జీఎస్టీ బాదుడు! | GST Effect on Common People Hyderabad | Sakshi
Sakshi News home page

జీఎస్టీ బాదుడు!

Published Mon, Jan 28 2019 9:33 AM | Last Updated on Mon, Jan 28 2019 9:33 AM

GST Effect on Common People Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) తగుతున్నా వ్యాపారులు మాత్రం వినియోగదారులను బాదేస్తున్నారు. జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటినుంచి వస్తువుల శ్లాబ్‌ రేట్లలో పలుమార్లు మార్పులు జరుగుతూనే ఉన్నాయి. దీంతో కొన్ని వస్తువులపై జీఎస్టీ సగానికిపైగా తగ్గగా, మరికొన్నింటిపై పూర్తిగా ఎత్తివేశారు. అయినా హైదరాబాద్‌ మహా నగరంలోని వ్యాపార, వాణిజ్య సంస్థలు వివిధ వస్తువులను పాత ధరలకే  విక్రయించడం విస్మయానికి గురిచేస్తోంది. పన్నులేని వస్తువులపై పన్ను వసూలు చేయడం.. తక్కువ జీఎస్టీ ఉన్నా అధికంగా వసూలు చేయడం షరామామూలుగా మారింది. జీఎస్టీ కౌన్సిల్‌ అత్యధిక పన్ను పరిధిలో ఉన్న వస్తువుల్ని తగ్గించినా  వినియోగదారులకు ప్రయోజనం మాత్రం చేకూరడంలేదు. వాస్తవంగా నగరంలోని బహుళజాతిసంస్థలైన రిలయన్స్, బజాజ్, బిగ్‌ బజార్, మోర్, మార్ట్, సూపర్‌ మార్కెట్లతోపాటు పాటు ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్, హోం నీడ్స్, మెడికల్, ఫుట్‌వేర్, గ్లాస్‌ ప్లైవుడ్‌ అండ్‌ హార్డ్‌వేర్, పెయింట్స్‌ తదితర ట్రేడర్లు వినియోగదారులపై జీఎస్టీ బాదేస్తున్నారు. రిటైల్‌తో పాటు హోల్‌సేల్‌ వ్యాపారులు సైతం ప్యాకేజ్డ్‌ వస్తువులపై ధరలు తగ్గినా పాత ధరలకు విక్రయిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవంగా సుమారు వందకుపైగా వస్తువులపై జీఎస్టీ తగ్గింది. కానీ, సామాన్యులపై  బాదుడు మాత్రం తగ్గడం లేదు

ఇష్టానుసారంగా బిల్లులు..
బిల్లుల విషయంలోనూ వ్యాపారుల ఇష్టారాజ్యంగా తయారైంది. సరైన బిల్లులు ఇవ్వకపోవడం, ఇచ్చినా వసూలు చేసిన పన్నును స్పష్టంగా పేర్కొనకపోవడం మాములుగా మారింది. వస్తువుల వారీగా జీఎస్టీ ఎంత వసూలు చేశారో బిల్లులో స్పష్టంగా ఉండాలి. చాలామంది వ్యాపారులు జీఎస్టీని బిల్లుల్లో ప్రత్యేకంగా ప్రస్తావించడంలేదు. సూపర్‌మార్కెట్లు, పెద్ద మాల్స్‌లో జీఎస్టీ విధిస్తున్నట్లు బిల్లులో చూపుతున్నా స్పష్టత పాటించడంలేదు. కొద్దిమందే మాత్రమే ఏయే వస్తువులు ఏ శ్లాబ్‌ పరిధిలో ఉన్నాయో బిల్లులో చూపిస్తున్నారు. దీంతో వేటిపై ఎంత పన్ను వసూలు చేశారో స్పష్టంగా తెలుస్తుంది. కాని ఈ విధానంలో బిల్లులు ఇస్తున్న వారి సంఖ్య చాలా తక్కువే. ఎక్కువమంది జీఎస్టీపై ఇలాంటి స్పష్టత ఇవ్వడంలేదు. వస్తువుల విలువ మొత్తం, ఈ మొత్తంపై వసూలు చేస్తున్న జీఎస్టీ ఎంత అనేదే చూపిస్తున్నారు.

పత్తా లేని ప్రదర్శన..  
వ్యాపారులు జీఎస్టీ నిబంధనల ప్రకారం జీఎస్టీ ఐఎన్‌ (జీఎస్టీ గుర్తింపు సంఖ్య)ను  విధిగా బోర్డుపై ప్రదర్శించాలి. ఇది ఆచరణలో మాత్రం కనిపించడం లేదు.జీఎస్టీకి కింద  నమోదు చేసుకున్న వ్యాపారులు కనీసం రెండు మూడు శాతం కూడా   షాపుల ముందు జీఎస్టీ గుర్తింపు సంఖ్యను ప్రదర్శిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.  మరోవైపు కాంపోజిట్‌ విధానంలో రిజిస్టర్‌ చేసుకున్న వ్యాపారులు పన్ను వసూలు చేయకూడదు. గతంలో ఈ విధానం కింద నమోదు చేసుకునేందుకు వార్షిక గరిష్ట లావాదేవీలు రూ.75 లక్షల నుంచి కోటి రూపాయలకు వరకు పెరిగింది. ఏడాదిలో కోటి రూపాయల లావాదేవీలు నిర్వహించేవారు ఒక శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది.

ఇలా కాంపోజిట్‌ విధానంలో నమోదు చేసుకున్నవారు ఎలాంటి పన్ను వసూలు చేయకూడదు. అలాగే ‘కాంపోజిట్‌ విధానం కింద నమోదు చేసుకున్న’ విషయాన్ని ప్రముఖంగా బోర్డు ద్వారా ప్రదర్శించాలి. దీనివల్ల ఆ దుకాణానికి వెళ్లే వినియోగదారులకు అక్కడ ఎలాంటి జీఎస్టీ చెల్లించాల్సిన అవసరంలేదని అర్థమవుతుంది.  నగరంలో కాంపోజిట్‌ విధానం కింద వేలాది మంది వ్యాపారులు నమోదు చేసుకున్నారు. కాని ఆ విషయాన్ని ప్రదర్శిస్తున్నవారి సంఖ్య వేళ్లపై లెక్కించవచ్చు. జీఎస్టీ నిబంధనలు పాటించకున్నా కేంద్ర, రాష్ట్ర పన్నులశాఖ విభాగాల అధికారులు మాత్రం దృష్టి సారిస్తున్న దాఖలాలు మాత్రం కానరావడం లేదు. వాస్తవానికి తనిఖీలు చేసే అధికారాలులేకున్నా.. చట్ట ప్రకారం నిబంధనలు  పాటించాల్సినవి పాటిస్తున్నారా.. లేదా అనేదిపరిశీలించాల్సిన బాధ్యత పన్నుల అధికారులపై ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement