ఈ ఏడాది వర్షాలు తక్కువే! | No rains in this year | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది వర్షాలు తక్కువే!

Published Tue, Mar 28 2017 12:52 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

ఈ ఏడాది వర్షాలు తక్కువే! - Sakshi

ఈ ఏడాది వర్షాలు తక్కువే!

సాధారణం కంటే 5 శాతం తక్కువ
జూలై చివరికి ఎల్‌నినో పరిస్థితులు
ఖరీఫ్‌ పంటకు కష్టాలే
రుతుపవనాలపై స్కైమెట్‌ అంచనాలు

ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే కొంచెం తక్కువగా ఉండేందుకే అవకాశాలున్నాయని ప్రైవేట్‌ వాతావరణ పరిశోధన సంస్థ స్కైమెట్‌ ప్రకటించింది. దీర్ఘకాలిక సగటు వర్షపాతంతో పోలిస్తే ఈ ఏడాది వానలు ఐదు శాతం వరకు తక్కువగా ఉంటాయని... దీంతో ఖరీఫ్‌ పంటల విషయంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చునని హెచ్చరించింది. జూన్‌ 1న కేరళ తీరాన్ని తాకి సెప్టెంబర్‌ వరకు దేశవ్యాప్తంగా వర్షాలు కురిపించే నైరుతి రుతుపవనాలు దేశ రైతాంగానికి, ఆర్థిక వ్యవస్థకూ కీలకమన్న విషయం తెలిసిందే.

 గత ఏడాది బలహీనమైన ‘లానినా’ పరిస్థితుల కారణంగా సాధారణ వర్షపాతం కంటే మూడు శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. అయితే ఈ ఏడాది ఇప్పటికే పసిఫిక్‌ మహా సముద్ర ప్రాంతంలో ఉపరితల నీరు వెచ్చబడటం మొదలైంది. ఇలాంటి పరిస్థితిని ఎల్‌నినో అంటారని.. నైరుతి రుతుపవనాలపై ఇది దుష్ప్రభావం చూపుతుందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది వర్షాలు కొంచెం తక్కువగా ఉంటాయని స్కైమెట్‌ అంచనా వేసింది.

 మరోవైపు భారత వాతావరణ సంస్థ ఈ ఏడాది రుతుపవనాల రాక, విస్తరణ సాధారణంగానే ఉంటాయని, జూలై తరువాత ఎల్‌ నినో పరిస్థితుల ప్రభావం ఉండవచ్చునని చెబుతుండటం గమనార్హం. స్కైమెట్‌ అంచనాల ప్రకారం... ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం కురిసే అవకాశాలు అస్సలు లేవు.

సాధారణ వర్షపాతానికి ఉన్న అవకాశాలు పది శాతం మాత్రమే కాగా, కొంచెం తక్కువగా ఉండేందుకు ఉన్న అవకాశం 50 శాతం. అలాగని ఈ ఏడాది మళ్లీ కరువు ఛాయలు ఏర్పడతాయా? అంటే అందుకు ఉన్న అవకాశాలు 15 శాతం మాత్రమేనని, సాధారణం కంటే తక్కువ (90 నుంచి 95 శాతం వర్షపాతం) కురిసేందుకు 25 శాతం అవకాశముందని స్కైమెట్‌ శాస్త్రవేత్తలు వివరించారు.  
 – సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement