ప్రతాప్ సురేష్ మృతదేహం
హన్మకొండ చౌరస్తా : ‘మా అన్న కొడుకు పుట్టిన రోజు మీరంతా తప్పకుండా రావాలి రా..’ అన్న స్నేహితుడి ఆహ్వానంతో వచ్చిన ఐదుగురు మిత్రుల్లో ఒకరు విగతజీవిగా మారాడు. అప్పటి వరకు పుట్టిన రోజు వేడుకలో పాల్గొన్న వారంతా.. వేడుక అనంతరం మందు పార్టీలో మునిగిపోయారు. పుల్లుగా తాగిన స్నేహితుల్లో ఇద్దరి మధ్య రాజుకున్న చిన్న గొడవ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి క్షణికావేశానికి తోటి స్నేహితుడి నిండు ప్రాణం తీసింది. ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీతో సందడిగా ఉన్న హన్మకొండ బస్టాండ్ ప్రాంతంలో అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో జరిగిన హత్యోదంతం కలకలం సృష్టించింది.
హన్మకొండ ఏసీపీ రాజేంద్రప్రసాద్ కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని ప్రతాప్‌నగర్‌కు చెందిన శ్రీపతి అభిలాష్ అన్న కొడుకు మొదటి పుట్టిన రోజు వేడుకలను శనివారం సాయంత్రం హన్మకొండలో నిర్వహించారు. పుట్టిన రోజు ఫంక్షన్‌కు ఒకే ఊరికి చెందిన తన స్నేహితులైన ప్రతాప్ సురేష్(30), మోతె స్వామి అలియాస్ శ్యాం, కిరణ్, హరీష్‌లను ఆహ్వానించారు.
వారంతా హన్మకొండకు చేరుకుని వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం రాత్రి 8.45గంటల సమయంలో నక్కలగుట్టలోని హోటల్ ల్యాండ్‌మార్క్ లో మద్యం తాగేందుకు వెళ్లారు. అక్కడ బాగా మద్యం తాగారు. కాగా ప్రతాప్ సురేష్ , మోతె స్వామి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో సురేష్ పై స్వామి చేయి చేసుకున్నాడు. అక్కడ గొడవు ముదురుతున్న సమయంలో బార్‌లో నుంచి సెల్లార్ కు చేరుకున్నారు.
అక్కడ మరోసారి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అయితే అక్కడే ఉన్న సెక్యూరిటీ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించడంతో ఇంటికి వెళ్లేందుకు సురేష్‌ను వదిలేసి మిగిలిన నలుగురు హన్మకొండ బస్టాండ్ కు చేరుకున్నారు. మనస్థాపం చెందిన ప్రతాప్‌సురేష్ హన్మకొండలోనే ఉంటున్న తన పెద్దమ్మ కొడుకు మేకల సతీష్‌కు ఫోన్ చేసి తనను శ్యామ్ కొట్టాడని నువ్వు త్వరగా రావాలని మాట్లాడాడు.
దీంతో సతీష్ బస్టాండ్‌కు చేరుకున్నాడు. అప్పటికే ఊరెళ్లడానికి బస్సు ఎక్కేందుకు వెళ్తున్న స్వామిని సురేష్ రెచ్చగొట్టాడు. స్వామి కోపోద్రిక్తుడై సురేష్ ఛాతి పై బలంగా గుద్దగా కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న హన్మకొండ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్నిపోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
మృతుడు సురేష్ కారు డ్రైవర్‌గా పనిచేస్తుండగా నిందితుడు మోతె స్వామి సెంట్రింగ్ పనిచేస్తున్నారు. కాగా నిందితుడు స్వామి , అతడి స్నేహితులు పరారీలో ఉన్నట్లుగా పోలీసులు తెలపారు. కాగా తెల్లవారుజామునే నిందితుడు స్వామితో పాటు స్నేహితులను అదుపులోకి తీసుకుని హత్యకు ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ చేపడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment