ప్లాస్టిక్ కవర్లు (ఫైల్)
జగిత్యాల : పాలిథీన్(ప్లాస్టిక్) కవర్ల వినియోగం ఎంత ప్రమాదకరమో ఇటీవల జరిగిన సంఘటనలే తెలుపుతున్నాయి. సముద్రంలోని జీవులు సైతం ప్లాస్టిక్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నాయి. పర్యావరణానికి ప్రమాదకరంగా మారిన ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాలంటూ పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
50 మైక్రాన్ల కంటే తక్కువగా ఉన్న ప్లాస్టిక్ కవర్లను వినియోగించవద్దని ఆదేశాలు సూచిస్తున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం నిషేధాజ్ఞలు అమలుకాక కుప్పలుతెప్పలుగా ప్లాస్టిక్ కవర్లు పేరుకుపోతున్నాయి.
ప్లాస్టిక్ ప్రమాదకరం
ప్లాస్టిక్ కవర్లు, బాటిల్స్ ఏళ్లకేళ్లపాటు భూమిలో కరగకుండానే ఉంటాయి. దీంతో ప్రజలు అనారోగ్యానికి గురవడంతోపాటు రోగాలు విజృంభిస్తుంటాయి. ముఖ్యంగా మూగజీవాలు ప్లాస్టిక్ కవర్లు తిని ప్రాణాలు కోల్పోతున్నాయి.
ఇప్పటికే ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు వాడవద్దని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా ఆశించిన మేర ఫలితం ఇవ్వడం లేదు. మున్సిపల్ కార్యాలయాల్లోనూ ప్లాస్టిక్ కవర్లు వాడవద్దని ఆదేశించారు. జిల్లాలో మూడు మున్సిపాలిటీలున్నాయి.
ముఖ్యంగా కిరాణందారులు, కూరగాయల వ్యాపారులు, పండ్ల వ్యాపారులు, వివిధ దుకాణాల్లో ఎక్కువగా ప్లాస్టిక్ కవర్లనే వాడుతుంటారు. ప్రతి చిన్న వస్తువునైనా ప్లాస్టిక్ కవర్లలోనే ఇస్తున్నారు.
అవగాహన కల్పించినా శూన్యమే!
ప్లాస్టిక్ బాటిల్స్, కవర్లు వాడవద్దని ప్రభుత్వం అవగాహన కల్పిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తున్నారు. కూరగాయల మార్కెట్‌కు వెళ్లేవారు ముఖ్యంగా సంచులు తీసుకెళ్లకపోవడంతో వ్యాపారులు ప్లాస్టిక్ కవర్లలోనే పెట్టి అందజేస్తున్నారు.
అధికారులు కూడా పెద్దగా పట్టించుకోకపోవడంతో ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగింది. గతంలో పలుమార్లు వారానికోసారి అధికారులు తనిఖీలు చేసే వారు ప్రస్తుతం అలాంటి దాఖలాలు లేవు. అధికారులు నిషేధం అమలును సీరియస్‌గా తీసుకోకపోవడంతో వ్యాపారులు సైతం విచ్చలవిడిగా ప్లాస్టిక్ కవర్లను విక్రయిస్తున్నారు.
చెత్తసేకరణతో ఇబ్బందులు
మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఇంటింటికీ చెత్తసేకరణ చేపడుతుంటారు. గతంలో తడిచెత్త, పొడిచెత్త వేర్వేరుగా సేకరించినప్పటికీ.. ప్రస్తుతం నిలిచిపోయినట్లు ఉంది. జిల్లా కేంద్రంలోని గొల్లపల్లిరోడ్‌లో ఒక డంపింగ్‌యార్డు ఉండగా అంత అందులోనే పోస్తుంటారు.
ప్లాస్టిక్ కవర్లను వేరు చేయకపోవడంతో అందులోనే వేసి కాల్చివేస్తున్నారు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాలకు ఆ దుర్గంధం వ్యాపిస్తుంది. విరివిగా ప్లాస్టిక్‌ను వాడడం, డ్రెయినేజీల్లో పడేయడంతో మురికినీరు బయటకు వెళ్లకపోవడంతో రోడ్లపైనే మురికినీరు ప్రవహిస్తున్న సంఘటనలున్నాయి.
50 మైక్రాన్ల కన్నా తక్కువ ఉంటే చర్యలు
ముఖ్యంగా 50 మైక్రాన్ల కన్న తక్కవ ఉన్న కవర్లను వాడకూడదని నిబంధనలు తెలుపుతున్నాయి. జిల్లా కేంద్రంలో అనేక చోట్ల 50 మైక్రాన్ల కన్న తక్కువ ఉన్న కవర్లనే వాడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ముఖ్యంగా పండ్ల విక్రయదారులు, కూరగాయలు, కిరాణందారులు ఎక్కువగా వీటినే వాడుతున్నారు.
ప్లాస్టిక్ వాడకూడదు
బల్దియా పరిధిలోని వ్యాపారసంస్థలు, కార్యాలయాల్లో ప్లాస్టిక్ బాటిళ్లు, పాలిథీన్ కవర్లు వాడవద్దు. వ్యాపారసంస్థల్లో తనిఖీలు నిర్వహిస్తాం. 50 మైక్రాన్ల కన్న తక్కువగా ఉన్న కవర్లు, బాటిళ్లు వాడకూడదు. తనిఖీలు చేపడతాం. ఎవరైనా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. - సంపత్‌కుమార్, మున్సిపల్ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment