పూచీకత్తు ఇవ్వాల్సిందే.. | New marketing law guidelines | Sakshi
Sakshi News home page

పూచీకత్తు ఇవ్వాల్సిందే..

Published Thu, Dec 28 2017 1:50 AM | Last Updated on Thu, Dec 28 2017 1:50 AM

New marketing law guidelines - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయ మార్కెట్‌ వ్యాపారులకు, ఏజెంట్లకు సర్కారు ముకుతాడు బిగించింది. ఆయా మార్కెట్ల టర్నోవర్‌ను బట్టి వ్యాపారులు, ఏజెంట్లు తప్పనిసరిగా రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు బ్యాంకు గ్యారంటీ చూపాలని సర్కారు నిర్ణయించింది. బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త మార్కెటింగ్‌ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ చట్టం అమలు మార్గదర్శకాలు, నిబంధనలపై నోటిఫికేషన్‌ జారీ చేసింది.  

డబ్బు ఎగ్గొడుతున్న వైనం..
ఇప్పటి వరకు ఏజెంట్లు, వ్యాపారులకు ఎలాంటి బ్యాంక్‌ గ్యారంటీ ఉండేది కాదు. అయితే చాలాచోట్ల వ్యాపారులు, ఏజెంట్లు రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి డబ్బు ఎగ్గొడుతున్నారు. ఇలాంటి పరిస్థితికి చరమగీతం పాడాలనే ఉద్దేశంతో బ్యాంకు గ్యారంటీని తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రకారం రాష్ట్రంలో 10 వేల మంది వ్యాపారులు, 4,200 మంది ఏజెంట్లు కొత్తగా బ్యాంకు గ్యారంటీ చూపాల్సి ఉంది. వారికి మూడేళ్లకోసారి లైసెన్సులు జారీ చేస్తారు.  

మరిన్ని మార్గదర్శకాలు
కాంట్రాక్టు వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తారు. అయితే రైతుతో కాంట్రాక్టు చేసుకునే స్పాన్సర్‌.. తప్పనిసరిగా పంట ఉత్పత్తి అంచనాలో 20 శాతం బ్యాంకు గ్యారంటీ చూపాలి. అప్పుడే అతన్ని కాంట్రాక్టు వ్యవసాయంలో భాగస్వామిని చేస్తారు.
 కొనుగోలుదారులకు ఒక ఫారం, కమీషన్‌దారులకు మరో ఫారం, గోదాములకు మరో ఫారం, ప్రాసెసింగ్‌ యూనిట్లకు ఒక ఫారం ద్వారా లైసెన్సులు జారీ చేస్తారు. కేటగిరీల వారీగా షరతులు విధించి లైసెన్సులు జారీ చేస్తారు.
రూలు 49–బి ద్వారా క్లియరింగ్, ఫార్వర్డింగ్‌ ఏజెంట్‌ వ్యవస్థ ఏర్పాటు. అన్ని మార్కెట్లలో ఇలాంటి వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. సరుకులను సులువుగా రవాణా చేసేందుకు అవకాశం కలుగుతుంది.
లైసెన్స్‌ సస్పెండ్‌ చేసే అధికారం డైరెక్టర్‌కు కల్పించారు. దీనివల్ల పర్యవేక్షణ ఉంటుంది. అవసరమైతే కఠిన చర్యలు తీసుకునే వీలుంటుంది.
కమీషన్‌ ఏజెంటు జారీ చేసే తక్‌పట్టీ మాత్రమే కాకుండా ఆన్‌లైన్‌లోనూ తక్‌పట్టీ ఇచ్చేలా ఏర్పాటు చేయాలి. దీంతో తక్‌పట్టీ కోసం కమీషన్‌ ఏజెంటుపై రైతు ఆధారపడే పరిస్థితి పోతుంది. అనుమతిలేని చెల్లింపులను తక్‌పట్టీలో పొందుపరచకుండా నిషేధించే అవకాశముంది.
మార్కెట్‌ కమిటీ రికార్డుల్లో నమోదు ద్వారా రైతు సరుకుకు పూర్తి భద్రత కల్పించారు. ఇందుకోసం స్టోరేజీ స్లిప్‌ను ఆన్‌లైన్‌ మార్కెట్‌ ద్వారా రైతు పొందే అవకాశముంది.
మార్కెట్‌ చార్జీలను కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్‌లే నిర్ణయించే అధికారం కల్పించారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వారు నిర్ణయం తీసుకుంటారు.
నెలవారీ కొనుగోలు నివేదికలను వ్యాపారులు ఇవ్వాలి. దీంతో పర్యవేక్షణ, నియంత్రణ ఉంటుంది. వ్యాపారులకు ఈ–ప్లాట్‌ఫాం ద్వారా పర్మిట్లు తీసుకునే వెసులుబాటు కల్పించడంతో అక్రమ రవాణా తగ్గుతుంది. ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది.

ఎవరైనా ఏర్పాటు చేసుకోవచ్చు..
రాష్ట్రంలో ఎవరైనా సరే ధాన్యం, ఇతర పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ కేంద్రాల ద్వారా మద్దతు ధరకు రైతుల పంటను కొనుగోలు చేయాలి. ఇందులోకి రిలయన్స్‌ సహా ఆ స్థాయి కలిగిన సంస్థలను ఆహ్వానించాలన్న ఆలోచన ప్రభుత్వంలో ఉంది. అలాగే గోదాములు, వేర్‌ హౌజింగ్, కోల్డ్‌ స్టోరేజీలు, ప్రాసెసింగ్‌ యూనిట్లను కూడా మార్కెట్లుగా మార్చేందుకు వీలు కల్పించారు. కమీషన్‌ ఏజెంటు రైతుకు డబ్బు చెల్లించాకే వ్యాపారికి పంట అందజేయాలి.

చెల్లింపుల వివరాలు తెలిపే రికార్డులను కమీషన్‌ ఏజెంటు నిర్వహించాలి. ఇలా చేయడం వల్ల రైతు అమ్మిన పంటకు తక్షణమే సొమ్ము చేతికి వస్తుంది. అలాగే ప్రైవేటు మార్కెట్లలో ఆన్‌లైన్‌ మార్కెట్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. రూ.3 కోట్లతో వసతులు కల్పిస్తారు. మార్కెటింగ్‌ డైరెక్టర్‌ అనుమతించిన ప్రైవేటు మార్కెట్‌ లైసెన్సుదారులకు యూజర్‌ చార్జీలు వసూలు చేసుకునే వెసులుబాటు ఇచ్చారు. ప్రైవేటు మార్కెట్‌ లైసెన్సులు ప్రోత్సహించడంతోపాటు ఆన్‌ లైన్‌ మార్కెట్‌ వ్యవస్థను బలోపేతం చేస్తారు. తద్వారా ఈ–నామ్‌ పటిష్టమవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement