‘జట్టు’మిట్టాడుతూ.. | labour schemes no implementations | Sakshi
Sakshi News home page

‘జట్టు’మిట్టాడుతూ..

Published Fri, Jan 27 2017 11:03 PM | Last Updated on Tue, Sep 5 2017 2:16 AM

‘జట్టు’మిట్టాడుతూ..

‘జట్టు’మిట్టాడుతూ..

  • కార్మికులకు సక్రమంగా అమలుకాని చట్టాలు
  • కానరాని వైద్యశిబిరాలు 
  • ఆనారోగ్యాల పాలవుతున్న రైస్‌మిల్లు జట్టు కార్మికులు
  • పట్టించుకోని కార్మికశాఖ అధికారులు
  • బస్తాల కొండలెక్కేటప్పుడు మోకాళ్లు కుంగిపోతున్నా.. అలుపెరుగకుండా జీవనోపాధి కోసం చెమటోడుస్తారు రైస్‌మిల్లు జట్టు కార్మికులు. నిత్యం దుమ్ము, ధూళిలో ఆరోగ్యం క్షీణిస్తున్నా.. బతకుబండిని అలానే ఈడ్చుతున్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని శ్రమైక జీవనం చేస్తున్న వీరికి కార్మిక చట్టాల అమలు అందని ద్రాక్షగానే మిగులుతున్నాయి. వైద్యశిబిరాలు మచ్చుకు కూడా కనిపించడం లేదు. 
    – మండపేట
     
    జిల్లా వ్యాప్తంగా బాయిల్డ్, రారైస్‌ మిల్లులు సుమారు 480 వరకు ఉండగా దాదాపు 40 వేల మందికి పైగా జట్టు కార్మికులుగా పని చేస్తున్నారు. వీరిలో ఎనిమిది వేల మంది వరకు మహిళా కార్మికులు ఉన్నట్టు అంచనా. ముఖ్యంగా మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం, బిక్కవోలు, అనపర్తి, తదితర మండలాల్లో రైసు మిల్లులు ఉన్నాయి. పురుషులు ధాన్యం బస్తాల లోడింగ్, ఆ¯ŒSలోడింగ్, మిల్లింగ్‌ చేయడం తదితర పనులు చేస్తే, మహిళలు కార్మికులు నూక, తవుడు ఎత్తడం, శుభ్రం చేయడం తదితర పనులు పని చేస్తుంటారు. అసంఘటిత రంగంలోకి వచ్చే జట్టు కార్మికులకు పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక చట్టాలున్నా అమలు అంతంతమాత్రమే. నిత్యవసర వస్తువుల ధరలు చుక్కల్లో చేరిపోగా వేతన చట్టం సక్రమంగా అమలుకాకపోవడం కార్మికుల జీవన స్థితిగతులపై ప్రభావాన్ని చూపుతోంది. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకున్నా వచ్చేది నామమాత్రమేనని కూలీలు వాపోతున్నారు. 
    40 ఏళ్లకే ఆరోగ్య సమస్యలు
    అధిక బరువులు మోయడం, దుమ్ము, దూగరలలో పనిచేయాల్సి రావడం వల్ల 40 ఏళ్లు వచ్చేసరికి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రధానంగా ఊపిరితిత్తులు, కళ్లు, కీళ్లు, నడుము సంబంధిత సమస్యలు అధికంగా వస్తుంటాయి. వైద్య సిబ్బందిని మిల్లు వద్దకు తీసుకువచ్చి వైద్యశిబిరాలు నిర్వహించాల్సి ఉన్నా ఎక్కడ అమలుకావడం లేదని కార్మికులు అంటున్నారు. నిబంధనల మేరకు ఎనిమిది గంటలు మాత్రమే పనిచేయాల్సి ఉండగా కొన్నిచోట్ల 24 గంటలు పనిచేయాల్సి రావడంతో తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తోందంటున్నారు. మహిళలకు కనీస వేతనం, ప్రసూతి సేవలు తదితర సదుపాయాలు అమలు లేదు. 24 గంటలు పనిచేస్తే వచ్చేది కేవలం రూ.450 మాత్రమే 
     
    అమలు కాని కార్మిక చట్టాలు
    ఏ సంస్థలోనైనా 20 మందికి పైబడి కార్మికులు పనిచేస్తుంటే వారికి పీఎఫ్‌ తదితర అన్ని సౌకర్యాలు కల్పించడం, ప్రభుత్వ సెలవు దినాల్లో వేతనాలు చెల్లించడం వంటి చట్టాలు అమలు అంతంతమాత్రంగానే ఉంది. పనిచేసే చోట కార్మికుడు ప్రమాదానికి గురైతే అతడికి యాజమాన్యం నష్టపరిహారం చెల్లించడంతో పాటు ఆ కార్మికుడు పూర్తిగా కోలుకునే వరకు అతడి కుటుంబానికి జీవనభృతి కల్పించాల్సి ఉంది. కార్మికులు ప్రమాదానికి గురైనప్పుడు కేవలం ప్రాథమిక చికిత్స చేయించి యజమానులు చేతులు దులుపుకొంటున్నారని కార్మికులు విమర్శిస్తున్నారు. ఏడాదికి రెండు నెలల జీతాన్ని బోనస్‌గా అందజేయాల్సి ఉన్నా, అది అమలుకావడం లేదంటున్నారు. రెండు నెలలకోసారి కార్మికశాఖ అధికారులు ఆయా సంస్థల్లో పర్యటించి కార్మికుల హక్కుల అమలును పరిశీలించాల్సి ఉండగా అధికారులు తనఖీలు చేస్తున్న దాఖలాలు లేవంటున్నారు. కార్మిక చట్టాల అమలుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
     
    చట్టాల అమలులేదు
    రైస్‌మిల్లుల్లో కార్మిక చట్టాలు సక్రమంగా అమలుకావడం లేదు. పోరాటాల ద్వారా కొన్నింటిని సాధించుకోగలిగినా అధికశాతం చట్టాలు మరుగునపడిపోయాయి. కార్మికశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు.
    –  సీహెచ్‌ వెంకటేశ్వరరావు, 
    ఐఎఫ్‌టీయూ నాయకుడు, మండపేట
     
    నష్టపోతున్నాం
    చట్టాలు అమలుకాక కార్మికులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. దుమ్ము, దూగరలతో ఆనారోగ్యాల పాలవుతున్నా ఆరోగ్య శిబిరాలు నిర్వహణ లేదు. చట్టాలు సక్రమంగా అమలయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.
    – నల్లా శ్రీను, 
    జట్టు కార్మిక సంఘం నాయకుడు, మండపేట 
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement