చలించి..స్పందించి | new pension distribution started | Sakshi
Sakshi News home page

చలించి..స్పందించి

Published Sun, Nov 9 2014 3:58 AM | Last Updated on Sat, Sep 2 2017 4:06 PM

new pension distribution started

 కవిత: నమస్తే అమ్మా. నాపేరు గడిపల్లి కవిత.. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌ను. మీ ఊళ్లో సమస్యలు తెలుసుకోవడానికి వచ్చాను. ఏ సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నారు..?
 శౌరి: వర్షం వస్తే.. గ్రామంలో రోడ్లు అన్నీ బురదగా మారుతున్నాయి. మురుగు కాల్వలు పొంగి ఇళ్లలోకి నీరొస్తోంది. కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ? ఎప్పుడు పోతుందో తెలియడం లేదు.
 కవిత: ఎవరైనా అధికారులు వచ్చినప్పుడు ఈ సమస్య చెప్పారా..?
 శౌరి: ఎన్నో సార్లు అధికారులకు చెప్పాం. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. మేము కూలీ పనులకు వెళ్లే వాళ్లం. ఎవరి వద్దకూ వెళ్లలేం. ఈ పనులన్నీ అధికారులే చేయించాలి.
 కవిత: ఎందుకు ఏడుస్తున్నావమ్మా..? నీ సమస్య ఏంటీ..?
 మంగతాయారు: మాది పేద కుటుంబం. నాకు జబ్బు చేసి పశ్చవాతం వచ్చింది. మందుల్లేవు, పట్టించుకునే వారు లేరు. నేను ఎట్లా బతకాలి.
 కవిత: నేను లెటర్ రాసి ఇస్తా, గవర్నమెంట్ ఆస్పత్రికి వెళ్తావా?
 మంగతాయారు: మందుల కోసం వెళ్తా.
 కవిత: మీరేం చేస్తున్నారు..?
 నంద: అమ్మా.. నేను రోజూ కూలీకి వెళ్లేదాన్ని. పంటలు ఎండిపోవడంతో కూలీ పని దొరకడం లేదు.
 కవిత: నీకు ఎంతమంది పిల్లలు. ఆడపిల్లను చదివించాలి. డ్వాక్రాలో డబ్బులు పొదుపు చేయండి.
 దుర్గ: నేను కూలీకి వెళ్తా. ఒక్కతే ఆడపిల్ల. 6వ తరగతి వరకు చదివించాను. ఇంకా చదవమంటే చదవనంటోంది. మీరు చెప్పినట్లు కష్టం చేసైనా చదివిస్తా.
 కవిత: రాంబాయీ.. నిన్ను ప్రజలు ఎన్నుకున్నారు. వార్డు సభ్యురాలివి. వారి సమస్యలపై అవగాహన ఉండాలి. పంచాయతీ సమావేశాల్లో సమస్యలు చర్చిస్తారా?
 రాంబాయి: నేను చదువుకోలేదమ్మ. మీరు చెప్పినట్లు చదువు నేర్చుకుంటా. గ్రామంలో రోడ్లు, మురుగు కాలువలు సరిగా లేవు.
 కవిత: ఏం తాత.. ఏ పంట వేశావు. ఎలా ఉంది?
 వీరు: రెండు ఎకరాల్లో పత్తి వేశానమ్మా. వర్షాలు లేక పంట ఎండి పోయింది. పండిన పంటకు రేటు కూడా రానట్లుంది. ఈసారి కాలంతో నష్టమే వచ్చింది.
 కవిత: అవ్వా నీకు పింఛన్ వస్తుందా..?
 పుల్లమ్మ: నా భర్త చనిపోయి 25 ఏళ్లు అయింది. నేను ఒక్కదాన్నే ఉంటున్నా. కూలీకి పోవడానికి కూడా చేత కావడం లేదు. పింఛన్ రావట్లే.. వస్తే ఆ డబ్బుతోనే బతుకుతా.
 కవిత: మీరు వ్యవసాయం చేస్తున్నారా..?
 వీరయ్య: చేస్తున్నానమ్మా. కరెంట్ ఉండడం లేదు. పంటలు ఎండిపోతున్నాయి. వ్యవసాయానికి కరెంట్ ఇస్తే పంటలు చేతికి అందేవి. కాలంకాక ఏంచేయాలో అర్థం కావడం లేదు.
 కవిత: చిన్నా చదువుకుంటున్నావా. అంగన్‌వాడీ కేంద్రంలో ఏం పెడతారు?
 లక్ష్మీప్రసన్న: అ..ఆలు చదువుకుంటున్నా. అంగన్‌వాడీ స్కూల్‌కు వెళ్తున్నా. గుడ్డు పెడుతున్నారు. మురుకులు ఇస్తున్నారు.
 కవిత: అంగన్‌వాడీ కేంద్రంలో అన్నీ ఇస్తున్నారా.. పిల్లలు ఎంతమంది వస్తున్నారు?
 కవిత(అంగన్‌వాడీ టీచర్): మేడమ్. మా కేంద్రంలో 25 మంది పిల్లలు ఉన్నారు. గర్భిణులకు మెనూ ప్రకారం పోషక పదార్థాలు అందిస్తున్నాం.

 కవిత: తాత మీ ఊళ్లో ఏ సమస్యలు ఉన్నాయి?
 గోపాల్: ఫ్లోరైడ్ నీళ్లతో ఊళ్లో అందరికి కాళ్ల నొప్పులు, నడుంనొప్పులు వస్తున్నాయి. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు.
 కవిత: సర్పంచ్‌గారు.. మీ ఊరి గురించి చెప్పండి?
 నాగేశ్వరరావు: మేడమ్. ఊళ్లో ప్లోరైడ్ సమస్య తో ఇబ్బంది పడుతున్నాం. 50ఏళ్ల వయసున్న వారు 70ఏళ్ల మనుషుల్లా ఉంటున్నారు. గ్రామం లో ఉన్న మంచినీటి పైపులైన్లలో ఫ్లోరైడ్ పేరుకపోయింది. ఎక్కడ బోరు వేసినా ఫ్లోరైడే వస్తుం ది. ఈ నీటిని గ్రామస్తులు తాగలేకపోతున్నారు.
 కవిత: ఈ విషయం అధికారులకు చెప్పారా..? ఏం చర్యలు తీసుకున్నారు?
 నాగేశ్వరరావు: ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు చెప్పాం. చాలా చోట్ల బోరు వేయడానికి పరిశీలించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. పాలేరు ద్వారా సాగర్ కాలువతో లకారం చెరువు నీటిని నింపి అక్కడి నుంచి పైపులైను ద్వారా గ్రామానికి మంచినీటిని అందించడానికి ప్రతిపాదన చేశారు. ఈ పనులు ముందుకు సాగడం లేదు.
 కవిత: ఈఓపీఆర్‌డీగారు.. ఈ పనులు ఎంతవరకు వచ్చాయి?
 ఈఓపీఆర్‌డీ: మేడమ్. లకారం చెరువు నుంచి మండలంలోని 15 గ్రామాలకు మంచినీటి అందించేందుకు పైపులైన్లు వేస్తున్నారు. త్వర లో ఈ గ్రామానికి కూడా మంచినీళ్లు వస్తాయి.
   కవిత: మీ సమస్య ఏంటీ?
 షేక్ జానీ: అధికారులు పాత పైపులైన్ల ద్వారానే లకారం చెరువు మంచినీటి అందించాలని చూస్తున్నారు. ఈ పైపులతో గ్రామంలోకి నీరు, మంచినీరు వస్తే మళ్లీ ఫ్లోరైడ్ వస్తుంది.
 జెడ్పీ చైర్‌పర్సన్ హామీలు..
 నేను మీ గ్రామానికి విలేకరిగా వచ్చాను. ఇక్కడ అన్ని సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నాను. గ్రామంలో ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉంది. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి పాలేరు నుంచి లకారం చెరువుకు నీటిని మళ్లించి అక్కడి నుంచి పైపులైన్ల ద్వారా అందించే పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటా. గ్రామంలో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు, డ్రైనేజీలను నిర్మించేందుకు అంచనాలు రూపొందించడంతో పాటు, జెడ్పీ నిధుల నుంచి ఈ పనులు పూర్తి చేసేలా కృషి చేస్తా. గ్రామంలో ఉన్న అర్హులందరికీ పింఛన్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు చెపుతా. గ్రామంలో సాక్షర భారత్ కేంద్రాలను నిరంతరాయంగా కొనసాగించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement