హత్యకు గురైనరాజనర్సు మృతదేహం, రోదిస్తున్న కుటుంబ సభ్యులు, బంధువులు.. (ఇన్‌సెట్) రాజనర్సు (ఫైల్)
కమలాపూర్(హుజూరాబాద్): గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ దుస్తులు విక్రయించి జీవించే చిరు వ్యాపారిని అత్యంత దారుణంగా హత్య చేసి చెరువు తూముపై పడేసిన సంఘటన వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్‌లో జరిగింది. మండల వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ హత్యా ఘటన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కమలాపూర్‌కు చెందిన బైరి రాజనర్సు (53) గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి దస్తులు విక్రయిస్తుండగా, ఆయన భార్య చంద్రకళ బీడీలు చుడుతూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు రాజేష్, దినేష్ ఉన్నారు. మంగళవారం మధ్యాహ్నం సమయంలో రాజనర్సు వరంగల్‌కు వెళ్లి తన వ్యాపారానికి అవసరమైన దుస్తులు కొనుగోలు చేసుకుని సాయంత్రం ఇంటికి వచ్చాడు.
తాను కొనుగోలు చేసుకొచ్చిన దుస్తులు ఇంట్లో పెట్టి బయటకు వెళ్తానని చెప్పిన రాజనర్సు ఎంతకు ఇంటికి రాకపోవడంతో రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులు అతడికి ఫోన్ చేయగా తాను వస్తానని చెప్పి ఫోన్ కట్ చేసి ఆ తర్వాత నుంచి రాజనర్సు ఎంతకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. బుధవారం ఉదయం కమలాపూర్ పెద్ద చెరువు కట్టపై ఒకరు హత్య చేయబడ్డారన్న సమాచారంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూసే సరికి రాజనర్సు శవమై కనిపించాడు. ఘటన స్థలంలో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.
అత్యంత కిరాతకంగా..
గుర్తు తెలియని దుండగులు రాజనర్సును అత్యంత కిరాతకంగా హత్య చేశారు. హత్యకు పాల్పడిన దుండగులు రాజనర్సు తల నుదుటి భాగంపై గుర్తు తెలియని వస్తువుతో బలంగా కొట్టారు. దీంతో అతడి తల పగిలి తీవ్ర రక్తస్రావమైంది. ఆ తర్వాత అతడిని కట్టపై నుంచి ఈడ్చుకెళ్లి పెద్ద తూముపై నుంచి చెరువు లోపలి వైపు పడేయగా తూము లోపలి గచ్చుపై మెట్ల పక్కన పడి రాజనర్సు మృతి చెంది ఉన్నాడు. కాగా రాజనర్సు రాత్రి సమయంలో చెరువు పెద్ద తూము వద్దకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చి ందని, అతడిని ఇంత కిరాతకంగా హత్య చేయాల్సిన అవసరం ఎవరికుందంటూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
రంగంలోకి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ..
చెరువు కట్టపై రాజనర్సు హత్యకు గురయ్యాడన్న సమాచారం అందుకున్న కాజీపేట ఏసీపీ నర్సింగ్‌రావు, స్థానిక ఇన్‌స్పెక్టర్ బాలాజీ వరప్రసాద్, ఎస్సై సూర్యప్రకాష్ సిబ్బందితో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. అనంతరం క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలను రప్పించి తనిఖీలు చేపట్టారు. రాజనర్సు భార్య చంద్రకళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment