ఆర్మూర్‌లో కుండపోత
ఏకంగా 39.5 సెం.మీ. వర్షపాతం
- తెలంగాణ చరిత్రలో ఇదే అత్యధికం
-1908లో హన్మకొండలో 30 సెం.మీ., 1983లో నిజామాబాద్‌లో 35 సెం.మీ.
- అప్పటి రికార్డులన్నీ బద్దలు
- తెలంగాణపై స్థిరంగా అల్పపీడనం
- మరో 4 రోజులపాటు భారీ వర్షాలు
- 5 లక్షల ఎకరాల్లో నీట మునిగిన పంటలు!
- పట్టించుకోని వ్యవసాయ శాఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ చరిత్రలో అత్యధిక వర్షపాతం నమోదైంది. గత 24 గంటల్లో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో ఏకంగా 39.5 సెంటీమీటర్ల కుండపోత వర్షం కురిసింది. వాతావరణ శాఖ రికార్డు చేసిన లెక్కల ప్రకారం గత వందేళ్లలో ఎన్నడూ ఇంతటి వర్షపాతం నమోదు కాలేదు. 1908 సెప్టెంబర్ 28న హన్మకొండలో 30.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత 1954 జూలై 10న ఖమ్మంలో 30 సెం.మీ. రికార్డు అయింది. ఆ తర్వాత 1983 అక్టోబర్ 6న నిజామాబాద్‌లో 35.5 సెం.మీ. నమోదైంది. వందేళ్ల చరిత్రలో రికార్డయిన వీటన్నింటినీ తిరగరాస్తూ ఆర్మూర్‌లో శుక్రవారం ఉదయం 8.30 గంటల నుంచి శనివారం ఉదయం 8.30 గంటల వరకు 39.5 సెంటీమీటర్లు రికార్డు కావడంపై వాతావరణ శాఖ అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అదే జిల్లా మద్నూర్, రెంజల్, బోధన్, ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో 20 సెం.మీ. కుండపోత వర్షపాతం నమోదైంది. జిల్లాలోని నందిపేట, బాల్కొండలో 19 సెం.మీ., జక్రాన్‌పల్లి, వేల్పూర్‌లలో 18 సెం.మీ., నవీపేట్, తాడ్వాయిలలో 16 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. మక్లూరు, ఎడపల్లి, మోర్తాడ్‌లో 15 సెం.మీ., లింగంపేటలో 14, వర్ని, కోటగిరి, ముధోల్, కామారెడ్డిల్లో 13 సెం.మీ. చొప్పున వర్షం కురిసింది. జుక్కల్, రుద్రూరు, డిచ్‌పల్లి, ఉట్నూరు, గూడూరులో 12 సెం.మీ. చొప్పున వర్షం కురిసింది.
పంటల్ని పట్టించుకునేవారేరి?
భారీ వర్షాలకు రాష్ట్రంలో దాదాపు 5 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు నీటమునిగినట్లు సమాచారం. ముఖ్యంగా పత్తి, వరి, కంది తదితర పంటలు నీటిలోనే ఉండిపోయాయి. మరో రెండు మూడ్రోజులు నీటిలోనే ఉంటే పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెబుతున్నారు. అయితే పంటల పరిస్థితి ఎలా ఉందో ఇప్పటికీ వ్యవసాయ శాఖ అంచనాలు వేయడంలో విఫలమవుతోంది. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో రైతులకు సూచనలు సలహాలు ఇవ్వడం లేదన్న విమర్శలున్నాయి. అందుకోసం రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఎలాంటి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. సమీక్షలు చేస్తున్నామని చెబుతున్నారే కానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో రైతులకు సమాచారం ఇచ్చే దిక్కు లేకుండా పోయిం ది. రాష్ట్ర, జిల్లాస్థాయిల్లో అధికారులు అందుబాటులో ఉండటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నేడు భారీవర్షాలు
తెలంగాణ, దక్షిణ ఛత్తీస్‌గఢ్, విదర్భ ప్రాంతాల్లో అల్పపీడనం స్థిరంగా ఆవరించి ఉంది. దాంతోపాటు ఉపరితల ఆవర్తనం నైరుతి దిశగా కదులుతోంది. దీనివల్ల క్యుములోనింబస్ మేఘాలు దట్టంగా ఆవరించి ఉన్నాయి. వీటి కారణంగా ఆదివారం రాష్ట్రంలో అక్కడక్కడ కుండపోత వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే 26, 27, 28 తేదీల్లో అనేకచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.