సాక్షి, రంగారెడ్డి జిల్లా: రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎమ్‌ఎస్‌ఏ) కార్యక్రమంలో భాగంగా పదోన్నతులు పొందిన టీచర్లకు వేతన కష్టాలు మొదలయ్యాయి. ఆయా ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించే ప్రధాన పద్దులో కాసులు నిండుకోవడంతో ఈ సమస్య తలెత్తింది. నెల ప్రారంభమై 18 రోజులు పూర్తయినా ఆయా ఉపాధ్యాయులకు ఇప్పటికీ వేతనాలు అందలేదు. ఖజానా విభాగం అధికారులు సైతం ఈ అంశాన్ని పట్టించుకోకపోవడంతో వారిలో ఆందోళన తీవ్రమవుతోంది.
జిల్లాలో ఆర్‌ఎమ్‌ఎస్‌ఏలో భాగంగా 2012లో 633 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించారు. అవసరం మేరకు వీరిని ఆయా ఉన్నత పాఠశాలల్లో నియమించారు. అయితే వీరికి ప్రతినెల ఆర్‌ఎమ్‌ఎస్‌ఏ ప్రధాన పద్దు నుంచి వేతనాలు చెల్లిస్తున్నారు. తాజాగా ఈ పద్దులో నిధులు నిండుకున్నాయి. దీంతో మార్చి నెలకు సంబంధించి ఆయా టీచర్లకు చెల్లించాల్సిన వేతనాలకు కటకట నెలకొంది. ఈ నేపథ్యంలో వేతనాలు చెల్లించాలంటూ ఉపాధ్యాయులు ఆర్థిక శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే ప్రధాన పద్దు నుంచి ఇతర పద్దులోకి మార్చి వేతనాలు చెల్లించాలంటూ ఆర్థిక శాఖ స్పష్టత ఇచ్చింది. కానీ పద్దు మార్పు చేయడంలో నెలకొన్న జాప్యంతో ఆయా ఉపాధ్యాయులకు ఇప్పటివరకు వేతనాలు అందలేదు.
అధికారుల నిర్లక్ష్యం
ఆర్థిక శాఖ ఆదేశాల ప్రకారం ప్రధాన పద్దు నుంచి వారికి మినహాయింపు ఇస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్న పద్దు నుంచి వేతనాలు చెల్లించాల్సి ఉంది. ఇందులో భాగంగా పద్దు మార్పును సూచిస్తూ అన్ని ఖజానా విభాగానికి బిల్లులు అందజేశారు. కానీ ఆ విభాగ అధికారులు మాత్రం ఈ బిల్లులను ఇప్పటికీ క్లియర్ చేయకుండా అట్టిపెట్టుకున్నాయి. దీంతో ఉపాధ్యాయులకు నెల గడుస్తున్నా ఇప్పటికీ వేతనాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఖజానా ఖాళీ!
Published Fri, Apr 18 2014 12:17 AM | Last Updated on Sat, Sep 15 2018 5:09 PM
Advertisement
Advertisement