
కేంద్రం నుంచి విధివిధానాలేం రాలేదు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: స్మార్ట్ సిటీలపై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన విధివిధానాలేమీ రాలేదని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కె.తారక రామారావు స్పష్టంచేశారు. బుధవారం అసెంబ్లీలో డిమాండ్లపై చర్చ జరుగుతున్న సమయంలో బీజేపీ సభ్యుడు కె.లక్ష్మణ్ జోక్యం చేసుకొని స్మార్ట్‌సిటీలపై అసలు కేంద్రం నుంచి ఎటువంటి మార్గదర్శకాలు వచ్చాయో సభకు వెల్లడించాలని కోరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తాను ఇటీవల కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును కలిసినప్పుడు స్మార్ట్‌సిటీల గురించి మాట్లాడానని, ఎటువంటి ప్రతిపాదనలు తయారుచేయలేదని.. మార్గదర్శకాలు ఖరారు కాలేదని చెప్పారని వెల్లడించారు. అయితే రాష్ట్రంలో ఏ నగరాలను స్మార్ట్‌సిటీలుగా ప్రకటిస్తారో చెప్పమని కోరానని వివరించారు.
గ్రామ, పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు: పోచారం
వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గ్రామ, పట్టణప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. మున్సిపాలిటీలను కొన్నింటిని కార్పొరేషన్లుగా చేసినా వాటిలో ఆ స్థాయిలో మార్పులు రాలేదని వివరించారు. ఔటర్‌రింగ్ రోడ్లను ఆర్ అండ్ బీకి ఇచ్చిన నిధులతోనే చేపడతామని అన్నారు. రాష్ట్రంలో ఒక్క డెంగీ మరణం కూడా సంభవించలేదని మంత్రి జోగురామన్న స్పష్టం చేశారు. బీజేపీ సభ్యుడు చింతల రామచంద్రారెడ్డి సుదీర్ఘంగా మాట్లాడుతుండగా.. స్పీకర్ పదేపదే ముగించమని కోరారు.
1100 నోటిఫైడ్ స్లమ్‌లు:చింతల
హైదరాబాద్ నగరంలో 1100 నోటిఫైడ్ మురికివాడలు ఉన్నాయని బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో 62 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లు ఉంటే బడ్జెట్లో రూ. 5,436 కోట్లు కేటాయిస్తే ఎలా సరిపోతాయని ప్రశ్నించారు. హుస్సేన్‌సాగర్‌ను రూ. 100కోట్లతో ప్రక్షాళన చేయాలంటున్నారని... అయితే అందులోని రసాయన కలుషిత నీరు ఎక్కడికి పంపుతార ని నిలదీశారు. కాంగ్రెస్ సభ్యుడు పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడు తూ ఖమ్మం నగరాన్ని స్మార్ట్‌సిటీగా ప్రకటించిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
టీఆర్‌ఎస్ సభ్యుడు శ్రీనివాసగౌడ్ మాట్లాడుతూ పట్టణాలు సమస్యల వలయంలో ఉన్నాయన్నారు. తండాలను అభివృద్ధి చేయాలని కోరారు. టీడీపీ సభ్యుడు వివేక్‌గౌడ్ మాట్లాడుతూ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో రాజీవ్ స్వగృహ, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కింద నిర్మించిన కాల నీల్లో మౌలిక సదుపాయాలు లేవనీ, వాటిని పరిష్కరించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పంచాయితీరాజ్ శాఖ ద్వారా జరుగుతున్న పనుల్లో జవాబుదారీతనం ఉండేలా చర్యలు చేపట్టాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే కిష్ణారెడ్డి అన్నారు. రాష్ట్రంలో పట్టణాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఎమ్మెల్యే గణేశ్‌గుప్త అన్నా రు.