సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కొలువుదీరిన కేసీఆర్ కేబినేట్‌లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జోగు రామన్నకు చోటు దక్కింది. అటవీ, పర్యావరణశాఖ మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆదిలాబాద్ జిల్లాలో పర్యావరణశాఖ కార్యాలయం లేదు. ఈ శాఖ పరిధిలో ఉండే కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ కార్యాలయం నిజామాబాద్ జిల్లాలో ఉంది. ఆదిలాబాద్, నిజామాబాద్ రెండు జిల్లాలకు కలిపి ఒకే కార్యాలయం అక్కడ ఉంది. పర్యావరణశాఖ మంత్రిగా జోగు రామన్న బాధ్యతలు స్వీకరించడంతో జిల్లాలో ఆ శాఖ కార్యాలయం ఏర్పాటుపై ఆశలు చిగురిస్తున్నాయి. ఇన్నాళ్లు ప్రజాప్రతినిధులెవరూ జిల్లాలో కార్యాలయం ఏర్పాటుకు చొరవ చూపలేదు.
దీంతో జిల్లాలో ఏదైనా పరిశ్రమను నెలకొల్పాలన్నా అనుమతుల కోసం నిజామాబాద్‌కు తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. చివరకు చిన్న రైసుమిల్లు పెట్టుకోవాలన్నా పక్క జిల్లాకు వెళ్లి అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. భారీ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన ప్రజాభిప్రాయ సేకరణ, అన్ని రకాల పరిశ్రమలకు సైట్ క్లియరెన్స్, కొత్త పరిశ్రమలకు లెసైన్సుల మంజూరు, ఏటా ఆ లెసైన్సుల పునరుద్ధరణ వంటి పనులు నిజామాబాద్ కార్యాలయం నుంచే జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు రామన్న ఆ శాఖకు మంత్రి కావడంతో జిల్లాలో ఆ శాఖ కార్యాలయం ఏర్పాటుకు మార్గం సుగమమవుతుందనే అభిప్రాయం పారిశ్రామిక వర్గాల్లో నెలకొంది.
ఆదిలాబాద్‌లో పరిశ్రమలు అధికం
పీసీబీ ఈఈ కార్యాలయం నిజామాబాద్‌లో ఉన్నప్పటికీ.. పరిశ్రమలు మాత్రం ఆదిలాబాద్ జిల్లాలోనే అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా సింగరేణి జిల్లాలో విస్తరించి ఉంది. బొగ్గు ఆధారిత పరిశ్రమలు తూర్పు జిల్లాలో ఉన్నాయి. సిరామిక్స్ పరిశ్రమలు మంచిర్యాల పరిసర ప్రాంతాల్లో నెలకొని ఉన్నాయి. ఇవి కాకుండా ఓరియంట్, ఎంసీసీ సిమెంట్ వంటి భారీ పరిశ్రమలు కూడా జిల్లాలోనే ఉన్నాయి. కొత్త సర్కారు పారిశ్రామికాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. దీంతో జిల్లాలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలు అధికంగా ఉన్నాయి. వీటన్నింటికి పీసీబీ కార్యాలయం అనుమతులు మంజూరు చేయాలి. ఈ నేపథ్యంలో జిల్లాలో ఆ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పరిశీలనలో ప్రతిపాదనలు
జిల్లాలో పీసీబీ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు ప్రతి పాదన మూడేళ్లుగా పరిశీలనలో ఉంది. సమైఖ్య రాష్ట్రం లో ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. ఇక తె లంగాణ రాష్ట్రంలోనైనా ప్రతిపాదన కార్యరూపం దాల్చుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్‌తోపాటు, కడప, అనంతపురం, ప్రకాశం వంటి జిల్లాల్లో పీసీబీ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు గతంలో ప్రభుత్వం అంగీకరించిందని పీసీబీ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ వెంకన్న ‘సాక్షి ప్రతినిధి’తో పేర్కొన్నారు.
జిల్లాలో కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయం లేదు
Published Wed, Jun 4 2014 1:59 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement