సాక్షి, హైదరాబాద్: టీడీపీ నేతల జీఎస్టీ స్కాంలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. దేశ వ్యాప్తంగా 2600 బోగస్ కంపెనీలను జీఎస్టీ విజిలెన్స్ విభాగం గుర్తించింది.. ఢిల్లీ కేంద్రంగా 10వేల కోట్లకు పైగా స్కాం జరిగినట్లు బట్టబయలైంది. హైదరాబాద్‌లో 326పైగా బోగస్ కంపెనీలను అధికారులు గుర్తించారు.
రాత్రికి రాత్రికి బోగస్ గోదాంలు సృష్టిస్తున్న జీఎస్టీ ఫేక్ బిల్లింగ్ మాఫియా.. ఇతరుల ఆధార్, పాన్ కార్డ్ లతో జీఎస్టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌లు పొందుతున్నారు. ఎలాంటి స్టాక్ లేకుండా 4 నుండి 6 శాతానికి బోగస్ కంపెనీల నుంచి వ్యాపారవేత్తలు బిల్స్ కొంటున్నారు. బోగస్ కంపెనీల నుంచి కొంటున్న బిల్స్ని 15 నుండి 18 శాతానికి వ్యాపారవేత్తలు అమ్ముతున్నారు. బిల్స్ లేకుంటే కంపెనీలు స్టాక్ రిజెక్ట్ చేస్తుండటంతో జీఎస్టీ మాఫియా.. బోగస్ కంపెనీలు సృష్టించి సొమ్ము చేసుకుంటున్నాయి. బోగస్ కంపెనీలపై దాడులకు జీఎస్టీ అధికారులు సిద్దమవుతున్నారు.
చదవండి: జీఎస్టీ అధికారి కిడ్నాప్ కేసులో గుంటూరు టీడీపీ నేతలు
కాగా, జీఎస్టీ సీనియర్ అధికారిని కిడ్నాప్ చేసిన కేసులో గుంటూరు టీడీపీ నేతలు, కుటుంబ సభ్యులను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గుంటూరు నగర టీడీపీ నేత సయ్యద్ ముజీబ్, ఆయన కుటుంబ సభ్యులు సయ్యద్ ఫిరోజ్, సయ్యద్ ఇంతియాజ్‌లకు హైదరాబాద్ సరూర్‌నగర్ పరిధిలోని క్రాంతినగర్ రోడ్ నంబర్ 2లో ఇనుము వ్యాపారం ఉంది. ప్రస్తుతం గుంటూరులోని ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్నారు.
జీఎస్టీ చెల్లించకపోవటంతో బుధవారం జీఎస్టీ, ఇంటెలిజెన్స్ అధికారులు హైదరాబాద్‌లోని దుకాణాన్ని సీజ్‌చేసేందుకు వెళ్లారు. ఆ అధికారులపై ముజీబ్, ఫిరోజ్, ఇంతియాజ్, వారి కారు డ్రైవర్ షేక్ ముషీర్ దాడిచేశారు. గుంటూరు నుంచి తాము వెళ్లిన కారులోనే అధికారుల్ని కిడ్నాప్ చేశారు. అధికారుల డ్రైవర్ ద్వారా సమాచారం అందుకున్న సరూర్‌నగర్ పోలీసులు కిడ్నాప్‌నకు పాల్పడిన నలుగురిని అదుపులోకి తీసుకుని అధికారులను రక్షించారు.
ముజీబ్ ప్రస్తుతం గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఆ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. లోకేశ్ పాదయాత్రలో కూడా పాల్గొన్నారు. హైదరాబాద్‌లో కిడ్నాప్ వ్యవహారంలో గుంటూరు టీడీపీ నేతలు అరెస్ట్ కావడం చర్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment