కొమురం భీంను నిజాం చంపలేదు
- ప్రజలు చనిపోయింది.. పోలీస్ యాక్షన్ వల్లే: నాయిని
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ పాలకులు చేపట్టిన పోలీస్ యాక్షన్ వల్లనే తెలంగాణ సాయుధ పోరాటం చేసిన కమ్యూనిస్టులు, ప్రజలు చనిపోయారు తప్ప నిజాం నవాబు వల్ల కాదని రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. నిజాం 99 శాతం మంచి పనులు చేశారని, రజాకార్ల వల్ల కొంత చెడు జరిగిందన్నారు. నిజాం ప్రజల మనిషి కాబట్టే కేసీఆర్ ఆయనను పొగిడారని, టీడీపీ నేతలు ఎర్రబెల్లి, రేవంత్‌రెడ్డి వంటి వాళ్లకు చరిత్ర తెలియదని ధ్వజమెత్తారు.
స్పీకర్ మధుసూదనాచారి ప్రాతినిధ్యం వహిస్తున్న భూపాలపల్లి నియోజకవర్గం చిట్యాల మండలానికి చెందిన టీడీపీ, కాంగ్రెస్‌కు చెందిన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు శనివారం తెలంగాణ భవన్‌లో మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడారు. కొమురం భీం, చాకలి ఐలమ్మ వంటి వారు నిజాంకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలొడ్డితే ఆయనను పొగడడాన్ని ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయని విలేకరులు ప్రస్తావించగా ‘కొమురంభీంను నిజాం చంపలేదు.
ఆయన ఆదేశాలు ఇచ్చినట్లు కూడా ఎవ్వరూ చెప్పలేదు’ అని సమాధానమిచ్చారు. నిజాం కాలంలోనే నిజాం సాగర్ కట్టారని, రైల్వేస్టేషన్లు, హాస్పిటళ్లు, చారిత్రక కట్టడాలన్నీ ఆయన కట్టించినవేనన్నారు. వాటర్‌గ్రిడ్, చెరువుల పునరుద్ధరణ, పింఛన్లు వంటి సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే పల్లెలకు పల్లెలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నాయన్నాయన్నారు.