జిల్లాకు చేరుకున్న ఆవీఎంలు
‘ముందస్తు’ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం ఎన్నికల ప్రక్రియకు ఏర్పాట్లలో వేగం పెంచింది. ఎన్నికల్లో కీలక భూమిక పోషించే ఈవీఎంలు, వీవీ ప్యాట్ యంత్రాలు జిల్లాకు చేరాయి. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాల నిర్వహణ మొదలు ఈవీఎంల భద్రతపై ప్రత్యేక దృష్టిసారించింది. బెంగళూర్ నుంచి జిల్లా కేంద్రానికి చేరిన ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాలను కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోదాంలో సీసీ కెమెరాల నిఘా, పోలీసు బందోబస్తు నడుమ భద్రపరిచారు.
కరీంనగర్‌సిటీ: జిల్లా వ్యాప్తంగా 1,142 పోలింగ్ కేంద్రాలున్నాయి. అయితే.. బెంగళూర్ నుంచి 1,430 కంట్రోల్ యూనిట్లు, 1,830 బ్యాలెట్ యూనిట్లు, 1,540 వీవీ ప్యాట్ పరికరాలు జిల్లాకొచ్చాయి. పోలింగ్ కేంద్రాలతో పోలిస్తే ఇవి అదనం. సాంకేతిక సమస్యలు వస్తే అదనపు పరికరాలను వినియోగించనున్నారు. జిల్లాలోని కరీంనగర్, చొప్పదండి, మానకొండూర్, హుజూరాబాద్ నియోజకవర్గాలలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణకు వీటిని వినియోగించనున్నారు. ఇప్పటికే గోదాముల్లో నిల్వ ఉన్న ఈవీఎంలను హైదరాబాద్‌లోని ఈసీఎల్ కంపెనీకి తరలించారు. 13,221 బీయూలు, 8,631 సీయూలను తరలించారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులతోపాటు 18 ఏళ్లు నిండిన వారి పేర్లను జాబితాలో చేర్చేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది.
పోలింగ్ కేంద్రాలలో మౌలిక వసతుల కల్పన, ఎన్నికల సిబ్బందికి శిక్షణపై దృష్టి సారించింది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల పెంపు, అవసరమున్న చోట కుదింపు, ప్రాంతాల మార్పు వంటి ప్రక్రియను వేగవంతం చేసింది. ఎన్నికల నిర్వహణకు ఆదేశాలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద గల పరిస్థితులు, బందోబస్తు ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం రెవెన్యూ, పోలీసులతో కలిసి సంయుక్తంగా సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈవీఎం గోదాం వద్ద 24 గంటల నిరంతర భద్రతకు ప్రత్యేకంగా సాయుధ పోలీసులను మోహరించారు. ఈవీఎం గోదాం చుట్టూ ప్రత్యేక రక్షణ, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
ఈవీఎం, వీవీప్యాట్ పనితీరుపై అవగాహన
ఈవీఎంల పనితీరుపై వివిధ పార్టీలు సందేహాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈసారి ఈవీఎంలకు అనుసంధానంగా వీవీ ప్యాట్ యంత్రాలు (ఓటు నిర్ధారణ) ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న వారు తమ ఓటు ఏ గుర్తుపై పడిందో తెలుసుకునే అవకాశముంది. అయితే.. రశీదులు మాత్రం ఎన్నికల సిబ్బంది తీసుకునే అవకాశముంది. చివరగా ఈవీఎంలో వేసిన ఓటు కంట్రోల్ యూనిట్‌తోపాటు వీవీ ప్యాట్‌లలో వచ్చిన రశీదుల సంఖ్యను చూపనున్నారు. ఇప్పటివరకు జిల్లాలో జరిగిన ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలకు వీవీ ప్యాట్ సౌకర్యం లేదు. వీవీ ప్యాట్ ఉన్న ఈవీఎంలను వచ్చే ఎన్నికల్లో వినియోగించనున్నారు. జిల్లాకు వచ్చిన ఈవీఎంల గుర్తింపు సంఖ్యను ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు.
ఆన్‌లైన్‌లో నమోదు అనంతరం అవి పనిచేసేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోనున్నారు. అనంతరం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా నియోజకవర్గ స్థాయిలో ఈవీఎంలు, వీవీప్యాట్‌ల పనితీరును వివరిస్తారు. పట్టణ, గ్రామాల్లోనూ ఈవీఎం, వీవీప్యాట్‌ల పనితీరుపై అవగాహన కల్పించనున్నారు. స్వయంగా యంత్రాలలో ఓటు వేసి చూపించనున్నారు. కొత్త ఈవీఎంలు రావడంతో వీటి పనితీరు వినియోగంపై బెల్ కంపెనీకి చెందిన ఇంజినీరింగ్ సిబ్బంది జిల్లా అధికారుల సమక్షంలో ఫస్ట్‌లెవల్ చెకింగ్ చేపట్టనున్నారు. అక్టోబర్ 1న సిబ్బంది జిల్లాకు రానున్నారని సంబంధిత అధికారులు చెబుతున్నారు. వారి సమక్షంలోనే రాజకీయ ప్రతినిధులకు వాటి పనితీరుపై స్వయంగా ఓటు వేసి చూపుతూ అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. ఇప్పటికే వీవీప్యాట్‌ల పనితీరుపై జిల్లాలో మొదట జ్యూడీషియల్ అధికారులు, పోలీసు అధికారులకు అవగాహన కల్పించారు. మలిదశలో రాజకీయ పార్టీల ప్రతినిధులకు. నియోజకవర్గాల వారీగా నెల రోజుల పాటు ఓటర్లకు అవగాహన కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
9 సీసీ కెమెరాల ఏర్పాటు
జిల్లాకు చేరుకున్న ఈవీఎంలను కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోదాంలో భద్రపరిచారు. గోదాం చుట్టూ ప్రత్యేక రక్షణ కల్పించారు. 9 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈవీఎంల పర్యవేక్షణకు మెప్మా పీడీ పవన్‌కుమార్‌ను నోడల్ అధికారిగా నియమించారు. అక్కడ 24 గంటల నిరంతర భద్రతకు ప్రత్యేకంగా సాయుధ పోలీసులను మోహరించారు. గోదాములోకి వెళ్లే ప్రతీ ఒక్కరిని మెటల్ డిటెక్టర్‌తో తనిఖీ చేసి లోనికి అనుమతిస్తున్నారు. సాయుధ బలగాల రక్షణలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఎన్నికలకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఈవీఎంలు నిల్వ చేసిన గోదాము వద్ద పోలీస్, రెవెన్యూ శాఖలు లాగ్ పుస్తకాలను అందుబాటులో ఉంచారు. కేంద్రానికి వచ్చే ప్రతి ఒక్కరూ లాగ్ పుస్తకంలో వివరాలు రాసి సంతకం చేయాల్సి ఉంటుంది. పేరు, హోదా, ఎందుకు వచ్చారు? ఏం పనిచేశారు? ఏ సమయంలో వచ్చి ఏ సమయంలో వెళ్లారు? అనే వివరాలు నమోదు చేస్తున్నారు.
ఈవీఎం గోదామును పరిశీలించిన కలెక్టర్
ఈవీఎం గోదామును శనివారం సాయంత్రం కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తనిఖీ చేశారు. జిల్లాకు బెంగళూర్ నుంచి ఈవీఎంలు వచ్చాయని పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీల సమక్షంలో ఈవీఎంల పనితీరు పరిశీలించేందుకు గోదాములలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈవీఎంలపై రాజకీయ పార్టీలకు పూర్తి అవగాహన కల్పిస్తామన్నారు. రాజకీయ పార్టీలకు ఈవీఎంల అవగాహన కార్యక్రమాన్ని వీడియోగ్రఫీ చేయించాలని అధికార్లను ఆదేశించారు. ఆయన వెంట డీఆర్‌వో బిక్షూనాయక్, మెప్మా పీడీ పవన్‌కుమార్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment