సాక్షి, సిటీబ్యూరో: లాక్‌డౌన్‌లో ఉపశమనం కోసం ఏర్పాటు చేసిన క్యాంప్‌లన్నీ ఎత్తివేయడంతో వలస కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. భవన నిర్మాణ రంగం, పరిశ్రమలకు సడలింపు లభించినప్పటికీ పూర్తి స్థాయిలో ప్రారంభం కాకపోవడంతో పనులు దొరకని వలస కార్మికులు ఇక్కడ ఉండలేక..సొంతూళ్లకు వెళ్లలేక అష్టకష్టాలు పడుతున్నారు. ఇప్పటికే రోడ్డు, రైలు మార్గాల్లో సుమారు పది లక్షల మంది వలస కార్మికులు మహానగరం దాటేశారు. మరో రెండు లక్షల మంది సొంతూరి బాటపట్టారు. తాజాగా శుక్రవారం నగరం నుంచి మరో మూడు శ్రామిక్ రైళ్లలో సుమారు ఐదు వేలకు పైగా వలస కార్మికులు పశ్చిమ బెంగాల్‌కు బయలు దేరారు. లాక్‌డౌన్‌లో వలస కార్మికులు అకలితో అలమటించకుండా క్యాంప్‌లు ఏర్పాటు చేసి కొందరికి బియ్యం, నగదు పంపిణీ చేసి ఉపశమనం కలిగించిన ప్రభుత్వం.. వరుస సడలింపులతో నిర్వహణ బాధ్యతల నుంచి క్రమంగా తప్పుకుంది. ఆ తరువాత కొద్ది రోజులు స్వచ్చంద సంస్థల సహకారంతో కొనసాగిన క్యాంపులు పూర్తిగా మూత పడ్డాయి.
తిండీ..తిప్పలు లేక...
మహా నగరంలో ఇంకా మిగిలిపోయి పనులు లభించని వలస కార్మికుల కుటుంబాలు తిండీతిప్పలు లేక సొంతూళ్లకు వెళ్లలేక నరక యాతన పడుతున్నట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్‌లో వివిధ రంగాలకు మినహాయింపులతో వలస కార్మికులకు చేయూత పై దృష్టి తగ్గడంతో పాటు రిలీఫ్ క్యాంప్‌లు సైతం క్రమంగా మూతపడ్డాయి. వాస్తవంగా నెలన్నర ముందే లాక్‌డౌన్ ఎత్తివేతపై భరోసా లేక వలస కార్మికులు కాలినడకన సొంతూళ్లకు బయలు దేరడంతో కేంద్ర ప్రభుత్వం రైలు, ఆ తర్వాత రోడ్డు మార్గాల ద్వారా వేళ్లేందుకు అనుమతించింది. మరోవైపు భవన నిర్మాణ రంగం, పరిశ్రమలకు కూడా మినహాయింపు ఇవ్వడంతో వలస కార్మికులు ఉరుకులు పరుగులు తీశారు. కొందరు పోలీసు యంత్రాంగం వద్ద పేర్లు నమోదు చేసుకొని సొంతూళ్లకు రోడ్డు, రైళ్ల మార్గాల ద్వారా బయలు దేరగా.... మరి కొందరు ఇక్కడే పనులు చేసేందుకు ఆగిపోయారు. అయితే ప్రభుత్వ నిబంధనలు, పెట్డుబడులు, ముడిసరుకులు, నిపుణులు లేక పూర్తి స్థాయిలో పనులు, ఉత్పత్తి ప్రారంభానికి నోచుకోలేదు. దీంతోవలస కార్మికులకు పనులు లేకుండా పోయాయి. కనీసం తినడానికి తిండి, చేతిలో చిల్లి గవ్వ లేక పోవడంతో సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమై తల్లడిల్లిపోతున్నారు.
సరిహద్దు ప్రాంతాలకు ...
ఇంకా కాలినడకన..సొంతూళ్లకు బయలు దేరిన వలస కార్మికులను అక్కడక్కడ గుర్తిస్తున్న పోలీసు యంత్రాంగం వారిని రాష్ట్ర సరిహద్దు ప్రాంతం వరకు ప్రత్యేక బస్సుల్లో చేరుస్తోంది. రెండు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా శివారు ప్రాంతం నుంచి మేడ్చల్ క్యాంప్ వైపు కాలినడకన వస్తున్న సుమారు 30 మంది వలస కార్మికులను గుర్తించి వారిని చత్తీస్‌ఘడ్ వెళ్లేందుకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి రాష్ట్ర సరిహద్దు వరకు పంపించారు. మరోవైపు గత పదిరోజులుగా శ్రామిక రైళ్ల రాకపోకలు నిలిపివేసిన కారణంగా తమ వద్ద నమోదైన వారిని సైతం ఇప్పటికే ప్రత్యేక బస్సుల్లో రాష్ట్ర సరిహద్దు వరకు తరిలించి అక్కడ నుంచి గమ్యస్థానాలకు వెళ్లే విధంగా ఏర్పాటుచేశారు.
ఎన్జీవోల చేయూత..
మహానగరంలోని ఎన్జీవోలు వలస కార్మికులు సొంతూళ్లకు వెళ్లేందుకు చేయూత అందిస్తున్నారు. ఇప్పటికే క్యాంప్‌లో భోజన సదుపాయాలు కల్పించిన ఎన్జీవోలు సొంతూళ్లకు వెళ్లేందుకు అన్ని విధాలుగా సహకరిస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది. ఒక వైపు ప్రభుత్వ అధికారులతో మాట్లాడుతూ . మరో వైపు స్వతహాగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉన్న వలస కార్మికులు సైతం ఇక్కడి వచ్చేందుకు సహకరించినట్లు తెలుస్తోంది. నేపాల్ దేశానికి వెళ్లిన సుమారు 30 మంది నాగర్ కర్నూల్‌కు చెందిన వలస కార్మికులు తిరిగివచ్చే విధంగా ప్రయత్నించడంతో మేడ్చల్ క్యాంప్ నుంచి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment