
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే గణనీయంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో ఆదిలాబాద్‌లో 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక మెదక్‌లో సాధారణం కంటే 3 డిగ్రీలు తక్కువగా 11 డిగ్రీలు, ఖమ్మంలో 5 డిగ్రీలు తక్కువగా 12 డిగ్రీలు, రామగుండంలో 2 డిగ్రీలు తక్కువగా 13 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలం, హన్మకొండ, నిజామాబాద్‌ల్లో సాధారణం కంటే 3 డిగ్రీలు తక్కువగా 14 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు పగటి ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణం కంటే 4 డిగ్రీల వరకు అధికంగా నమోదయ్యాయి.
నగరంలోనూ పెరిగిన చలి తీవ్రత
ఈశాన్యం నుంచి వీస్తున్న చలిగాలులు.. శరవేగంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలతో నగర వాసులు గజగజలాడుతున్నారు. మంగళవారం నగరంలో కనిష్టంగా 13.6 డిగ్రీలు, గరిష్టంగా 32.2 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న 24 గంటల్లో నగరంలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశముందని బేగంపేటలోని వాతావరణ శాఖ తెలిపింది. చలి తీవ్రత నుంచి రక్షణ పొందేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.