కలెక్టర్‌గా ప్రియదర్శిని | New collector Priyadarshini | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌గా ప్రియదర్శిని

Published Tue, Jan 13 2015 5:52 AM | Last Updated on Fri, Sep 28 2018 7:14 PM

కలెక్టర్‌గా ప్రియదర్శిని - Sakshi

కలెక్టర్‌గా ప్రియదర్శిని

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : కలెక్టర్ ఎం.జగన్‌మోహన్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా పనిచేస్తున్న జీడీ ప్రియదర్శినిని నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే ఏఐఎస్ (అఖిల భారత సర్వీసుల) అధికారుల విభజన కొలిక్కి రావడంతో ప్రభుత్వం ఐఏఎస్ అధికారుల పోస్టింగ్‌లపై దృష్టి సారించింది. రాష్ట్ర వ్యాప్తంగా 24 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు, ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్‌ను కూడా బదిలీ చేసింది.

2014 జూన్ 29న కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న జగన్మోహన్ ఏడు నెలల లోపే బదిలీ కావడం అధికార, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎంతో సౌమ్యునిగా పేరున్న జగన్మోహన్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి జిల్లా పాలనపై తనదైన ముద్ర వేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ప్రత్యేక శ్రద్ధ వహించారు. సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే, మన ఊరు.. మన ప్రణాళికల రూపకల్పన విజయవంతంగా చేపట్టారు.

దళిత బస్తీ పథకం అమలులో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచేలా చేశారు. అలాగే వివిధ శాఖల జిల్లా అధికారులతోపాటు, అన్ని స్థాయిలో అధికారులు, సిబ్బందితో కలుపుగోలుగా ఉన్నారు. ప్రజాప్రతినిధులకు కూడా అందుబాటులో ఉంటూ పాలనను కొనసాగించారు. జిల్లాలో ఆరు నెలలుగా జాయింట్ కలెక్టర్ పోస్టు ఖాళీగా ఉంది. జేసీగా పనిచేసిన లక్ష్మీకాంతం బదిలీ తర్వాత ఆ స్థానంలో ప్రభుత్వం ఎవరినీ నియమించలేదు.

అలాగే ఐటీడీపీ ప్రాజెక్టు ఆఫీసర్ స్థానం కూడా ఖాళీగా ఉంటోంది. ఇన్నాళ్లు ఏఐఎస్ అధికారుల విభజన పూర్తి కాకపోవడంతో ప్రభుత్వం ఈ పోస్టులను భర్తీ చేయడానికి వీలుపడలేదు. దీంతో కలెక్టర్ జగన్మోహన్ జేసీగా కూడా అదనపు బాధ్యతల్లో కొనసాగారు. రెండు కీలక పోస్టింగ్‌లను సమర్థవంతంగా నిర్వహించారు. జిల్లా అధికార యంత్రాంగంపై ఇప్పుడిప్పుడే పూర్తి స్థాయిలో పట్టు సాధించిన ఆయన అక్రమార్కులపై చర్యలకు శ్రీకారం చుట్టారు.

ఇంతలోనే కలెక్టర్ బదిలీ కావడం గమనార్హం. కాగా జగన్మోహన్ జిల్లాకు వచ్చిన కొన్ని నెలలకే ఆయన సతీమణి అరుణకుమారికి కూడా ప్రభుత్వం జిల్లాలోనే పోస్టింగ్ ఇచ్చింది. ఫారెస్టు సెటిల్‌మెంట్ అధికారిగా కొన్ని నెలల క్రితమే బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు కలెక్టర్ బదిలీ అధికార వర్గాల్లో చర్చకు దారితీసింది.
 
మంత్రులకూ సమాచారం కరువు..
కలెక్టర్ బదిలీ, కొత్త కలెక్టర్ నియామకాల విషయంలో జిల్లా మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూడా సమాచారం లేదు. కనీసం వీరితో మాటవరుసకైనా చర్చించకుండానే ఉత్తర్వులు వెలువడటం వారిని తీవ్ర అసంతృప్తికి గురిచేసినట్లు సమాచారం. దీంతో మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి సోమవారం జిల్లాలోని తమ కార్యక్రమాలను రద్దు చేసుకుని హైదరాబాద్ వెళ్లారు. సిర్పూర్ పేపర్ మిల్లు పునరుద్ధరణ విషయమై సోమవారం సాయంత్రం సీఎంతో సమావేశం కావాలని భావించారు. ఈ సమావేశంలో కలెక్టర్ బదిలీని నిలిపివేయాలని సీఎంకు విజ్ఞప్తి చేయాలని జిల్లా ప్రజాప్రతినిధులు నిర్ణయించారు. కానీ ఈ సమావేశం మంగళవారానికి వాయిదా పడింది.
 
కొత్త కలెక్టర్ ప్రియదర్శిని
జిల్లా కలెక్టర్‌గా నియమితులైన జీడీ ప్రియదర్శిని 2008 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి. ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు కూడా కేవలం ఆరు నెలలలోపే బదిలీ అయ్యింది. 2014 జులై 31న మహ బూబ్‌నగర్ కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న ఆమె.. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాకు బదిలీపై వస్తున్నారు. ప్రియదర్శిని హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌కు చెందిన వారు. ప్రస్తుతం గచ్చిబౌళిలో నివాసం ఉంటున్నారు. ఆమె బాల్యమంతా హైదరాబాద్‌లోనే గడిచింది. ఆమె తండ్రి బెంజుమన్ దీవెనయ్య ఆదాయపు పన్ను శాఖలో ఉన్నత స్థానంలో పనిచేశారు. ప్రభుత్వ ఉత్తర్వులను, నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తారనే పేరుంది. రాజకీయ, ఏ ఇతర ఒత్తిళ్లను లెక్కచేయరనే పేరుంది.
 
పనిచేసిన స్థానాలు..
2002 బ్యాచ్ గ్రూప్-1 అధికారిణి అయిన ప్రియదర్శిని ముందుగా విపత్తుల శాఖ సహాయ కమిషనర్‌గా పనిచేశారు. హౌజింగ్ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. 2008లో సీసీఎల్‌ఏ కమిషనర్‌గా కొనసాగారు. ఈ సమయంలో ఆమెను ఐఏఎస్‌గా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అనంతరం నల్గొండ జిల్లాకు జేసీగా బదిలీ అయ్యారు.

అక్కడ సుమారు ఏడాది పనిచేశారు. అనంతరం గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్‌కు నార్త్‌జోన్ సహాయ కమిషనర్‌గా మూడున్నర ఏళ్లు పనిచేశారు. తర్వాత 2014 అక్టోబర్ 30న అపార్డ్‌కు డెరైక్టర్‌గా వెళ్లారు. అక్కడ ఎనిమిది నెలలు పనిచేసిన తర్వాత మహబూబ్‌నగర్ జిల్లాకు కలెక్టర్‌గా నియమితులయ్యారు. 2014 జూలై 31న మహబూబ్‌నగర్ బాధ్యతలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement