ఈదురు గాలుల బీభత్సం
జిల్లాలో పలుచోట్ల అకాల వర్షం
నేలకొరిగిన పంటలు, చెట్లు, విద్యుత్‌స్తంభాలు
నవీపేట(బోధన్): మండల కేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో బుధవారం సాయ్రంతం ఈదురు గాలులు, వడగండ్ల వాన భీభత్సం సృష్టించింది. నవీపేట నుంచి జన్నెపల్లికి వెళ్లే రోడ్డుపై రెండు భారీ వృక్షాలు నేలకొరిగాయి. జన్నెపల్లి, సిరన్‌పల్లి, నాళేశ్వర్, నందిగామ, లింగాపూర్ గ్రామాన్లే వడగండ్లతో కూడిన వర్షాలు పడ్డాయి. నవీపేట, జన్నెపల్లి సబ్‌స్టేషన్ పరిధిలో 50 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మొక్కజొన్న, వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది.
నిండా ముంచిన వర్షం
నందిపేట(ఆర్మూర్): అకాల వర్షం రైతులను నిండా ముంచింది. చేతికొచ్చిన పంటలన్నీ తడిసి ముద్దయ్యాయి. బుధవారం సాయంత్రం మండలంలోని వెల్మల్, కౌల్‌పూర్, ఆంధ్రనగర్‌లలో ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురియడంతో కల్లాల్లో ఉన్న పసుపు, జొన్నలు తడిసిపోయాయి. పసుపు తడవడంతో రంగుమారి కనీస ధర కూడా దక్కదని రైతులు ఆందోళన చెందుతున్నారు. కోత కోసి కుప్పలుగా ఉంచిన జొన్నలు కూడా వర్షార్పణమయ్యాయి.