no implementations
-
సీఎం స్ఫూర్తికి ప్రై‘వేటు’
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ‘నో...స్కూల్ బ్యాగ్ డే’ పాటించాలని మూడు నెలల ముందే ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినా బే ఖాతరంటూ ప్రయివేటు పాఠశాలలు తమ పాత దారిలోనే నడుస్తున్నాయి. యథేచ్ఛగా ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్నా విద్యాశాఖ నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బండెడు పుస్తకాల బరువుతో చిన్నారులు పడుతున్న కష్టాలను ప్రజాసంకల్ప యాత్రలో చూసి చలించిన అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ‘నో బ్యాగ్ డే’ అమలుకు శ్రీకారం చుట్టారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ ఉన్న విద్యార్థులకు నెలలో మొదటి, మూడో శనివారం దీనిని కచ్చితంగా అమలు చేయాలని జూలై నెలలో ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నింటా అమలుకు ఆదేశాలు వచ్చాయి. కేవలం పుస్తకాలకే పరిమితమైపోతున్న విద్యార్థులలో మానసిక ఒత్తిడిని దూరం చేసి సృజనాత్మకతను వెలికితీయాలనే సదుద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం జిల్లాలో ప్రైవేటు పాఠశాల యాజమాన్యాల నిర్వాకంతో అటకెక్కుతోంది. ‘సాక్షి’ బృందం శనివారం జిల్లాలోని ప్రైవేటు యాజమాన్యాల్లో నడుస్తున్న పాఠశాలలపై నిఘా పెట్టగా డొల్లతనం బట్టబయలైంది. విద్యా డివిజన్లు ప్రైవేటు స్కూళ్లు విద్యార్థులు అమలాపురం 85 15,999 కాకినాడ 124 23,566 పిఠాపురం 80 17,903 రామచంద్రాపురం 80 16,672 రాజమహేంద్రవరం 102 21,135 మొత్తం 471 94,275 ఆ రోజు ఏమి చేయాలి...? ‘నో బ్యాగ్ డే’ పేరుతో ఆనంద పాఠాలు బోధించేలా ప్రణాళికను ప్రభుత్వం రూపొందించింది. ఉదయం నాలుగు తరగతుల్లో నీతి కథల బోధన, చిత్రలేఖనం, నైతిక విలువలు, సేవా కార్యక్రమాలను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించాలి. అనంతరం క్రీడలు, యోగాసనాలపై శిక్షణ ఇవ్వాలి. కథలు చదవడం, చెప్పడం, అనుభవాలు పంచుకోవడం, పొడుపు కథలు, పజిల్స్, సరదాగా ఆటలు ఆడించాలి. అలాగే పాఠశాలలో సాగు చేస్తున్న బడితోటలో పాదులు వేయడం, కలుపు తీయడం, పందిరి వేయడం, ఎరువులు వేయడం వంటి వాటిని అలవాటు చేయాలి. గ్రంథాలయాల్లో పుస్తకాలను ఎంపిక చేసుకుని చదవడం, వాటిపై చర్చించే అంశాలు నేర్పించాలి. ఆరోగ్య కార్యకర్తలు, మున్సిపల్, వ్యవసాయదారులు, తదితర పెద్దలను పిలిచి పిల్లలతో మాట్లాడించాలి. 1, 2 తరగతుల విద్యార్థులకు ఇంటి పని (హోంవర్క్) ఇవ్వకూడదు. జాతీయ విద్యా పరిశోధన మండలి సూచనల ప్రకారం 1, 2 తరగతులకు భాష, గణితం, 3, 4 తరగతులకు సామాన్య శాస్త్రం, గణితం తప్ప ఇతర సబ్జెక్ట్ పుస్తకాలు ఉండకూడదు. అదనపు పుస్తకాలు తీసుకు రావాలని యాజమాన్యాలు ఒత్తిడి చేయకూడదు. అదనపు మెటీరియల్ ఇచ్చినా అవన్నీ కలిపి కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ సూచించిన పుస్తకాల బరువును మించకూడదు. వీటిని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు పాటించడం లేదు. అన్ని పాఠశాలలూ పాటించాలి.. ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలన్నింటిలోనూ ‘నో బ్యాగ్ డే’ అమలు చేయాలి. ఈ మేరకు అన్ని మండలాల అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. ప్రభుత్వ పాఠశాలలు నూరు శాతం అమలు చేస్తున్నాయి. కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో పక్కాగానే వీటిని అమలు చేస్తున్నారు. అమలు చేయని యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటాం. -డి.అబ్రహం, జిల్లా విద్యాశాఖాధికారి -
ప్లాస్టిక్ నిషేధం అమలయ్యేనా?
జగిత్యాల : పాలిథీన్(ప్లాస్టిక్) కవర్ల వినియోగం ఎంత ప్రమాదకరమో ఇటీవల జరిగిన సంఘటనలే తెలుపుతున్నాయి. సముద్రంలోని జీవులు సైతం ప్లాస్టిక్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నాయి. పర్యావరణానికి ప్రమాదకరంగా మారిన ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాలంటూ పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. 50 మైక్రాన్ల కంటే తక్కువగా ఉన్న ప్లాస్టిక్ కవర్లను వినియోగించవద్దని ఆదేశాలు సూచిస్తున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం నిషేధాజ్ఞలు అమలుకాక కుప్పలుతెప్పలుగా ప్లాస్టిక్ కవర్లు పేరుకుపోతున్నాయి. ప్లాస్టిక్ ప్రమాదకరం ప్లాస్టిక్ కవర్లు, బాటిల్స్ ఏళ్లకేళ్లపాటు భూమిలో కరగకుండానే ఉంటాయి. దీంతో ప్రజలు అనారోగ్యానికి గురవడంతోపాటు రోగాలు విజృంభిస్తుంటాయి. ముఖ్యంగా మూగజీవాలు ప్లాస్టిక్ కవర్లు తిని ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇప్పటికే ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు వాడవద్దని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా ఆశించిన మేర ఫలితం ఇవ్వడం లేదు. మున్సిపల్ కార్యాలయాల్లోనూ ప్లాస్టిక్ కవర్లు వాడవద్దని ఆదేశించారు. జిల్లాలో మూడు మున్సిపాలిటీలున్నాయి. ముఖ్యంగా కిరాణందారులు, కూరగాయల వ్యాపారులు, పండ్ల వ్యాపారులు, వివిధ దుకాణాల్లో ఎక్కువగా ప్లాస్టిక్ కవర్లనే వాడుతుంటారు. ప్రతి చిన్న వస్తువునైనా ప్లాస్టిక్ కవర్లలోనే ఇస్తున్నారు. అవగాహన కల్పించినా శూన్యమే! ప్లాస్టిక్ బాటిల్స్, కవర్లు వాడవద్దని ప్రభుత్వం అవగాహన కల్పిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తున్నారు. కూరగాయల మార్కెట్‌కు వెళ్లేవారు ముఖ్యంగా సంచులు తీసుకెళ్లకపోవడంతో వ్యాపారులు ప్లాస్టిక్ కవర్లలోనే పెట్టి అందజేస్తున్నారు. అధికారులు కూడా పెద్దగా పట్టించుకోకపోవడంతో ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగింది. గతంలో పలుమార్లు వారానికోసారి అధికారులు తనిఖీలు చేసే వారు ప్రస్తుతం అలాంటి దాఖలాలు లేవు. అధికారులు నిషేధం అమలును సీరియస్‌గా తీసుకోకపోవడంతో వ్యాపారులు సైతం విచ్చలవిడిగా ప్లాస్టిక్ కవర్లను విక్రయిస్తున్నారు. చెత్తసేకరణతో ఇబ్బందులు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఇంటింటికీ చెత్తసేకరణ చేపడుతుంటారు. గతంలో తడిచెత్త, పొడిచెత్త వేర్వేరుగా సేకరించినప్పటికీ.. ప్రస్తుతం నిలిచిపోయినట్లు ఉంది. జిల్లా కేంద్రంలోని గొల్లపల్లిరోడ్‌లో ఒక డంపింగ్‌యార్డు ఉండగా అంత అందులోనే పోస్తుంటారు. ప్లాస్టిక్ కవర్లను వేరు చేయకపోవడంతో అందులోనే వేసి కాల్చివేస్తున్నారు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాలకు ఆ దుర్గంధం వ్యాపిస్తుంది. విరివిగా ప్లాస్టిక్‌ను వాడడం, డ్రెయినేజీల్లో పడేయడంతో మురికినీరు బయటకు వెళ్లకపోవడంతో రోడ్లపైనే మురికినీరు ప్రవహిస్తున్న సంఘటనలున్నాయి. 50 మైక్రాన్ల కన్నా తక్కువ ఉంటే చర్యలు ముఖ్యంగా 50 మైక్రాన్ల కన్న తక్కవ ఉన్న కవర్లను వాడకూడదని నిబంధనలు తెలుపుతున్నాయి. జిల్లా కేంద్రంలో అనేక చోట్ల 50 మైక్రాన్ల కన్న తక్కువ ఉన్న కవర్లనే వాడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ముఖ్యంగా పండ్ల విక్రయదారులు, కూరగాయలు, కిరాణందారులు ఎక్కువగా వీటినే వాడుతున్నారు. ప్లాస్టిక్ వాడకూడదు బల్దియా పరిధిలోని వ్యాపారసంస్థలు, కార్యాలయాల్లో ప్లాస్టిక్ బాటిళ్లు, పాలిథీన్ కవర్లు వాడవద్దు. వ్యాపారసంస్థల్లో తనిఖీలు నిర్వహిస్తాం. 50 మైక్రాన్ల కన్న తక్కువగా ఉన్న కవర్లు, బాటిళ్లు వాడకూడదు. తనిఖీలు చేపడతాం. ఎవరైనా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. - సంపత్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ -
‘జట్టు’మిట్టాడుతూ..
కార్మికులకు సక్రమంగా అమలుకాని చట్టాలు కానరాని వైద్యశిబిరాలు ఆనారోగ్యాల పాలవుతున్న రైస్‌మిల్లు జట్టు కార్మికులు పట్టించుకోని కార్మికశాఖ అధికారులు బస్తాల కొండలెక్కేటప్పుడు మోకాళ్లు కుంగిపోతున్నా.. అలుపెరుగకుండా జీవనోపాధి కోసం చెమటోడుస్తారు రైస్‌మిల్లు జట్టు కార్మికులు. నిత్యం దుమ్ము, ధూళిలో ఆరోగ్యం క్షీణిస్తున్నా.. బతకుబండిని అలానే ఈడ్చుతున్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని శ్రమైక జీవనం చేస్తున్న వీరికి కార్మిక చట్టాల అమలు అందని ద్రాక్షగానే మిగులుతున్నాయి. వైద్యశిబిరాలు మచ్చుకు కూడా కనిపించడం లేదు. – మండపేట జిల్లా వ్యాప్తంగా బాయిల్డ్, రారైస్ మిల్లులు సుమారు 480 వరకు ఉండగా దాదాపు 40 వేల మందికి పైగా జట్టు కార్మికులుగా పని చేస్తున్నారు. వీరిలో ఎనిమిది వేల మంది వరకు మహిళా కార్మికులు ఉన్నట్టు అంచనా. ముఖ్యంగా మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం, బిక్కవోలు, అనపర్తి, తదితర మండలాల్లో రైసు మిల్లులు ఉన్నాయి. పురుషులు ధాన్యం బస్తాల లోడింగ్, ఆ¯ŒSలోడింగ్, మిల్లింగ్ చేయడం తదితర పనులు చేస్తే, మహిళలు కార్మికులు నూక, తవుడు ఎత్తడం, శుభ్రం చేయడం తదితర పనులు పని చేస్తుంటారు. అసంఘటిత రంగంలోకి వచ్చే జట్టు కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక చట్టాలున్నా అమలు అంతంతమాత్రమే. నిత్యవసర వస్తువుల ధరలు చుక్కల్లో చేరిపోగా వేతన చట్టం సక్రమంగా అమలుకాకపోవడం కార్మికుల జీవన స్థితిగతులపై ప్రభావాన్ని చూపుతోంది. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకున్నా వచ్చేది నామమాత్రమేనని కూలీలు వాపోతున్నారు. 40 ఏళ్లకే ఆరోగ్య సమస్యలు అధిక బరువులు మోయడం, దుమ్ము, దూగరలలో పనిచేయాల్సి రావడం వల్ల 40 ఏళ్లు వచ్చేసరికి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రధానంగా ఊపిరితిత్తులు, కళ్లు, కీళ్లు, నడుము సంబంధిత సమస్యలు అధికంగా వస్తుంటాయి. వైద్య సిబ్బందిని మిల్లు వద్దకు తీసుకువచ్చి వైద్యశిబిరాలు నిర్వహించాల్సి ఉన్నా ఎక్కడ అమలుకావడం లేదని కార్మికులు అంటున్నారు. నిబంధనల మేరకు ఎనిమిది గంటలు మాత్రమే పనిచేయాల్సి ఉండగా కొన్నిచోట్ల 24 గంటలు పనిచేయాల్సి రావడంతో తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తోందంటున్నారు. మహిళలకు కనీస వేతనం, ప్రసూతి సేవలు తదితర సదుపాయాలు అమలు లేదు. 24 గంటలు పనిచేస్తే వచ్చేది కేవలం రూ.450 మాత్రమే అమలు కాని కార్మిక చట్టాలు ఏ సంస్థలోనైనా 20 మందికి పైబడి కార్మికులు పనిచేస్తుంటే వారికి పీఎఫ్ తదితర అన్ని సౌకర్యాలు కల్పించడం, ప్రభుత్వ సెలవు దినాల్లో వేతనాలు చెల్లించడం వంటి చట్టాలు అమలు అంతంతమాత్రంగానే ఉంది. పనిచేసే చోట కార్మికుడు ప్రమాదానికి గురైతే అతడికి యాజమాన్యం నష్టపరిహారం చెల్లించడంతో పాటు ఆ కార్మికుడు పూర్తిగా కోలుకునే వరకు అతడి కుటుంబానికి జీవనభృతి కల్పించాల్సి ఉంది. కార్మికులు ప్రమాదానికి గురైనప్పుడు కేవలం ప్రాథమిక చికిత్స చేయించి యజమానులు చేతులు దులుపుకొంటున్నారని కార్మికులు విమర్శిస్తున్నారు. ఏడాదికి రెండు నెలల జీతాన్ని బోనస్‌గా అందజేయాల్సి ఉన్నా, అది అమలుకావడం లేదంటున్నారు. రెండు నెలలకోసారి కార్మికశాఖ అధికారులు ఆయా సంస్థల్లో పర్యటించి కార్మికుల హక్కుల అమలును పరిశీలించాల్సి ఉండగా అధికారులు తనఖీలు చేస్తున్న దాఖలాలు లేవంటున్నారు. కార్మిక చట్టాల అమలుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చట్టాల అమలులేదు రైస్‌మిల్లుల్లో కార్మిక చట్టాలు సక్రమంగా అమలుకావడం లేదు. పోరాటాల ద్వారా కొన్నింటిని సాధించుకోగలిగినా అధికశాతం చట్టాలు మరుగునపడిపోయాయి. కార్మికశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. – సీహెచ్ వెంకటేశ్వరరావు, ఐఎఫ్టీయూ నాయకుడు, మండపేట నష్టపోతున్నాం చట్టాలు అమలుకాక కార్మికులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. దుమ్ము, దూగరలతో ఆనారోగ్యాల పాలవుతున్నా ఆరోగ్య శిబిరాలు నిర్వహణ లేదు. చట్టాలు సక్రమంగా అమలయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. – నల్లా శ్రీను, జట్టు కార్మిక సంఘం నాయకుడు, మండపేట