సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తోందని.. అన్ని స్థానాలు గెలవనున్నామని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలోని కోస్గి మండల కేంద్రంలో కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి, పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్‌రెడ్డి ఆధ్వర్యాన బుధవారం నిర్వహించిన ‘కొడంగల్ రణరంగం’ బహిరంగ సభలో రాహుల్ ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో గడిచిన అయిదేళ్లలో ఆశలన్నీ అడియాసలయ్యాయని పేర్కొన్నారు.
కేసీఆర్ కుటుంబంలోని నలుగురు వ్యక్తులు.. నాలుగు కోట్ల మంది ప్రజలను మోసగించారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేదలకు ఇళ్లు, భూపంపిణీ, ఉద్యోగ అవకాశాల కల్పన చేస్తామని వాగ్దానం చేశారు. అంతేకాదు కేంద్రంలో నరేంద్రమోదీకి కేసీఆర్ అన్ని రకాలుగా సహకరిస్తున్నారని ఆరోపించారు. అందుకే తెలంగాణలో టీఆర్‌ఎస్ అంటే తెలంగాణ రాష్ట్రీయ సంఘ్ పరివార్‌గా మారిందని ఆయన వ్యాఖ్యానించారు.
డీకే అరుణ గైర్హాజరు
కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో నిర్వహించిన రాహుల్‌గాంధీ సభకు కాంగ్రెస్ ప్రచార కమిటీ కోచైర్‌పర్సన్ డీకే అరుణ, జి.చిన్నారెడ్డి, చల్లా వంశీచంద్‌రెడ్డి గైర్హాజరయ్యారు. ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాలకు గాను 11 స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు హాజరయ్యారు. ఆఖరికి ప్రజాకూటమిలో భాగస్వామ్యంగా పోటీలో ఉన్న టీడీపీ అభ్యర్థు లు ఎర్రశేఖర్, కె.దయాకర్‌రెడ్డి కూడా వచ్చారు.
అయితే, డీకే.అరుణ గైర్హాజరు చర్చనీయాంశంగా మారింది. కాగా, డిసెంబర్ 3న గద్వాలలో రాహుల్ సభ ఉంటుందని.. అందుకే ఆమె హాజరు కాలేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సభలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా, డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, అభ్యర్థులు బీరం హర్షవర్ధన్‌రెడ్డి, డోకూరు పవన్‌కుమార్‌రెడ్డి, సరాఫ్ కృష్ణ, నాగం జనార్దన్‌రెడ్డి, వంశీకృష్ణ, మల్లు రవి, సంపత్‌కుమార్, సి.ప్రతాప్‌రెడ్డితో పాటు నాయకులు వార్ల విజయ్, నరేందర్, రఘువర్ధన్‌రెడ్డి, తుడుం శ్రీనివాస్, సలీం, ఎర్ర కిష్టప్ప పాల్గొన్నారు.
రాహుల్ రాకతో గెలుపు ఖాయమైంది..
రాహుల్ అడుగుతో కోస్గి గడ్డ పుణీతమైంది. 1978 ఎన్నికల సమయంలో మర్రి చెన్నారెడ్డి నాయకతావన ఆనాడు ఇందిరాగాంధీ కోస్గి బస్‌స్టేషన్ పక్కన ఉన్న శాంతినగర్‌కు వచ్చారు. అప్పుడు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 175 స్థానాలు సంపాదించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 40 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఎన్నికల కురుక్షేత్రంలో ప్రజాకూటమిని గెలిపించడానికి, అండగా నిలబడటానికి ఢిల్లీ నుంచి రాహుల్ వచ్చారు. దీంతో గెలుపు ఖాయమైంది.
తొమ్మిదేళ్లు వెనక్కి తిరిగి చూసుకుంటే.. 2009లో కేవలం 14 రోజుల్లోనే ఏడువేల మెజారిటీతో గెలిపించి గుండెల్లో చూసుకున్నారు. కొడంగల్ ప్రాంతానికి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాం. రాష్ట్రంలో కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణలో భాగంగా రాహుల్‌గాంధీ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపు మేరకు అందరం కూడా కాంగ్రెస్‌లో చేరాం. గల్లీలో ఉన్న మన గళాన్ని ఢిల్లీ వరకు ఆహ్వానించి ఈ మువ్వన్నెల జెండాను కప్పి.. రాష్ట్రానికి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించి కొడంగల్ ఆత్మగౌరవాన్ని నలుదిశలా వ్యాపించడానికి రాహుల్‌గాంధీ అవకాశం ఇచ్చారు.
కేసీఆర్ అవినీతి, కుటుంబ పాలనకు, దోపిడికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే నాపై కత్తి కట్టారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న తనపై ఈ నాలుగేళ్లలో కేసీఆర్ 39 కేసులు పెట్టించిండు. 40 రోజులు జైలులో పెట్టినా కూడా భయపడలేదు. ప్రజలు అండగా ఉన్నంత కాలం చివరి శ్వాస వరకు, ఆఖరి నిమిషం వరకు కేసీఆర్‌ను కూకటి వేళ్లతో పెకిలించి బంగాళాఖాతంలో వేయడానికి పోరాటం చేస్తా.
– రేవంత్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్
Comments
Please login to add a commentAdd a comment