సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ‘గులాబీ పండు‘పేరుతో కొత్తరకం పంటను ప్రోత్సహించాలని ఉద్యాన శాఖ నిర్ణయించింది. చైనాలో డ్రాగన్ ఫ్రూట్, యూఎస్‌లో అమెరికన్ బ్యూటీ పేర్లతో సాగు చేస్తున్న పండును నూతన సంవత్సరం సందర్భంగా రైతులకు పరిచయం చేయాలని నిర్ణయం తీసుకుంది.
డ్రాగన్ ఫ్రూట్‌కు ‘గులాబీ పండు అమృత రాజఫలం’గా నామకరణం చేశామని, మొక్కలను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ (సీవోఈ)లో ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నామని ఉద్యాన డైరెక్టర్ ఎల్.వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండలం కొల్తూరు గ్రామంలో 15 ఎకరాల్లో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ గులాబీ పండును సాగు చేస్తున్నారని చెప్పారు.
మిర్యాలగూడ సమీపంలో రైతు రవి కూడా 15 ఎకరాల్లో పండించి తొలిసారి మార్కెట్లోకి పండ్లను తీసుకొచ్చారన్నారు. భువనేశ్వర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్, మిజోరంలోని డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్‌లోనూ మొక్కలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గతంలో బేర్ యాపిల్‌ను తెలంగాణ యాపిల్‌గా నామకరణం చేసి రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెంకట్రామిరెడ్డి చెప్పారు.
30 ఏళ్లు పండ్లే పండ్లు..
‘డ్రాగన్ ఫ్రూట్ తెలుపు, గులాబీ రంగుల్లో లభిస్తుంది. ఈశాన్య రాష్ట్రాలు, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటకలో ఇప్పుడిప్పుడే పండిస్తున్నారు. తీగజాతికి చెందిన ఈ పండు డయాబెటిక్, బీపీ రోగులకు ఎంతో ఊరటనిస్తుంది. క్యాన్సర్‌పై పోరాడుతుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది’అని వెంకట్రామిరెడ్డి తెలిపారు.
పౌడర్‌గా తయారుచేసుకొని ఫ్లేవర్‌గా ఉపయోగించుకోవచ్చని, సలాడ్ రూపంలోనూ తీసుకుంటారని, తెలంగాణ వంటి వర్షాభావ ప్రాంతాలకు అనువైనదని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్, నల్లగొండ, తక్కువ నీటి వనరులున్న ఇతర ప్రాంతాల్లోనూ సాగు చేయొచ్చని.. ఒక్కో చెట్టుకు రోజుకు 2 లీటర్ల నీరు సరిపోతుందని తెలిపారు. ఒకసారి మొక్క నాటితే 25 నుంచి 30 ఏళ్లపాటు పండ్లనిస్తుందని చెప్పారు.
ఏడాదికోసారి పంట
మొదట్లో ఎకరానికి 4 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు ఖర్చుంటుందని, తర్వాత ఏటా రూ. 25 నుంచి రూ. 30 వేలు నిర్వహణకు ఖర్చు చేయాలని వెంకట్రామిరెడ్డి చెప్పారు. డ్రాగన్ ఫ్రూట్స్ ఏడాదికోసారి పండుతాయని, తొలి ఏడు ఎకరానికి టన్ను పంట పండుతుందని, లక్షన్నర వస్తుంద న్నారు.
రెండో ఏడాది 2 టన్నులు 3 లక్షలు, మూడో ఏడాది 3 టన్నులు 4.5 లక్షలు, నాలుగో ఏడాది 4 టన్నులు 6 లక్షలు, ఐదో ఏడాది 5 టన్నులు 7.5 లక్షలు, ఆరో ఏడాది 6 టన్నులు 9 లక్షలు ఆదాయం వస్తుంద న్నారు. 25–30 ఏళ్ల వరకు 6 టన్నుల వరకు పండ్లు పండుతాయని.. 9 లక్షల ఆదాయం వస్తుందన్నారు. వివరాలకు 83744–49091 ను సంప్రదించాలని కోరారు.
120
Comments
Please login to add a commentAdd a comment