సూపర్‌బగ్‌ 'బయో'త్పాతం | New disease 'super bug' bio strikes ap and telangana | Sakshi
Sakshi News home page

సూపర్‌బగ్‌ 'బయో'త్పాతం

Published Sun, Jan 29 2017 1:18 AM | Last Updated on Sat, Jun 2 2018 2:56 PM

సూపర్‌బగ్‌ 'బయో'త్పాతం - Sakshi

సూపర్‌బగ్‌ 'బయో'త్పాతం

- విచ్చలవిడి వినియోగంతో నిరోధకత పెంచుకున్న బ్యాక్టీరియా
- తెలంగాణ, ఏపీల్లోని బ్యాక్టీరియాలో 20% సూపర్‌బగ్‌ ఉన్నట్లు అంచనా
- సాధారణ జ్వరాలు, రుగ్మతలతోనే ప్రాణాపాయ స్థితి
- సూపర్‌బగ్స్‌తో దేశంలో ఏటా 10 లక్షల మంది మృత్యువాత!
- అందులో తెలుగు రాష్ట్రాల్లోనే లక్ష మంది
- ఆరోగ్య అత్యవసర పరిస్థితి తలెత్తుతోందంటున్న వైద్య నిపుణులు
- పంటల్లో పురుగు మందులుగా యాంటీ బయోటిక్స్‌తోనూ ప్రమాదం
- మందుల దుకాణాల్లోనూ నిర్లక్ష్యంగా అమ్మకాలు
- ప్రభుత్వ నియంత్రణ శూన్యం..
- ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించినా మారని తీరు


రమేశ్‌కు జ్వరం వచ్చింది.. మందుల దుకాణానికి వెళ్లి మాత్రలు కొనుక్కుని వేసుకున్నాడు.. మూడు రోజులైనా తగ్గలేదు.. ఓ క్లినిక్‌కు వెళ్లాడు.. డాక్టర్‌ మరో రెండు మాత్రలు, యాంటీ బయోటిక్‌ రాసిచ్చాడు.. అయినా తగ్గలేదు.. పరిస్థితి విషమించింది. పెద్దాస్పత్రికి తీసుకెళితే ఐసీయూలో చేర్చి చికిత్స చేయాల్సి వచ్చింది. వచ్చింది జ్వరమే. కానీ రమేశ్‌కు సోకింది మాత్రం.. ‘సూపర్‌బగ్‌’. యాంటీ బయోటిక్స్‌కు నిరోధకత పెంచుకున్న బ్యాక్టీరియా. ఇవి సంక్రమిస్తే మందులేవీ పనిచేయవు. తెలంగాణ, ఏపీల్లోని బ్యాక్టీరియాలో సూపర్‌బగ్స్‌ 20 శాతం వరకూ ఉన్నాయని.. దీంతో ఇరు రాష్ట్రాల్లో ఏటా లక్ష మంది వరకూ మరణిస్తున్నారని వైద్యుల అంచనా. సూపర్‌బగ్స్‌ తయారుకావడానికి ప్రధాన కారణం.. యాంటీ బయోటిక్స్‌ను విచ్చలవిడిగా వాడటమే..

సాక్షి, హైదరాబాద్‌: కొన్ని దశాబ్దాలకు ముందు ఎవరికైనా ఏదైనా ఇన్‌ఫెక్షన్‌ వచ్చిందంటే.. ప్రాణాలపై ఆశలు వదిలేసుకోవాల్సిన పరిస్థితు లు ఉండేవి. 1928లో యాంటీ బయోటిక్స్‌ను కనిపెట్టాక ఇన్‌ఫెక్షన్లకు విరుగుడు లభించింది. వాటితో బ్యాక్టీరియాకు చెక్‌ పెట్టడం ద్వారా ఎన్నో మొండి వ్యాధులకు కళ్లెం వేయగలిగాం. కానీ ఇప్పుడు పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. అనేక బ్యాక్టీరియాలు యాంటీ బయోటిక్స్‌ను ఎదిరించే ‘సూపర్‌బగ్‌’స్థితికి రూపాంతరం చెం దాయి. దీంతో సాధారణ రోగాలు కూడా ఔష ధాలకు లొంగకుండా మొండిగా తయారయ్యా యి. ఏదైనా బ్యాక్టీరియా యాంటీ బయోటిక్స్‌ కు లొంగకపోతే దానినే సూపర్‌బగ్‌ అంటారు.


ఇప్పటికే మూడు రకాలు..
సూపర్‌బగ్స్‌గా మారిన బ్యాక్టీరియాలు దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. తెలంగాణ లోనూ సూపర్‌బగ్స్‌ 20 శాతం వరకు విస్తరించి ఉన్నాయని కొందరు వైద్యులు హెచ్చరిస్తున్నా రు. రాష్ట్రంలో ‘మెతిసిలిన్‌ రెసిస్టెంట్‌ సెఫిలో కాకస్‌ ఆర్స్‌ (ఎంఆర్‌ఎస్‌ఏ), డయాబె టిస్, ఊపిరితిత్తులు, రక్తంలో ఇన్‌ఫెక్షన్‌కు కారణమ య్యే క్లెప్సియెల్లా; గనేరియాకు కారణమయ్యే నిస్సీరియా; టీబీకి కారణమ య్యే మైకో బ్యాక్టీరియాలు సూపర్‌బగ్‌లా మారాయని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. జ్వరం, దగ్గు, జలుబు వంటి వాటికి గురైన వారు కూడా సూపర్‌బగ్స్‌ కారణంగా ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారని హెచ్చరిస్తున్నారు. అటువంటివారిని ఐసీయూల్లో, వెంటిలేటర్‌పై పెట్టాల్సిన పరిస్థితులూ ఉంటున్నాయని చెబుతున్నారు. ఆయా సూపర్‌బగ్‌లు సోకిన వారికి చికిత్స చేస్తే కోలుకునే పరిస్థితి కూడా కనిపించడం లేదని, ఇది ఆరోగ్య సంక్షోభానికి దారితీసే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.


తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి దారుణం
అమెరికాలో ఏటా 23 వేల మంది సూపర్‌బగ్‌ బ్యాక్టీరియా కారణంగా చనిపోతున్నారని అక్క డి సర్వేలు చెబుతున్నాయి. అభివృద్ధి చెందు తున్న దేశాల్లో ఈ సంఖ్య మరింతగా ఎక్కువగా ఉంది. భారతదేశంలోనూ సూపర్‌బగ్‌ కారణం గా అనేక రోగాలు తిరగబడుతున్నాయి. ఒక అంచనా ప్రకారం ఏటా దేశంలో సూపర్‌బగ్‌ బ్యాక్టీరియాల కారణంగా సాధారణ జబ్బులు కూడా నయం కాకపోవడంతో దాదాపు 10 లక్షల మంది వరకు చనిపోతున్నారని అంచనా. అందులో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన వారే దాదాపు లక్ష మంది వరకు ఉంటారని నిపుణులు లెక్కగడుతున్నారు. ప్రపంచ సగటు న యాంటీ బయోటిక్స్‌ వాడకం 36% ఉంటే.. భారత్‌లో 62%గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అది ఏకంగా 69 % వరకు ఉన్నట్లు అంచ నా. దేశంలో సూపర్‌బగ్‌ అధికం గా ఉన్న రాష్ట్రాల్లో ఢిల్లీ తర్వాత తెలంగాణ, ఏపీలు ఉన్నాయని వైద్యులు అంచనా వేస్తున్నారు.


ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించినా..
చీటికి మాటికి యాంటీ బయోటిక్స్‌ వాడకూ డదని, దానివల్ల బ్యాక్టీరియా దేనికీ లొంగని స్థితికి చేరుకుంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. యూరప్‌ దేశాలు, కెనడా, అమెరికాల్లో యాంటీ బయోటిక్స్‌ వాడకం ఇటీవల తగ్గుతుండగా... ఇండియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా, ఆస్ట్రేలియాల్లో పెరుగుతుం దని ఆ సంస్థ వెల్లడించింది. సాధారణంగా ఒక యాంటీ బయోటిక్‌ను కనుగొనాలంటే కనీసం ఐదారేళ్లు పడుతుంది. కానీ విచ్చలవిడి యాం టీ బయోటిక్స్‌ వినియోగం కారణంగా బ్యాక్టీరి యాలు కొద్దికాలంలోనే వాటికి నిరోధకతను పెంచుకుని సూపర్‌బగ్‌లుగా మారుతున్నాయి. ఈ సూపర్‌బగ్‌లను నిర్మూలించే ఔషధాల తయారీకి మళ్లీ ఎన్నో ఏళ్లుపడుతుంది. దీంతో మొత్తంగా ఆరోగ్య రంగానికే సవాలు ఎదురవు తోంది. రాష్ట్రంలో కార్పొరేట్‌ ఆసుపత్రులకు సాధారణ జ్వరం, దగ్గు, జలుబుతో వచ్చిన వారికి కూడా ఐసీయూలకు పంపాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కొందరికి వెంటిలేటర్లు కూడా పెట్టాల్సి వస్తోంది.


వ్యవసాయం, డెయిరీ, పౌల్ట్రీల్లోనూ..
వ్యవసాయ పంటల్లోనూ తెగుళ్లను నిర్మూలించేందుకు పురుగు మందులు వేస్తారు. వాటిల్లోనూ ఇటీవల యాంటీ బయోటిక్స్‌ను వాడకం విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఇక పాలిచ్చే గేదెలు, ఆవులు, కోళ్లు తదితర వాటికి కూడా యాంటీ బయోటిక్స్‌ వాడుతున్నారు. ఈ పరిస్థితి కూడా సూపర్‌బగ్‌లకు కారణమవుతోంది.


అసలు నియంత్రణేదీ?
అమెరికాలో ఒక యాంటీ బయోటిక్‌ వాడాలంటే... ముందు ఆ అనారోగ్యానికి యాంటీ బయోటిక్‌ అవసరమని వైద్యులు నిర్ధారించాలి. దానికి ప్రిస్కిప్షన్‌ రాసివ్వాలి. సంబంధిత ఆసుపత్రి అనుమతి ఇవ్వాలి. అప్పుడే కొనుగోలు చేయడానికి వీలవుతుంది. వైద్యులు ఇష్టారాజ్యంగా యాంటీ బయోటిక్స్‌ను సూచించరు, మందుల దుకాణాలకు వెళ్లి నేరుగా యాంటీ బయోటిక్‌ మందులు కొనుగోలు చేసే పరిస్థితి ఉండదు. కానీ మన దేశంలో ఎలాంటి నియంత్రణా లేదు. వైద్యులు సాధారణ జలుబు, జ్వరానికి కూడా యాంటీ బయోటిక్స్‌ రాసిస్తున్నారు. కొన్నిచోట్ల ఆర్‌ఎంపీలు, మందుల దుకాణదారులు కూడా నేరుగా విక్రయిస్తున్నారు. కొందరు వైద్యులు రోగుల మానసిక స్థితిని బట్టి త్వరగా ఉపశమనం కలగాలనే ఉద్దేశంతో యాంటీ బయోటిక్స్‌ రాసిస్తున్నారు. అసలు మన దేశంలోని 95 శాతం ఆసుపత్రుల్లో ఇన్‌ఫెక్షన్‌ డిసీజ్‌ కమిటీలు లేనే లేవు. పర్యవేక్షణ అంతంతే. వైరల్‌ జ్వరాలకు అసలు యాంటీ బయోటిక్స్‌ వాడకూడదు. ఒకవేళ వాడినా నిర్ణీత డోసుల్లో వాడాలి. మొత్తంగా ఈ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని, యాంటీ బయోటిక్స్‌ వినియోగంపై నియంత్రణ ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

"యాంటీ బయోటిక్స్‌ ఇష్టారాజ్యంగా ఉప యోగించడం వల్లే సూపర్‌బగ్‌లు తయార వుతున్నాయి. పిల్లలకు ఇష్టాను సారంగా యాంటీబయోటిక్స్‌ ఇస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. పిల్లలకు యాంటీ బయోటిక్స్‌ ఇవ్వకూడదు. మందుల కంపెనీల ధనదాహం కూడా ఈ పరిస్థితికి కారణంగా చెప్పుకోవచ్చు.." -డాక్టర్‌ యలమంచిలి రవీంద్రనాథ్, ఖమ్మం

"అధికంగా యాంటీ బయోటిక్స్‌ వాడకం వల్ల రోగాలు మొండిగా మారుతున్నాయి. సూపర్‌బగ్స్‌ కారణంగా ఏ యాంటీ బయోటిక్‌ కూడా పనిచేయని పరిస్థితి నెలకొంది. సాధారణ జబ్బులకూ ఐసీయూ, వెంటిలేటర్‌లను ఉపయోగించాల్సిన పరిస్థితులున్నాయి. రాష్ట్రంలో 10 నుంచి 20 శాతం వరకు సూపర్‌బగ్‌ ఆవరించి ఉందని అంచనా.." - డాక్టర్‌ సుదర్శన్‌రెడ్డి, కాంటినెంటల్‌ ఆసుపత్రి, హైదరాబాద్‌

"యాంటీ బయోటిక్స్‌ వినియోగంపై మన దేశంలో నియంత్రణ లేదు. దీంతో విచ్చలవిడిగా వాడకం జరుగుతోంది. అమెరికాలో కచ్చితమైన నియంత్రణ వ్యవస్థ ఉంది. అయితే మన వద్ద సూపర్‌బగ్‌ ఉందని, ఇండియాకు వెళితే సూపర్‌బగ్‌ వస్తుందని పాశ్చాత్య దేశాలు భయపెడుతున్నాయి. కానీ ఆ దేశాల్లోనూ సూపర్‌బగ్‌ ఉంది.." - డాక్టర్‌ టి.గంగాధర్, నెఫ్రాలజిస్ట్, నిమ్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement