సాక్షి, బూర్గంపాడు : ప్రజలు చికెన్, గుడ్లు నిర్భయంగా తినొచ్చని భద్రాద్రి జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి డాక్టర్ వేణుగోపాలరావు అన్నారు. శనివారం ఆయన బూర్గంపాడు మండల పరిధి మోరంపల్లిబంజరలోని పౌల్ట్రీఫామ్స్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా వైరస్‌కు చికెన్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. చికెన్, గుడ్లు తింటే కరోనా వస్తుందనేది కేవలం అపోహ మాత్రమేనన్నారు. కరోనా వదంతులతో పౌల్ట్రీ రంగం కుదేలవుతుందని, పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కోడి ధరలు కిలో రూ.80 నుంచి ఒక్కసారిగా రూ.10కి పడిపోయాయన్నారు. దీంతో ప్రత్యక్షంగా పౌల్ట్రీ రైతులు నష్టపోతుంటే పరోక్షంగా కోళ్ల మేతకు వినియోగించే మొక్కజొన్న, జొన్న, సోయాబీన్ సాగు చేసే రైతులు నష్ట పోతున్నారన్నారు.
అదే విధంగా వెటర్నరీ మెడికల్ షాపులు, చికెన్‌షాపుల వాళ్లు కూడా ఉపాధి కోల్పోతున్నారన్నారు. కరోనా వైరస్ ప్రభావం పౌల్ట్రీ రైతులతో పాటు చిరు వ్యాపారులపై కూడా పడిందన్నారు. ఈ పరిస్థితులను అధిగమించడానికి ప్రజలు నిర్భయంగా చికెన్, గుడ్లు తినవచ్చన్నారు. అవి మంచి పౌష్టికాహారమని, చికెన్, గుడ్లు తినడం వలన కరోనా వచ్చినట్లు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ నిరూపితం కాలేదన్నారు. తక్కువ ధరలతో అధిక ప్రొటీన్‌లు లభించే ఆహారం చికెన్, గుడ్లు మాత్రమేనన్నారు. ఈ కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment