ఓ తండ్రి వ్యథ! | Nobody's Father! | Sakshi
Sakshi News home page

ఓ తండ్రి వ్యథ!

Published Sun, Jun 22 2014 12:15 AM | Last Updated on Sat, Sep 2 2017 9:10 AM

ఓ తండ్రి వ్యథ!

ఓ తండ్రి వ్యథ!

  •      పిల్లల్ని చూసుకునే అదృష్టమూ లేదా?
  •      విడాకులు తీసుకున్నంత మాత్రాన బిడ్డల్నీ వదులుకోవాల్సిందేనా?
  •      చిన్నారుల దరి చేరేందుకు క్రిస్ప్ పోరాటం
  • సాక్షి, సిటీబ్యూరో: ‘తండ్రులు మూర్ఖులు కాదు.. క్రూరులు అంతకన్నా కాదు. మాకు పిల్లలంటే ప్రాణం. వారిని రోజూ చూడాలని, ఆడించాలని, చదువు చెప్పించాలని, భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని మాకూ ఉంటుంది’ అంటున్నారు బాధిత భర్తలు. ‘భార్యాభర్తల మధ్య చోటుచేసుకునే చిన్నచిన్న సమస్యలకు సైతం కోర్టులకెక్కి విడాకులు తీసుకోవడం... వారి వెంట పిల్లలను తీసుకెళ్లడంతో మేం పిల్లల పెంపకానికి దూరంగా ఉండాల్సి వస్తోంది’ అని ఆందోళన చెందుతున్నారు బాధిత తండ్రులు.

    పిల్లలు పుట్టకముందే ఎన్నో ఆశలు పెట్టుకుంటామని అలాంటిది పుట్టిన పిల్లలకు దూరంగా ఎలా ఉండగలమని కన్నీటిపర్యంతమయ్యారు. ఇలాంటి వారంతా చిల్డ్రన్స్ రైట్స్ ఇనిషియేటివ్ ఫర్ షేర్డ్ పేరెంట్స్ (క్రిస్ప్) సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఆ ప్రతినిధులు శనివారం నగరంలోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో తాము అనుభవిస్తున్న బాధను సమాజం ముందుకు పెట్టే ప్రయత్నం చేశారు.

    ‘భార్యాభర్తలు విడాకులు తీసుకుంటే పిల్లల సంరక్షణ, బాధ్యత తల్లే తీసుకోవాలని భారతీయ చట్టం చెబుతోంది. కానీ, ఇది అన్యాయం’ అంటోంది చిల్డ్రన్స్ రైట్స్ ఇనిషియేటివ్ ఫర్ షేర్డ్ పేరెంట్స్ (క్రిస్ప్). పిల్లలకు తండ్రి పెంపకం అవసరమని సమాజానికి చాటిచెప్పడమే ఈ సంస్థ ముఖ్య ఉద్దేశమని వారంటున్నారు. వ్యక్తిగత కారణాలు, కుటుంబ తగాదాలతో విడిపోయినంత మాత్రాన పిల్లలపై తండ్రికి హక్కులేదనటం సరికాదని వారు పేర్కొంటున్నారు.
     
    క్రిస్ప్‌లో 5 వేల మంది సభ్యులు..

    సీఆర్‌ఐఎస్పీలో ప్రస్తుతం ఐదు వేల మంది సభ్యులున్నారు. బెంగళూరు, నాగ్‌పూర్, పుణె, చెన్నై, ఢిల్లీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ముంబై రాష్ట్రాల్లో సీఆర్‌ఐఎస్పీ(క్రిస్ప్) తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అత్యధికంగా బెంగళూరులో 1,700 మంది సభ్యులుండగా ఢిల్లీలో 1,200, ముంబైలో 600, నాగ్‌పూర్‌లో 300, త్రివేండ్రం, పుణెలో 200, తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌లో 800 మంది సభ్యులున్నారు. ఇందులో హైదరాబాద్ నుంచే వంద మంది సభ్యులున్నారు.
     
    పిల్లల కోసమే ప్రత్యేక మంత్రిత్వ శాఖ..

    సీఆర్‌ఐఎస్పీ కార్యకలాపాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు దేశవ్యాప్తంగా లక్షలాది మందితో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపడుతోంది. త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవనున్నట్లు ఆ సంస్థ సభ్యులు చెబుతున్నారు.
     
    ఇవి తప్పనిసరి అంటున్న క్రిస్ప్ ప్రతినిధులు
    మహిళా, శిశు సంక్షేమ శాఖతో పిల్లలు తల్లికే పరిమితమనే తప్పుడు భావన సమాజంలోకి పోతోంది. అందుకే పిల్లల కోసమే ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి.
         
