సెరిలాక్ టైంలోనే సెల్‌ఫోన్లా?: నాయిని
సెరిలాక్ తినాల్సిన సమయం నుంచే సెల్‌ఫోన్లు పట్టుకోవడం వల్లే చిన్నారులపై లైగింక దాడులు జరుగుతున్నాయని హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి అభిప్రాయ పడ్డారు
సాక్షి, హైదరాబాద్: సెరిలాక్ తినాల్సిన సమయం నుంచే సెల్‌ఫోన్లు పట్టుకోవడం వల్లే చిన్నారులపై లైగింక దాడులు జరుగుతున్నాయని హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి అభిప్రాయ పడ్డారు. సీఐడీ ఐజీ సౌమ్యా మిశ్రా నేతృత్వంలో గురువారం ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో జరిగిన ఆన్‌లైన్‌లో చిన్నారులపై లైంగిక వేధింపుల నియంత్రణ సదస్సును ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ..రాష్ట్రంలో చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడులు, వేధింపుల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. సైబర్ నేరస్థులను కట్టడి చేయడంలో సీఐడీ సఫలీకృతమవుతోందని నాయిని ప్రశంసించారు. ఈ సందర్భంగా సీఐడీ రూపొందించిన లైంగిక వేధింపుల నియంత్రణ మాడ్యుల్‌ను ఆవిష్కరించారు.
తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరం
పోలీసులు, చట్టాలు, స్వచ్ఛంద సంస్థలు.. ఇలా ఎన్ని ఉన్నా పిల్లలపై జరుగుతున్న లైంగిక వేధింపుల నియంత్రణలో కీలక పాత్ర తల్లిదండ్రులదేనని తులిర్ స్వచ్ఛంద సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విద్యారెడ్డి స్పష్టంచేశారు. అమెరికా, జర్మనీ, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో తాము చేసిన సర్వే ప్రకారం సెక్సువల్ ఎడ్యుకేషన్ పాఠ్యాంశంగా ఉందని, అయితే దేశంలో ఇప్పుడిప్పుడే ఈ అంశంగా చేర్చే ప్రక్రియ ప్రారంభంలో ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ వాడుకలో దేశం రెండో స్థానంలో ఉందని తెలిపారు. బిహార్‌లోని పట్నా రైల్వేస్టేషన్‌లో ఉచితంగా వైఫై ఇవ్వడంతో చాలా మంది అశ్లీల చిత్రాలు, వీడియోలు డౌన్‌లోడ్ చేసినట్టు అక్కడి పోలీసులు దర్యాప్తులో బయటపడిందన్నారు. పోర్న్ వెబ్‌సైట్లు, సంబంధిత సోషల్ మీడియాను వీక్షించవద్దని తెచ్చే ఒత్తిడి వల్ల పిల్లల్లో మానసిక వేదన ప్రారంభమై, వాటిని చూసేలా ప్రేరేపిస్తోందని ఆందోళన వ్యక్తంచేశారు.
దేశవ్యాప్తంగా 7.5 లక్షల మంది..
ఇటీవల అమెరికాకు చెందిన వ్యక్తిని సీఐడీ హైదరాబాద్‌లో అరెస్ట్ చేసింది. చిన్నారులకు సంబంధించిన అశ్లీల చిత్రాలు డౌన్‌లోడ్ చేసిన ఆ వ్యక్తి.. ఇక్కడి నుంచి అప్‌లోడ్ చేయడం కూడా ప్రారంభించాడు. ఇలా దేశవ్యాప్తంగా 7.5 లక్షల మంది కేవలం చిన్నారులను లైంగిక వేధింపులకు గురిచేసేలా ఆన్‌లైన్‌లో అశ్లీల చిత్రాలు అప్‌లోడ్, డౌన్‌లోడ్ చేస్తున్నట్టు సర్వేలో వెల్లడైంది అని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ స్తుతి కక్కర్ తెలిపారు. అమెరికాలో జరిగిన ఓ బాలిక ఫేస్‌బుక్ వ్యవహారాన్ని ఉదాహరణగా యూనిసెఫ్ ప్రతినిధి తనిష్ట దత్తా వివరించారు. స్మార్ట్‌ఫోన్ల ద్వారానే 80 శాతం లైంగిక వేదింపులు జరుగుతున్నట్టు తమ సర్వేలో వెల్లడైందని దత్తా స్పష్టంచేశారు. ఇదే అంశంపై సుప్రీంకోర్టు అడ్వకేట్ వకుల్ శర్మ, తదితరులు తమ సూచనలు, సలహాలు వెల్లడించారు.