- షట్టర్ల కింది మట్టి తొలగింపులో నిర్లక్ష్యం
- రింగ్‌బండ్‌తో పొంచి ఉన్న ముప్పు
- ఆందోళనలో రామప్ప రైతులు
వెంకటాపురం : రామప్ప సరస్సు లీకేజీ నీటిని అరికట్టేందుకు తాత్కాలికంగా మట్టితో ఆన కట్ట నిర్మించి ఐబీ అధికారులు చేతులు దులుపుకున్నారు. రామప్ప ప్రధాన తూము నుంచి మూడు రోజులుగా సరస్సు నీరు వృథాగా పోతుందని ‘సాక్షి’లో కథనాలు రావడంతో స్పందించిన అధికారులు ప్రొక్లెయినర్‌తో తూము ముందు చిన్న ఆన కట్ట నిర్మించి లీకేజీ నీటిని అదుపుచేశారు. కానీ షట్టర్ల కింద పేరుకుపోయిన మట్టి, రాళ్లను తొలగించాల్సిన పనిని మాత్రం మరిచారు. ఒక భారీ వర్షం కురిసిందంటే తూము ముందు పేరుకుపోయిన మట్టి, రాళ్లు తూములోకి వెళ్లి నిలిచిపోతారుు. అదే జరిగితే ప్రధాన తూము నుంచి ఆయకట్టు పొలాలకు రాబోయే రోజుల్లో చుక్కసాగునీరు కూడా అందే పరిస్థితులు కనిపించడం లేదు.
రామప్ప సరస్సును నమ్ముకుని పంటలు సాగుచేసుకుంటున్న రైతాంగానికి ఇక గడ్డుకాలమే ఎదురుకానుంది. రింగ్‌బండ్ తొలగించకపోతే తమ పంటపొలాలు ఎండిపోయే పరిస్థితులు దాపురిస్తాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం లీకేజీ నీటిని అదుపు చేసిన నీటిపారుదల శాఖ అధికారులు భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలపై దృష్టి సారించడం లేదని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు స్పందించి రింగ్‌బండ్‌ను తొలగించి షట్టర్ల కింద పేరుకుపోయిన మట్టి, రాళ్లను తొలగించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.