మరో ఉన్మాది | Man Brutally Murdered His Lover Warangal District | Sakshi
Sakshi News home page

మరో ఉన్మాది

Published Sat, Jan 11 2020 2:03 AM | Last Updated on Sat, Jan 11 2020 8:16 AM

Man Brutally Murdered His Lover Warangal District - Sakshi

సాక్షి, వరంగల్‌: తాను ప్రేమించిన యువతి మరొకరితో సన్నిహితంగా ఉంటోందన్న కోపంతో ఓ ఉన్మాది ఆ యువతి ప్రాణాలు తీశాడు. కత్తితో గొంతు కోసి పాశవికంగా చంపేశాడు. రక్తం మడుగులో కొట్టుకుంటున్నా కనికరించకుండా అక్కడి నుంచి చక్కగా ఇంటికి వెళ్లి స్నానం చేసి మరీ పోలీసులకు స్వయంగా లొంగిపోయాడు. ఈ దారుణమైన ఘటన వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలోని రాంనగర్‌ పరిధి క్రాంతినగర్‌లో శుక్రవారం సాయంత్రం జరిగింది. ఇరువురి మధ్య వాగ్వాదం పెద్దగా మారి ఆ యువతి హత్యకు దారి తీసిందని పోలీసులు చెబుతున్నారు.

యువతి హారతి

డిగ్రీలో క్లాస్‌మేట్స్‌.. 
హన్మకొండ లష్కర్‌ సింగారానికి చెందిన మునిగాల ప్రదీప్‌– రేణుక దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కూతురికి వివాహం కాగా, కుమారుడు ప్రణీత్‌ నాలుగేళ్ల కిందట రాంపూర్‌ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్న కూతురు హారతి (27). ఆమె తండ్రి ప్రదీప్‌.. స్టేషన్‌ఘన్‌పూర్‌లోని పాలిటెక్నిక్‌ కాలేజీలో అటెండర్‌గా కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్నాడు. హారతి డిగ్రీ పూర్తిచేసి స్థానికంగా ఓ కాలేజీలో ప్రస్తుతం ఎంబీఏ చదువుతోంది. హన్మకొండ హంటర్‌
రోడ్డులోని మాస్టర్‌జీ కాలేజీలో డిగ్రీ చదువుతుండగా.. కాజీపేట విష్ణుపురికి చెందిన ఎండీ షాహిద్‌ (28)తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ఎలక్ట్రానిక్స్‌ గ్రూప్‌లో డిగ్రీ పూర్తి చేశారు. కాలేజీ రోజుల్లోనే ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారినట్లు తెలుస్తోంది. షాహిద్‌ డిగ్రీ ఫెయిల్‌ కావడంతో కాజీపేటలో తన తండ్రి నిర్వహిస్తున్న మటన్‌షాపులోనే పనిచేస్తున్నాడు.

రోదిస్తున్న హారతి తల్లి , నిందితుడు షాహిద్‌ (ఫైల్‌)

అద్దె గదికి పిలిపించి..
రాంనగర్‌లో షాహిద్‌ గదిని అద్దెకు తీసుకున్నాడు. హారతి సోదరి నివాసముంటున్న ఇంటి సమీపంలోనే ఆరు నెలల కింద షాహిద్‌ ఓ గదిలో అద్దెకు దిగాడు. ఆ గదికి నెలలో రెండు, మూడు సార్లు మాత్రమే వచ్చి పోయేవాడని ఇరుగుపొరుగు వారు చెబుతున్నారు. అద్దె మాత్రం నెలనెలా చెల్లించేవాడు. ఈ గదికే శుక్రవారం మధ్యాహ్నం ఫోన్‌ చేసి హారతిని పిలిపించాడు. ఆ తర్వాత ఇరువురి మధ్య గొడవ చోటు చేసుకున్నట్లు సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తే తెలుస్తోంది. ముందుగానే షాహిద్‌ దగ్గర మటన్‌ కత్తి ఉండటంతో ప్లాన్‌ ప్రకారమే హత్య చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఆ కత్తితోనే హారతి గొంతు కోశాడు. ఆమె రక్తపు మడుగులో కొట్టుకుంటుండగానే గదికి తాళం వేసి బయటికి వెళ్లిపోయాడు. ఆ ఇంటికి రెండు గేట్లు ఉన్నాయి. ముందువైపు ఉన్న గేటులో నుంచి కాకుండా హత్య చేశాక పక్క ఉన్న మరో గేటులో నుంచి నిందితుడు వెళ్లిపోయాడు. 

సెంట్రల్‌ జైలుకు.. ఆపై సుబేదారి పీఎస్‌కు 
హారతిని హత్య చేసిన షాహిద్‌.. చక్కగా విష్ణుపురిలోని తన ఇంటికి వెళ్లి స్నానం చేసి.. వేరే దుస్తులు మార్చుకున్నాడు. అనంతరం ఆటోలో వరంగల్‌లోని సెంట్రల్‌ జైలుకు వెళ్లాడు. అక్కడి సిబ్బందిని కలసి హత్య చేసినట్లు చెప్పగా.. తాము అదుపులోకి తీసుకోబోమని.. సుబేదారి పోలీసుల వద్దకు వెళ్లాలని సూచించినట్లు తెలిసింది. దీంతో మళ్లీ వేరే ఆటోలో సుబేదారి పోలీసుస్టేషన్‌కు వచ్చి పోలీసులకు లొంగిపోయాడు. తాను హత్య చేసిన విషయాన్ని చెప్పడంతో పాటు కత్తి, గది తాళాలు అప్పగించాడు. దీంతో పోలీసులు షాహిద్‌ను తీసుకుని హత్య జరిగిన గది వద్దకు వెళ్లారు. గది తాళం తీసి చూసే సరికి రక్తపు మడుగులో హారతి శవంగా పడిఉంది. కాగా, హారతి హత్యకు గురైనట్లు తెలుసుకున్న కుటుంబసభ్యులు ఘటనాస్థలికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఎవరి నుంచో ఫోన్‌ రాగానే ‘బయటకు వెళ్లొస్తాను’అని చెప్పి వెళ్లిన తమ కుమార్తె శవంగా మారడంతో తల్లి రోదనలు స్థానికులను కంటతడి పెట్టించింది. హారతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. 

సంక్రాంతి తర్వాత యువతి పెళ్లి.. 
హత్యకు గురైన హారతికి సంక్రాంతి పండుగ తర్వాత వివాహం జరగాల్సి ఉంది. వరంగల్‌కే చెందిన ఓ యువకుడితో ఆమె పెళ్లి నిశ్చయమైంది. ఇంతలోనే హత్యకు గురి కావడంతో రెండు కుటుంబాలు విషాదంలో మునిగాయి. కాగా, వేరే యువకుడితో సన్నిహితంగా ఉండటం.. వేరే యువకుడితో పెళ్లి నిశ్చయం కావడంతో కోపాన్ని పెంచుకున్న షాహిద్‌.. తాను ప్రేమించిన యువతి తనకు దక్కకుండా పోతుందన్న కోపంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు నిందితుడు చెబుతున్నాడు. 

ఆ ఇల్లు ఏఆర్‌ ఎస్సైది.. 
ఇళ్లు అద్దెకు ఇచ్చే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు ఎంతగా చెప్పినా వినిపించుకోవట్లేదని ఈ ఘటనతో మరోసారి అర్థమవుతోంది. నిందితుడు షాహిద్‌ అద్దెకు తీసుకున్న ఇళ్లు పోలీసు కమిషనరేట్‌లో పనిచేసే నర్సింగరావుది. ప్రస్తుతం ఆయన శిక్షణలో ఉన్నారు. షాహిద్‌ అద్దెకు తీసుకున్న గదిలో ఒక ఫ్యాన్, ఒక టీపాయ్, ఒక దుప్పటి మాత్రమే ఉన్నాయి. 6 నెలలుగా కిరాయికి ఉంటూ.. నెలలో ఒకట్రెండు సార్లు వచ్చి పోతున్నా ఎన్నడూ అతడిని ప్రశ్నించిన సందర్భాలు లేనట్లు తెలిసింది. కాగా, తాను ప్రేమించిన హారతి ఇటీవల మరో యువకుడితో సన్నిహితంగా ఉండటం వల్లే తాను హత్య చేసినట్లు నిందితుడు పోలీసులకు చెప్పినట్లు సమాచారం.  

ఘటనా స్థలాన్ని పరిశీలించి మంత్రి ఎర్రబెల్లి 
యువతి హత్య జరిగిన విషయం తెలియగానే మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, చీఫ్‌ వినయ్‌భాస్కర్‌ ఘటనా స్థలాన్ని సందర్శించారు. హత్యకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడంతో పాటు యువతి కుటుంబసభ్యులను ఓదార్చారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ వి.రవీందర్‌ కూడా ఘటనాస్థలికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement