- కంచె ఐలయ్య
బషీర్‌బాగ్: తెలంగాణ వచ్చేందుకు ఎన్ని రకాల పోరాటాలు చేశారో ఇప్పుడు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుంటే అన్ని పోరాటాలు చేయాలని ప్రముఖ సామాజికవేత్త, ప్రొఫెసర్ కంచె ఐలయ్య పేర్కొన్నారు. అభివృద్ధి అంటే బోనాలు చేయడం కాదని పరోక్షంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించారు. ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బహుజన యునెటైడ్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ర్ట మొదటి మహాసభ నిర్వహించారు.
ముఖ్య వక్తగా హాజరైన ఐలయ్య మాట్లాడుతూ.. శిశువు తల్లి కడుపులో పడ్డ నాటి నుంచి ఆ బిడ్డ పెరుగుదల, తల్లి ఆరోగ్య విషయం ప్రభుత్వాలే చూడాలన్నారు. ