బెదిరింపుల్లో నిజాం వారసుడు కేసీఆర్ | Nizam's successor threats KCR | Sakshi
Sakshi News home page

బెదిరింపుల్లో నిజాం వారసుడు కేసీఆర్

Published Fri, Mar 20 2015 1:05 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

బెదిరింపుల్లో నిజాం వారసుడు కేసీఆర్ - Sakshi

బెదిరింపుల్లో నిజాం వారసుడు కేసీఆర్

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి
  • షాక్ ట్రీట్‌మెంటు ఇస్తేనే కేసీఆర్ దిగివస్తాడు: ఆర్.కృష్ణయ్య
  • సాక్షి, హైదరాబాద్: బెదిరింపులకు దిగడంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిజాం వారసునిగా వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యతో కలసి గురువారం ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో కాలేజీలను, విద్యావంతులను సీఎం కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు బెదిరిస్తున్నారని ఆరోపించారు.

    ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలిస్తే కేసీఆర్ నియంతృత్వం, ఏకఛత్రాధిపత్యం పెరిగిపోతుందన్నారు.  కేసీఆర్ వందిమాగధుల్లో మరో ఇద్దరు భజనపరులు చేరడం తప్ప ప్రజలకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బెదిరింపుల్లో నిజాంకు కేసీఆర్ వారసుడే అయినా భయపడటానికి ఇది నిజాం నాటి కాలం కాదని హెచ్చరించారు. పట్టభద్రుల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీయడానికి బీజేపీనే గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌ను విడుదల చేశారన్నారు.
     
    ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారు : కృష్ణయ్య

    తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అన్నివర్గాలను మోసం చేసిన సీఎం కేసీఆర్ విమానాల మీద గాలిలో తిరుగుతున్నారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో షాక్ ట్రీట్‌మెంటు ఇస్తేనే భూమి మీదకు దిగొస్తారని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఎవరినీ లెక్కచేయడం లేదన్నారు. టీపీఎస్సీ ఏర్పాటుకాగానే ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి మోసం చేశారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్‌కు బుద్ధిచెప్పే అవకాశం వచ్చిందన్నారు. ప్రలోభాలకు లొంగకుండా బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కృష్ణయ్య కోరారు. ఈ సమావేశంలో బీజేపీ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి ఎన్.రామచందర్‌రావు, బీసీ సంఘాల నేతలు గుజ్జ కృష్ణ, రాధాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement