అనంతపురం అగ్రికల్చర్: రాగల నాలుగు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే సూచనలు ఉన్నాయని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి అందిన సమాచారం మేరకు జిలాల్లో 12 నుంచి 16వ తేదీ వరకు 2.5 మి.మీ నుంచి 35.5 మిల్లీమీటర్లు (మి.మీ) మేర వర్షపాతం నమోదు కావచ్చని తెలిపారు.
ఉష్ణోగ్రతలు గరిష్టంగా 34 నుంచి 37 డిగ్రీలు, కనిష్టం 24 నుంచి 25 డిగ్రీలు ఉండవచ్చని వెల్లడించారు. గాలిలో తేమశాతం ఉదయం 73 నుంచి 77, మధ్యాహ్నం 50 నుంచి 53 శాతం మధ్య రికార్డు కావచ్చన్నారు. గంటకు 14 నుంచి 16 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.