సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో కార్మికుల వేతనాల చెల్లింపుల్లో మరోసారి తీవ్ర జాప్యం జరగడం కలకలం సృష్టిస్తోంది. చేతిలో డబ్బులు లేక, ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఆర్టీసీ.. సిబ్బందికి వేతనాలివ్వడం కష్టంగా మారింది. కొంతకాలంగా నాలుగైదు రోజులు ఆలస్యంగా కార్మికులకు వేతనాలు చెల్లిస్తోంది. ఈ నెల ఒకటో తేదీన వేతనాలు అందాల్సి ఉన్నా.. గురువారం రాత్రి వరకు కూడా అందకపోవడంతో కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో గుర్తింపు కార్మిక సంఘాలైన తెలంగాణ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయిస్ యూనియన్, తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్లు శుక్రవారం ధర్నాలకు పిలుపునిచ్చాయి. అన్ని బస్ డిపోలు, బస్ భవన్ ఎదుట భోజన విరామ సమయంలో ధర్నా నిర్వహించాలని ఆయా సంఘాల నేతలు అశ్వత్థామరెడ్డి, ధామస్‌రెడ్డి, రాజిరెడ్డి, బాబు, హనుమంతు, సుధాకర్ ప్రకటించారు. శుక్రవారం సాయంత్రంలోగా వేతనాలు అందకుంటే శనివారం నుంచి బస్సులు తిప్పేది లేదని హెచ్చరించారు.
కార్మికుల వేతనాలు తక్షణమే చెల్లించాలని యాజమాన్యాన్ని నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకుడు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. బస్సుల నిర్వహణ, ఇతర ఖర్చులకు సరిపడా ఆదాయం లేకపోవడంతో కార్మికుల భవిష్యనిధి నుంచి దాదాపు రూ.500 కోట్లు, పరపతి సహకార సంఘం నుంచి రూ.250 కోట్లు, పదవీ విరమణ బెనిఫిట్, కార్మికులు మృతి చెందితే సాయం ఇచ్చే నిధి నుంచి కూడా ఆర్టీసీ సొంతానికి డబ్బులు వాడుకుంది. వీటిని చెల్లించాలని కార్మిక సంఘాలు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందకపోవడంతో యాజమాన్యం చేతులెత్తేసింది. గత పీఆర్సీ బకాయిలు ఇప్పటికీ పూర్తిగా చెల్లించకపోవడంతో ఆగ్రహంగా ఉన్న కార్మికులు.. తాజాగా వేతనాల చెల్లింపుల్లో ఇబ్బందులు తలెత్తడంతో మరింత మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా ఆర్టీసీలో కొత్త బస్సుల కొనుగోలు కోసం రూ.35 కోట్లు విడుదల చేస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆర్టీసీ కార్మికులకు అందని వేతనాలు
Published Fri, May 4 2018 2:10 AM | Last Updated on Fri, May 4 2018 2:10 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment