
శిథిలావస్థకు చేరుకున్న చిన్నమారు మినీ లిఫ్ట్ మోటార్లు
సాక్షి, చిన్నంబావి: నూతన పరిషత్ పాలకవర్గం కొలువుదీరనుండగా.. మండలంలోని ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారమవుతాయని ప్రజలు కొంత ఆశతో ఎదురుచూస్తున్నారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా నిబద్ధతలో పనిచేస్తామని హమీల వర్షం గుప్పించి అధికారంలోకి వచ్చిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలకు మండలంలోని పలు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఒకవైపు ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ..మరోవైపు అభివృద్ధి వనరులు సమకూర్చేందుకు వీరికి శక్తికి మించిన భారంకానుంది. పల్లెల బలోపేతం కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన పంచాయతీరాజ్ చట్టం విధులు, విధానాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
కొత్త మండలం.. సమస్యలతో సతమతం
నూతనంగా ఏర్పడిన చిన్నంబావి మండలంలో అనేక సమస్యలు తిష్ట వేశాయి. మండలంలో ఒక్క ప్రభుత్వ కార్యాలయానికి పక్కా భవనం లేదు. పేరుకే మండలం ఏర్పడింది కాని చాలా వరకు శాఖలు ఉమ్మడి మండలం అయిన వీపనగండ్లలోనే కొనసాగుతున్నాయి. ఎంపీడీఓ, ఎంఈఓ, ఉద్యానవనశాఖ, పశువైద్యశాల, ప్రభుత్వ ఆసుపత్రి తదితర కార్యాలయాలన్ని అక్కడే కొనసాగుతున్నాయి. అదేవిధంగా చాలా కార్యాలయాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. దీనికితోడు ఇక్కడ ఒక్క పాఠశాల కూడా లేకపోవడంతో స్థానికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకు, సంక్షేమ హాస్టల్‌ను ఏర్పాటు చేసేందుకు నూతన ప్రజాప్రతినిధులను ప్రజలు కోరుతున్నారు.
రైతుల కల నెరవేరేనా..?
కృష్ణానది చెంతనే ఉన్న గుక్కెడు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఇక్కడి ప్రాంత రైతులు అధికారులను, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న కనీసం వాటి పరిష్కారం దిశగా అడుగులు వేయకపోవడం బాధకరమని ఇక్కడి ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టుకు టెయిలండ్ ప్రాంతం కావడంతో పంటల చివరి దశకు వచ్చే సరికి సాగునీరు అందక వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు అప్పుల పాలవుతున్నారు. కృష్ణానదిపై ఉన్న చెల్లెపాడు, చిన్నమారూర్ మినీలిప్టులు గత దశాబ్ధ కాలంగా మరమ్మతుకు గురై శిథిలావస్థకు చేరాయి. ఎన్నికల సమయానికి లిప్టుల ప్రస్తావన తప్ప వాటికి పూర్తిస్థాయి పరిష్కార మార్గం చూపడం లేదని ఆందోళన చెందుతున్నారు. ఆ రెండు లిప్టులను మరమ్మతు చేస్తే దాదాపుగా 12వేల ఎకరాలకు సాగునీరు పుష్కాలంగా అందుతుంది. వీటి పరిష్కారం కోసం ఎంపీపీ,జడ్పిటిసిలు ప్రయత్నించాలని ఇక్కడి ప్రాంత రైతులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment