప్రాజెక్టు డెరైక్టర్ కె. దామోదర్‌రెడ్డి, తిప్పర్తి ఎంపీపీ పాశం రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కందకం అంటే...
భూమిలో వాలుగా ప్రతి వంద మీటర్లకు ఒక మీటరు లోతు, అరమీటరు వెడల్పుతో సమతలంగా గోతిని తవ్వడాన్ని కందకం అంటారు. దీని వల్ల చేనులో కురిసిన వాన నీరంతా కందకాల ద్వారా భూమిలో ఇంకి భూగర్భజలాలు అభివృద్ధి అవుతాయి. అంటే భూగర్భాన ఒక చెరువు ఏర్పడుతుంది.