
సహకార ఎన్నికలు లేనట్లే!
► 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికలు వద్దని సర్కారు భావన
► ఫిబ్రవరిలో ముగియనున్న టెస్కాబ్, ప్యాక్స్, డీసీసీబీల కాలపరిమితి
► వాటికి పర్సన్ ఇన్‌చార్జుల్ని నియమించాలనే యోచన
సాక్షి, హైదరాబాద్: కొద్దినెలల్లో పదవీకాలం ముగి యనున్న సహకార సంఘాల పాలకవర్గాలకు వెంటనే ఎన్నికలు నిర్వహించవద్దని రాష్ట్ర ప్రభు త్వం భావిస్తోంది. కొత్త జిల్లాలు, మండలాల ఏర్పా టుతో వాటిల్లో సహకార సంఘాలు ఏర్పాటు చేయాల్సి రావడం, వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు నియామకాలతో అసంతృప్తుల ఇబ్బందు లు వంటి వాటి నేపథ్యంలో ‘సహకార’ ఎన్నికలను వాయిదా వేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ ఏర్పడ్డాక పెద్ద ఎత్తున జరగనున్న తొలి సహకార ఎన్నికలు కావడంతో రాజకీయంగా ఆలో చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని భావిస్తోంది.
జిల్లాల విభజనతో సమస్యలు
సహకార సంఘాలకు ప్రస్తుతమున్న పాలకవర్గాల పదవీకాలం వచ్చే ఫిబ్రవరి నాటికి ముగియనుంది. తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ (టెస్కాబ్) పాలకవర్గం పదవీ కాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 26తో ముగియనుంది. జిల్లా సహకార మార్కెటింగ్ సమాఖ్య (డీసీఎంఎస్)లు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)ల పాలకవర్గాల పదవీకాలం అదే నెల 18న.. 906 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్)ల పదవీ కాలం అదే నెల మొదటివారంలో ముగియన్నాయి.
2013లో ఉమ్మడి రాష్ట్రంలో సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించినప్పుడు తెలంగాణలో 10 జిల్లాలే ఉన్నాయి. ఇప్పుడు 31 జిల్లాలు అయినందున వాటి ప్రకారం జిల్లా సహకార మార్కెటింగ్ సమాఖ్య (డీసీఎంఎస్), జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)లు ఏర్పాటు చేయాలి. ఈ ప్రక్రియ ఇప్పుడు ప్రారంభిస్తే వచ్చే జనవరి నాటికి పూర్తవుతుంది. కొత్త జిల్లాలన్నింటికీ డీసీసీబీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తలపెట్టినా అదంత సులభం కాదని అంటున్నారు. కొత్త డీసీసీబీలు ఏర్పాటు చేయాలంటే ప్రస్తుతమున్న డీసీసీబీల ఆస్తులు, డిపాజిట్లు, రుణాలు, రికవరీ, వ్యాపారం ఆధారంగా విభజించాలి. ఇందుకు రిజర్వుబ్యాంకు ఆమోదం ఉండాలి.
తెలంగాణలోని డీసీసీబీల పనితీరు, అవినీతి ఆరోపణలను పరిశీలిస్తే కొత్తవాటికి ఆర్బీఐ అనుమతి ఇస్తుందన్న నమ్మకం లేదు. మరోవైపు ఇప్పుడున్న వాటి పదవీకాలాన్ని పొడిగించాలనుకున్నా.. పాలకవర్గాల్లో అధికార పార్టీ వారికంటే ఇతర పార్టీల వారే అధికంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయా సహకార సంఘాలకు పర్సన్ ఇన్‌చార్జులను నియమిస్తే బాగుంటుందని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ ప్రకారమే తాము నడుచుకుంటామని.. అది రాజకీ యంగా తీసుకోవాల్సిన నిర్ణయమని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.
ఎన్నికల ముందు ఎందుకంటూ
ప్రస్తుత పాలకవర్గాలకు ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలయ్యాయి. అప్పుడు ఎక్కువగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిచారు. 2019లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున ఏడాది ముందు సహకార సంఘాల ఎన్నికలు నిర్వహిస్తే రాజకీయంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోన్న చర్చ టీఆర్‌ఎస్ వర్గాల్లో నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల ముందు గ్రామాల్లో రాజకీయ సందడి చేసే సహకార ఎన్నికలకు వెళ్లడం మంచిది కాదని భావిస్తున్నట్లు సమాచారం.