
జిల్లాలు తిరగడానికి సీఎం అవ్వాలా ?
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జిల్లాలు పర్యటించేందుకే పదవిలోకి వచ్చినట్టు ఉందని ప్రతిపక్షనేత జానారెడ్డి ఎద్దేవా చేశారు. జిల్లాల పర్యటనే పనిగా భావిస్తున్నారని ఆయన విమర్శించారు. జానారెడ్డి శనివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ..'హామీలు ఇవ్వాలనుకుంటే ఇక్కడ (హైదరాబాద్) నుంచి ఇవ్వవచ్చు.
అయినా ఆయన (కేసీఆర్) జిల్లాలు పర్యటిస్తున్నారు. నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు రబీకి నీళ్లిచ్చే అంశంపై ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. రబీకి నీళ్లిస్తారని ప్రజలు ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా నడుస్తోంది. కృష్ణపట్నం విద్యుత్ కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన బాధ్యత కేసీఆర్ పై ఉంది. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా రెండో పంటకు నీరు అందించారు. ఇప్పుడెందుకు స్పందించడం లేదు' అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.