సాక్షి సిటీబ్యూరో: మార్కెట్‌లో ఏ వస్తువు కొనుగోలు చేసినా దానికి బిల్లు తీసుకోవడం వినియోగదారుడి హక్కు అని ఓవైపు అవగాహన కల్పిస్తున్నా... ‘సకాలంలో పన్నులు చెల్లించండి... దేశాభివృద్ధిలో పాలుపంచుకోండి’ అంటూ వాణిజ్య పన్నుల శాఖ మరోవైపు ప్రచారం చేస్తున్నా పరిస్థితిలో మార్పులు రావడం లేదు. నగరంలోని అబిడ్స్, చార్మినార్, బేగంపేట్, పంజగుట్ట, సరూర్‌నగర్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో జీరో దందా జోరుగా సాగుతోంది. బిల్లులు లేకుండానే రూ.కోట్లలో వ్యాపారం జరుగుతోంది. జీఎస్టీ నుంచి మినహాయింపు పొందేందుకు వ్యాపారులు ఇలా చేస్తుండగా అధికారులు చోద్యం చూస్తున్నారు. వ్యాపార లావాదేవీలపై తనిఖీలు నిర్వహించాల్సిన బాధ్యత ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంపై ఉందని క్షేత్రస్థాయి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది.
ఒరిజినల్ బిల్లుల్లేవ్...
వినియోగదారులు రూ.100 నుంచి లక్షల్లో కొనుగోలు చేసినా వ్యాపారులు మాత్రం ఒరిజినల్ బిల్లులు ఇవ్వడం లేదు. ఒకవేళ ఎవరైనా అడిగితే తెల్లకాగితంపైనే రాసిస్తున్నారు. ఈ నామమాత్రపు బిల్లు కాగితంపై దుకాణం పేరు, రిజిస్ట్రేషన్ నంబర్ తదితర వివరాలేమీ ఉండవు. ఫలితంగా ఆ వస్తువు విక్రయించినందుకు వ్యాపారి ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను చెల్లించడం లేదు. వినియోగదారుడు చెల్లిస్తున్న పన్ను కాస్త వ్యాపారి ఖాతాలోకే వెళ్లిపోతోంది. ఒరిజినల్ బిల్లు ఇస్తే వస్తువు ధర మరింత పెరుగుతుందని వినియోగదారులను పక్కదోవ పట్టిస్తున్న వ్యాపారులు యథేచ్ఛగా జీరో దందా సాగిస్తున్నారు. వాస్తవానికి వస్తువు ధరలోనే జీఎస్టీ కలిపి ఉంటుంది.
లెక్కలు ఉష్‌కాకి...
నగరంలోని హోల్‌సేల్ మార్కెట్లలో బేగంబజార్ ప్రథమ స్థానంలో ఉంటుంది. ఇక్కడి నుంచి జిల్లాలకూ ఉత్పత్తులు సరఫరా అవుతుంటాయి. దీన్ని ఆనుకొని ముక్తియార్‌జంగ్, కిషన్‌గంజ్, ఉస్మాన్‌గంజ్, మహరాజ్‌గంజ్ తదితర మార్కెట్లు ఉన్నాయి. ఇక్కడి దుకాణాలు చూసేందుకు చిన్నగా ఉన్నా పెద్ద మొత్తంలో వ్యాపారం జరుగుతుంది. డబ్బులు చెల్లిస్తే చాలు నేరుగా గోడౌన్ల నుంచే సరుకులు తరలిస్తారు. ఇక్కడ నిత్యం పెద్ద మొత్తంలో వ్యాపారం జరుగుతున్నా... లెక్కల్లో చూపేది మాత్రం నామమాత్రమే. వాణిజ్య పన్నుల అధికారులకు ప్రతి నెల మామూళ్లు అందుతాయని, అందుకే ఇక్కడ తనిఖీలపై శ్రద్ధ వహించరని బేగంబజార్‌లోని ఓ వ్యాపారి పేర్కొనడం గమనార్హం. వ్యవసాయ ఉత్పత్తులు, విడిగా ఉన్న వాటికి పన్ను మినహాయింపు ఉండడంతో కొంతమంది వ్యాపారులు ప్యాక్ చేయకుండా విక్రయిస్తూ ట్యాక్స్ ఎగ్గొడుతున్నారు. చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకొని చాలామంది జీఎస్టీ చెల్లించడం లేదని కొందరు వ్యాపారులు పేర్కొన్నారు. 2017–18లో ప్రభుత్వానికి పన్నుల రూపంలో రూ.55వేల కోట్లు సమకూరిందని అధికారులు చెప్పారు. ఇందులో హైదరాబాద్ నుంచే 60–65 శాతం ఉంది. నగరంలో జీరో వ్యాపారం పెరిగిపోవడంతో ఆశించిన స్థాయిలో ఆదాయం రావడం లేదని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment