రూ.లక్షల్లో బిల్లు.. తెల్ల కాగితంపైనే! | No Bills In Hyderabad Markets | Sakshi
Sakshi News home page

రూ.లక్షల్లో బిల్లు.. తెల్ల కాగితంపైనే!

Published Thu, Jan 10 2019 10:35 AM | Last Updated on Thu, Jan 10 2019 10:35 AM

No Bills In Hyderabad Markets - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: ‘మార్కెట్‌లో ఏ వస్తువు కొన్నా బిల్లు తీసుకోవాలని, అది వినియోగదారుడి హక్కు’ అంటూ ఓపక్క.. వినియోగదారుల శాఖ ప్రచారం చేస్తుంది. ‘సకాలంలో పన్నులు చెల్లించండి.. దేశాభివృద్ధిలో పాలుపంచుకోండి’ అంటూ వాణిజ్య పన్నుల శాఖ ఇంకోపక్క చేస్తున్న ప్రచారం కేవలం ప్రకటనలే పరిమితం అవుతోంది. నగరంలోని బేగంబజార్, కోఠి, సుల్తాన్‌ బజార్, అబిడ్స్, మోజంజాహీ మార్కెట్, ట్రూప్‌ బజార్‌తో పాటు దాదాపు అన్ని మార్కెట్లలోనూ బిల్లులు ఇవ్వకుండానే దర్జాగా సాగుతున్న వ్యాపారాలు మాత్రం ఆయా శాఖల దృష్టికి రాకపోవడం గమనార్హం. ఇక్కడడొకవేళ ఎవరైనా బిల్లు అడిగితే కాగితంపై రాసి ఇస్తున్నా వాణిజ్య పన్నుల శాఖ పట్టించుకోకపోవడం గమనార్హం. ఈ నామమాత్రపు బిల్లుపై దుకాణం పేరు, రిజిస్టర్‌ నంబర్‌ ఉండవు. ఒకవేళ వినియోగదారులకు అసలు బిల్లు ఇస్తే ట్యాక్స్‌తో వస్తువుల ధర మరింత పెరుగుతుందని వ్యాపారులు చెబుతుండడంతో కొనుగోలుదారులు సైతం అసలు బిల్లు తీసుకునేందుకు జంకుతున్నారు. ప్రస్తుతం జీఎస్‌టీ చట్టం అమలులో ఉన్నా ‘జీరో బిజినెస్‌’కు అనేక మార్గాలు ఉన్నాయని పలువురు వ్యాపార నిపుణులు చెబుతున్నారు. అమ్మకాల విలువలో కొంత శాతం మాత్రమే వాణిజ్య పన్నుల శాఖ రికార్డుల్లో కనిపిస్తుంది. ఈ విషయం అధికారులకు కూడా తెలిసినా చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. బేగంబజార్, కోఠి, సుల్తాన్‌బజార్, అబిడ్స్, మోజంజాహీ మార్కెట్, ట్రూప్‌ బజార్, పత్తర్‌ఘట్టి, చార్మినార్‌ ప్రాంతాల్లోనూ జోరుగా జీరో వ్యాపారం జరుగుతోంది. పన్ను వసూళ్లు పెరిగేలా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అక్రమ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది.

జీరో దందా మార్కెట్లు
తక్కువ ధరకే వస్తువులు దొరకడం బేగంబజార్‌ ప్రత్యేకత. ఇక్కడ 1770 నుంచే వ్యాపారం సాగుతోంది. అన్ని రకాలు వస్తువులు దొరికి దుకాణాలు ఇక్కడ వందల సంఖ్యలో ఉన్నాయి. వీటిలో రోజూ లక్షల్లో వ్యాపారం జరుగుతుంది. ఇక్కడి నుంచే జిల్లాలకు కూడా సరఫరా అవుతుంటాయి. బేగంబజార్‌ను ఆనుకొని ఉన్న ముక్తియార్‌గంజ్, కిషన్‌గంజ్, ఉస్మాన్‌గంజ్, మహరాజ్‌గంజ్‌ తదితర మార్కెట్లలో చిరు ధాన్యాలు, పిండి, బియ్యం, నూనె హోల్‌సేల్‌ వ్యాపారం జరుగు తుంది. దుకాణాలు చూసేందుకు చిన్నగా కనిపించినా వీటి గోడౌన్లు ప్రత్యేకంగా ఉంటాయి. ఇక్కడ డబ్బులు చెల్లిస్తే సరుకు మాత్రం గోడౌన్ల నుంచి సరఫరా చేస్తారు. ఇలా నిత్యం పెద్ద మొత్తంలో వ్యాపారం జరుగుతున్నా లెక్కల్లో కనిపించేది మాత్రం నామమాత్రమే.  

జీఎస్‌టీ అమలు ఎక్కడ?
వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ) అమల్లోకి వచ్చాక ప్రతి బిల్లు జీఎస్‌టీఎన్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాల్సి ఉంది. దేశం అంతటా ఒకే పన్ను కావడంతో చెల్లించడం తప్పనిసరిగా మారింది. ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ క్లెయిమ్‌ చేసుకోవాలంటే కొనుగోలు సమయంలో తప్పనిసరిగా బిల్లులు ఉండాల్సిందే. దీంతో వారికి పన్ను బదలాయింపు జరుగుతుంది. దీంతో జీరో దందా చేసేవారిలో చాలామంది స్వచ్ఛందంగా జీఎస్‌టీఎన్‌లోకి వస్తారని, తద్వారా జీరో దందా ఉండదని నిపుణులు చెబుతున్నారు. చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకొని పలువురు ఇప్పటికీ జీరో వ్యాపారం కొనసాగిస్తునే ఉన్నారని జీఎస్‌టీ చెల్లింస్తున్న వ్యాపారులు చెబుతున్నారు.   

రూ.కోట్లలో ప్రభుత్వ ఆదాయానికి గండి
రాష్ట్ర వ్యాప్తంగా 2017–18 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి అమ్మకం పన్ను రూపంలో దాదాపు రూ.55 వేల కోట్లు సమకూరిందని అధికారుల చెబుతున్నారు. ఇందులో హైదరాబాద్‌ నుంచి వచ్చింది 60–65 శాతంగా ఉంది. నగరంలో పన్నులు చెల్లించని జీరో వ్యాపారం పెరిగిపోవడంతో ఆశించిన స్థాయిలో ప్రభుత్వానికి ఆదాయం రావడం లేదు. వాణిజ్య పన్నుల శాఖ లెక్కల ప్రకారం బేగంబజార్‌ సర్కిల్‌లో సుమారు 2 వేల వరకు రిజిస్టర్డ్‌ డీలర్లు ఉండగా.. వీరిలో చాలామంది పూర్తిస్థాయిలో అమ్మకాల లెక్కలు చూపడం లేదు. మిగిలిన మార్కెట్లలోనూ ఇదే పరిస్థితి ఉంది. అయితే, ఈ జీరో దందా వ్యాపారంలో సంబంధిత శాఖల అధికారుల ప్రమేయం కూడా ఉందనే ఆరోపణలున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement