సాక్షి ప్రతినిధి, నల్లగొండ : శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్‌కు మరోమారు ఎమ్మెల్సీ హోదా ఖరారైంది. ఆయన గురువారం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి కోసం తన నామినేషన్‌ను హైదరాబాద్‌లో శాసనసభ కార్యదర్శికి అందజేశారు. జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డి, విప్ గొంగిడి సునీతలు వెంట రాగా ఆయన తన నామినేషన్‌ను శాసనసభ కార్యదర్శి రాజాసదారాంకు అందజేశారు. అయితే, నేతి విద్యాసాగర్‌ను తొలుత ఆయనను గవర్నర్ కోటాలో మండలికి పంపాలని టీఆర్‌ఎస్ అధిష్టానం భావించినా చివరి నిమిషంలో నిర్ణయాన్ని మార్చి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవికి నామినేషన్ వేయించడం చర్చనీయాంశమైంది.
గవర్నర్ కోటాలో పంపితే ఎలాంటి ఉత్కంఠ లేకుండా సునాయాసంగా మండలికి వెళ్లవచ్చని, డిప్యూటీ చైర్మన్ హోదాలో ఆయన పార్టీలోకి వచ్చినందున ఆ కోటాలోనే ఆయన్ను మండలికి పంపుతారని మొదటి నుంచి చర్చ జరిగింది. అయితే, అందరి అంచనాలను భిన్నంగా ఎమ్మెల్యే కోటాలో నేతిని టీఆర్‌ఎస్ నామినేషన్ వేయించింది. బుధవారమే ఆయన చేత నామినేషన్ పత్రాలపై సంతకాలు చేయించినా, అది లాంఛనంగానే చేయించారని, విద్యాసాగర్‌ను గవర్నర్ కోటాలోనే నామినేట్ చేస్తారని ప్రచారం జరిగింది. అయినా, గురువారం మాత్రం విద్యాసాగర్‌ను ఎమ్మెల్యే కోటాలోనే నామినేషన్ వేయించడం గమనార్హం.
ఎన్నిక జరిగితే...
వాస్తవానికి ఎమ్మెల్యేల కోటాలో కేవలం నాలుగు స్థానాలు మాత్రమే గెలుచుకునేందుకు తగిన బలం టీఆర్‌ఎస్‌కు ఉంది. అయితే, ఆ పార్టీ తరఫున ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు వేయడం గమనార్హం. ఈ ఐదుగురిలో విద్యాసాగర్ ఒకరు కావడంతో ఈ ఎమ్మెల్సీ పదవులు ఏకగ్రీవం కాకుండా ఎన్నిక అనివార్యమైతే కొంత ఉత్కంఠకు గురికాక తప్పదు. ఎందుకంటే టీఆర్‌ఎస్ తరఫున నామినేషన్లు వేసిన ఐదుగురిలో తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరిలిద్దరూ మంత్రులు. కాబట్టి వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుంది కనుక ఆ ఇద్దరి తొలి ఇద్దరు అభ్యర్థులుగా ప్రకటించనున్నారు.
అయితే, ఇక మిగిలిన ముగ్గురిలో నేతితో పాటు మాజీ ఎమ్మెల్సీలు యాదవరెడ్డి (రంగారెడ్డి), బోడకూటి వెంకటేశ్వర్లు (వరంగల్) ఉన్నారు. వీరి ముగ్గురిలో ఇద్దరు ఖచ్చితంగా గెలుస్తారు. మరో వ్యక్తి గెలవాలంటే ఇతర పార్టీల మద్దతు టీఆర్‌ఎస్‌కు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నిక జరగాల్సి వస్తే జిల్లాకు చెందిన నేతి విద్యాసాగర్‌ను మూడో అభ్యర్థిగా, నాలుగో అభ్యర్థిగా పార్టీ ప్రకటిస్తే ఇబ్బందేమీ ఉండదు. కానీ ఐదో అభ్యర్థిగా బరిలో దింపితే మాత్రం ఫలితాలు వచ్చేంతవరకు జిల్లా పార్టీ శ్రేణులకు ఉత్కంఠ తప్పదని పార్టీ వర్గాలే అంటున్నాయి.
‘డిప్యూటీ’కి ఇప్పుడే..
Published Fri, May 22 2015 12:06 AM | Last Updated on Sun, Sep 3 2017 2:27 AM
Advertisement
Advertisement