
సాక్షి,హన్మకొండ :ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాల్లో పూర్తి వివరాలు రిటర్నింగ్ అధికారికి తెలియజేయాల్సి ఉంటుంది. ప్రతిపాదకులు, అఫిడవిట్ ఫొటోలు అందజేయాలి. ఫారాలు పూర్తిగా నింపాలి. ఇందులో ఏ మాత్రం తేడాలు ఉన్నా నామినేషన్ తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. అభ్యర్థులు తమ నామినేషన్లలో అందజేయాల్సిన వివరాలు ఏంటో ఓసారి పరిశీలిద్దాం.
- నామినేషన్ వేసేందుకు 2బీ ఫారం ఉచితంగా రిటర్నింగ్ అధికారుల వద్ద లభిస్తుంది.
- ఒక అభ్యర్థి గరిష్టంగా నాలుగు పత్రాల నామినేషన్లు వేయొచ్చు.
- నామినేషన్ కోసం రెండు స్టాంప్ సైజ్ ఫొటోలు అవసరం. వాటిలో ఒకటి నామినేషన్ పత్రంపై, మరొకటి ఫారం 26పై (అఫిడవిట్) అతికించాల్సి ఉంటుంది.
- పోటీచేసే జనరల్ అభ్యర్థులు 10 వేల రూపాయల డిపాజిట్, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఐదు వేలు జమచేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు తప్పనిసరిగా కుల ధృవీకరణ పత్రం జతచేయాలి.
- గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ (రాష్ట్రీయ) పార్టీల నుంచి పోటీచేసే అభ్యర్థులకు తమ నామినేషన్‌లో అదే నియోజకవర్గానికి చెందిన ఒక ఓటరు ప్రతిపాదించాల్సి ఉంటుంది. ఆ వివరాలు ఫారం 2బీలో పార్ట్–1లో అడుగుతారు.
- పోటీ చేయడానికి నామినేషన్ వేసే ఇతర అభ్యర్థులు ..అంటే రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్లకు అదే నియోజకవర్గంలోని 10 మంది ఓటర్లు, ఫారం 2బీలోని పార్ట్–2లో ప్రతిపాదించాల్సి ఉంటుంది.
- గుర్తింపు పొందని పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు తమ నామినేషన్ పత్రంలో ఫారం 2బీ లోని పార్ట్–3లోని కాలం–సీ లో ఎన్నికల సంఘం సూచించిన వాటిలో మూడు గుర్తులను ప్రాధాన్యతా క్రమంలో తెలపాల్సి ఉంటుంది.
- అభ్యర్థి ఆ నియోజక వర్గం స్థానికుడు కానట్లైతే అతడు ఓటరుగా ఉన్న నియోజక వర్గం నుంచి ఈఆర్‌ఓ ధృవీకరణ చేయించిన పత్రం నామినేషన్‌తో జతచేయాల్సి ఉంటుంది.
- అభ్యర్థి ప్రతిపాదకులు నిరక్షరాస్యులు అయితే రిటర్నింగ్ అధికారి ముందు వేలిముద్ర వేయాల్సి ఉంటుంది.
- పోటీచేసే అభ్యర్థి తన ఎన్నికల ఖర్చుల లెక్కలకు సంబంధించి నామినేషన్ వేయడానికి 48గంటలముందు తన పేరుతో కొత్తగా బ్యాంక్ ఖాతా ప్రత్యేకంగా ప్రారంభించి అందజేయాల్సి ఉంటుంది. గతంలో తెరిచిన ఖాతాలు అందజేయడానికి వీలులేదు.
- నామినేషన్ పత్రంలోని ప్రతికాలం తప్పనిసరిగా పూర్తిచేయాలి. ఒకవేళ వదిలేస్తే అక్కడ..లేదు... వర్తించదు అని తప్పనిసరిగా రాయాలి. ఏ ఒక్క కాలం కూడా ఖాళీగా వదలకూడదు. (–)లతో కాలం నింపవద్దు
- గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు, రిజిస్టర్డ్, గుర్తింపు పొందని పార్టీలు ఫారం–ఏ, ఫారం బీ ఇంకు సైన్ చేయబడిన ప్రతిని నామినేషన్ల చివరి రోజు డిసెంబర్ 19వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలలోపు రిటర్నింగ్ అధికారికి అందజేయాల్సి ఉంటుంది.
- భారత ఎన్నికల సంఘం నిర్ధేశించిన ఫారం–26 నోటరైజ్డ్ అఫిడవిట్‌లో అన్ని కాలమ్స్ నింపాలి.
- అభ్యర్థి తన నామినేషన్ పత్రంలో తనపైగల క్రిమినల్ కేసుల వివరాలు పార్ట్–3ఏ లో తప్పనిసరిగా వివరించాల్సి ఉంటుంది.
- కరంటు బిల్లు, ఇంటిపన్ను, నీటిపన్ను , ప్రభుత్వ క్వార్టర్స్‌లో ఉన్నట్లైతే గత 10 సంవత్సరాలుగా బకాయిలు లేనట్లు ధృవీకరణ పత్రాలు అందజేయాల్సి ఉంటుంది.
- నామినేషన్ వేసే ముందు భారత ఎన్నికల సంఘం నిర్ధేశించిన ప్రతిజ్ఞ/శపథం/ తెలుగు లేదా ఇంగ్లీష్‌లో చేయాల్సి ఉంటుంది. ఈ ప్రతిజ్ఞతను నచ్చిన దేవుని పేరుతోగానీ, మనస్సాక్షి ప్రకారం చేయొచ్చు.
- అభ్యర్థి తన యొక్క స్పెసిమెన్ సంతకం రిటర్నింగ్ అధికారికి అదజేయాల్సి ఉంటుంది.
- అభ్యర్థి తన పేరు బ్యాలెట్ పేపర్‌లో ఏవిధంగా ముద్రించాల్సి ఉంటుందో పేపర్ పైన రాసి ఇవ్వాలి.
రిటర్నింగ్ అధికారి నుంచి పొందాల్సినవి..
- చెల్లించిన డిపాజిట్ మొత్తానికి రసీదు.
- స్క్రూటినీకి హాజరయ్యేందుకు నోటీసు
- ఎన్నికల వ్యయం నమోదు రిజిస్టర్
- కరపత్రాలు, పోస్టర్లు, ప్లెక్సీలు, ఇతర ప్రచార సామగ్రి ముంద్రించేందుకు చట్టంలోని సెక్షన్ 127–ఏ కింద సూచనలు
- ప్రతిజ్ఞ/శపథం చేసినట్లు ధృవీకరణ పత్రం
- నామినేషన్ పత్రంలోని లోపాలు, ఇంకా జత చేయాల్సిన పత్రాల సూచిన(చెక్ మెమో)
Comments
Please login to add a commentAdd a comment