    కోర్టుకు వచ్చే విడాకుల కేసులను ఏళ్ల తరబడి సాగదీయొద్దు. జాప్యం జరిగితే పిల్లలు, తల్లిదండ్రులు అందరూ మానసిక క్షోభకు గురవుతారు.
         
    తండ్రి అంటే క్రూరులు, మూర్కులనే అభిప్రాయాన్ని పిల్లల్లో కలిగించే వారిని కఠినంగా శిక్షించాలి.
         
    భార్యాభర్తల మధ్య ఏర్పడే తగాదాలను సాధ్యమైనంత వరకు వ్యక్తిగతంగా సరిదిద్దుకోవాలి. లేదా ఫ్యామిలీ కౌన్సెలర్‌తో చర్చించి పరిష్కరించుకోవాలి.
         
    విడాకుల తీసుకున్న భార్యాభర్తలు తమ పిల్లల సంరక్షణ విషయంలో ప్రభుత్వం ప్రత్యేకమైన  చట్టాన్ని తీసుకురావాలి. సోమవారం నుంచి శుక్రవారం వరకు తల్లి ఆధ్వర్యంలో, శని, ఆదివారాలు తండ్రి సంరక్షణలో ఉండాలని నిర్ణయించాలి.
     
     కూతురిని చూసి నాలుగేళ్లవుతోంది..

     నేను వృత్తి రీత్యా వ్యాపారిని. నాకు 2005లో వివాహం జరిగింది. నా భార్య లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావడంతో అక్కడే స్థిరపడ్డాం. వివాహమైన మూడేళ్లకు కూతురు (నిషా) పుట్టింది. కారణాలు ఏవైనా మేం విడిపోయాం. వ్యక్తిగతంగా ఎలాంటి వ్యసనాలు, చెడు ఆలోచనలు, అలవాట్లు లేని నాకు మానసిక లోపం ఉందటూ, అదనపు వరకట్నం కోసం వేధిస్తున్నానంటూ నా భార్య కోర్టులో కేసు వేసింది. దీంతో 2010లో విడాకులు మంజూరయ్యాయి. నా బాధంతా నా భార్య కోసం కాదు. నా కూతురు కోసం. నిషాను చూసి నాలుగేళ్లవుతోంది. కనీసం కోర్టుకు వచ్చిన సమయంలోనైనా కూతురిని చూసుకునే భాగ్యం కూడా కలగడం లేదు.
     - రవి, ఒంగోలు
     
     బాధితుల పక్షాన పోరాడేందుకే..


     నేను బెంగళూరులో స్టాక్ ఎక్స్ఛేంజ్ వ్యాపారిని. 1986లో వివాహం జరిగింది. (ఈయన భార్య ప్రస్తుతం ప్రముఖ భారతీయ క్రికెటర్ భార్య). 13 ఏళ్ల తర్వాత వరకట్నం కోసం వేధిస్తున్నానని, కుటుంబాన్ని సరిగా పట్టించుకోవడం లేదంటూ విడాకుల కోసం నా సతీమణి బెంగళూరు కోర్టులో కేసు వేసింది. మాకు అప్పటికే ఓ కూతురు ఉంది. 1999లో కోర్టు విడాకులు మంజూరు చేసింది. కూతురంటే నాకు ప్రాణం. భార్య విడాకులు తీసుకోవడంతో కూతురు కూడా దూరమైంది. పిల్లలు దూరమైతే తండ్రులు పడే బాధను మాటల్లో చెప్పలేం. ఇలాంటి సమస్య మరొకరికి రావద్దనే భావిస్తున్నా. ఇలాంటి బాధితుల తరఫున పోరాడేందుకు 2008లో చిల్డ్రన్స్ రైట్స్ ఇనిషియేట్ ఫర్ షేర్డ్ పేరెంట్స్ (క్రిస్ప్) అనే సంస్థను స్థాపించాను. విడాకులు తీసుకున్న కుటుంబాలు వారి పిల్లలకు తండ్రి పెంపకమూ అవసరం అనే విషయాన్ని సమాజానికి చాటి చెప్పడమే ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం.    
    - కుమార్ వీ జాగిర్దార్, క్రిస్ప్ సంస్థ వ్యవస్థాపకులు
     
     నేడు తండ్రుల దినోత్సవం

    నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లోని జవహర్ బాలభవన్‌లో ఆదివారం మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సీఆర్‌ఐఎస్‌పీ ఆధ్వర్యంలో జాతీయ తండ్రుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు జడ్జీలు జస్టిస్ రామలింగేశ్వర్‌రావు, జస్టిస్ డి.శేషాద్రి నాయుడులు ముఖ్యఅతిథులుగా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు, రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement