లక్ష జనం లక్ష్యంగా.. | CM KCR Tour In Adilabad | Sakshi
Sakshi News home page

లక్ష జనం లక్ష్యంగా..

Published Mon, Aug 27 2018 11:51 AM | Last Updated on Sun, Apr 7 2019 3:47 PM

CM KCR Tour In Adilabad - Sakshi

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల:  ముందస్తు ఎన్నికల ఊహాగానాల మధ్య తెలంగాణ రాష్ట్ర సమితి సెప్టెంబర్‌ 2న హైదరాబాద్‌ శివారులో నిర్వహించే ప్రగతి నివేదన సభకు ఉమ్మడి ఆదిలాబాద్‌ నుంచి లక్ష మందిని తరలించాలని నేతలు నిర్ణయించారు. నియోజకవర్గానికి 10వేల మంది చొప్పున ప్రజానీకాన్ని తీసుకెళ్లేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ నల్లాల ఓదెలు మిగతా ఎమ్మెల్యేలు సమావేశమై కొంగర కలాన్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా నిర్వహి స్తున్న బహిరంగసభకు జనాన్ని తరలించే విషయమై చర్చించారు. ఈ మేరకు సోమవారం ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు సమావేశమై ఏయే మండలాలు, గ్రామాల నుంచి జనాన్ని ఎంత మేర తరలించాలనే విషయమై ప్రణాళికల రూపొందించనున్నారు. ప్రగతి నివేదన సభలో ఆదిలాబాద్‌ సత్తా చూపుతామని    ఎమ్మెల్యేలు, మంత్రులు చెబుతున్నారు.
 
నియోజకవర్గానికి 10వేల మంది టార్గెట్‌
ఇటీవల హైదరాబాద్‌లో మంత్రి జోగు రామన్న కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలకు లక్ష్యాలను నిర్ధేశించారు. ప్రతి నియోజకవర్గం నుంచి 10వేల మంది లక్ష్యంగా చేసుకొని జన సమీకరణ జరపాలని, కనీసం 8వేల మందిని తప్పనిసరిగా హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. జనం తరలించేందుకు అవసరమైన వాహనాలు, రవాణా తదితర అంశాలపై నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసే సమావేశాల అనంతరం స్పష్టత రానుంది. అయితే జిల్లాలో మూడు ఎస్టీ రిజర్వుడ్, 2 ఎస్సీ రిజర్వుడు సీట్లు ఉండగా, దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు తరలివెళ్లడమే పెద్ద సమస్యగా మారిందని నాయకులు పేర్కొంటున్నారు.

రైలు మార్గాలు... ఆర్టీసీ హైర్‌ బస్సులు
సిర్పూరు, ఆసిఫాబాద్‌ నియోజకవర్గాల నుంచి హైదరాబాద్‌కు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే కనీసం 8 నుంచి 10 గంటల సమయం పడుతుంది. కండీషన్‌లో ఉండని ప్రైవేటు బస్సుల్లో ప్రయాణం నరకమే. ఈ పరిస్థితుల్లో సిర్పూరు, ఆసిఫాబాద్‌ నియోజకవర్గాలతోపాటు బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల నియోజకవర్గాల నుంచి సాధ్యమైనంత ఎక్కువ మందిని రైళ్లల్లో ప్రగతి నివేదన సభకు తరలించాలని మంత్రులు, ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. కాగజ్‌నగర్‌ నుంచి ప్రారంభమయ్యే రైళ్లతోపాటు పైనుంచి వచ్చే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను కూడా వినియోగించుకోవాలని భావిస్తున్నారు. ఆర్టీసీ బస్సులను టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర శాఖ ఇప్పటికే అద్దెకు తీసుకోగా, స్థానికంగా ఉండే మినీ బస్సులు, ఇతర రవాణా వాహనాలను సోమవారం బుక్‌ చేసే ఆలోచనలో ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న అన్ని ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు చెందిన బస్సులను కూడా ఇందుకోసం వినియోగిస్తున్నారు. గ్రామాల్లో లారీలను కూడా జనసమీకరణకు వినియోగించుకోవాలని టీఆర్‌ఎస్‌ నాయకులు యోచిస్తున్నారు. కనీసం 2వేల వాహనాలను ప్రత్యేకంగా ఇందుకోసం వినియోగించాలని నిర్ణయించారు.

కోల్‌బెల్ట్‌ నుంచి కనీసం ఐదువేలు
ఉమ్మడి జిల్లాలో సింగరేణి కోల్‌బెల్ట్‌ ప్రధానమైనది. నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉన్న కోల్‌బెల్ట్‌ నుంచి ప్రగతి నివేదన సభకు కనీసం 5వేల మంది కార్మికులను తరలించే ఆలోచనలో నాయకులున్నారు. మంచిర్యాల పరిధిలోని శ్రీరాంపూర్, చెన్నూరులోని జైపూర్, ఇందారం, మందమర్రి , బెల్లంపల్లిలోని కాసిపేట, బెల్లంపల్లి, ఆసిఫాబాద్‌లోని రెబ్బన మండలంలోని ఓపెన్‌కాస్ట్‌లలో పనిచేస్తున్న 20వేల పై చిలుకు కార్మికుల నుంచి కనీసం 5వేల మందిని తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు. లాభాల బోనస్‌ 27 శాతం ఇవ్వడంతోపాటు వారసత్వ ఉద్యోగాలు, ఇతర సౌకర్యాల విషయంలో తీసుకున్న నిర్ణయాలతో కార్మికుల్లో హర్షం వ్యక్తమవుతుందని నేతలు భావిస్తున్నారు. ఈ మేరకు టీబీజీకేఎస్‌ నాయకులు కార్మికులను తరలించే బాధ్యత అప్పగించారు. ఎంపీలు కవిత, బాల్క సుమన్‌ ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు సమాచారం.

లక్ష మందిని తరలిస్తాం:  మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత ఏర్పాటైన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలకు ఎన్నో సంక్షేమ, అభివృద్ధి ఫలాలను తీసుకొచ్చింది. ప్రజలకు ‘ఓటు రాజకీయాలు కాదు... దీర్ఘకాలిక అభివృద్ధి కావాలి’ అని నమ్మిన కేసీఆర్‌ అందుకు అనుగుణంగా నిరంతరం కృషి చేశారు. నిరంతర విద్యుత్, కోటి ఎకరాలకు సాగునీరు వంటి కలలను సాకారం చేసుకునే దిశగా సాగుతున్నారు. అన్ని వర్గాల ప్రజలకు నేనున్నాను అనే ధీమా కల్పించారు. నాలుగేళ్లకు పైబడిన పాలనలో చేసిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు ‘ప్రగతి నివేదన’ సభ జరగబోతుంది. ఈ సభను విజయం చేసేందుకు ఆదిలాబాద్‌ పూర్వ జిల్లా నుంచి లక్ష మందిని తీసుకెళ్తాం. ప్రతి నియోజకవర్గం నుంచి 10వేల మందికి తక్కువ కాకుండా జనసమీకరణ చేస్తాం. నభూతో.. నభవిష్యతి అనే తరహాలో ఆదిలాబాద్‌ నంంచి లక్ష జనం కదలబోతున్నారు.
 
సభ విజయవంతం చేయాలి
నిర్మల్‌టౌన్‌: ప్రగతి నివేదిక సభ విజయవంతం చేయాలని రాష్ట్ర గృహనిర్మాణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రం నిర్మల్‌లోని మంత్రి నివాసంలో ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. హైదరాబాద్‌లో కొంగరకలాన్‌లో భారీ బహిరంగసభ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. టీఆర్‌ఎస్‌ శ్రేణులు పెద్ద ఎత్తున సభకు తరలిరావాలని కోరారు. ఇందులో టీఆర్‌ఎస్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి, నాయకులు వెంకట్‌రాంరెడ్డి, ముత్యం, తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

నిర్మల్‌లోని నివాసంలో సభ విషయమై సమీక్షిస్తున్న మంత్రి ఐకేరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement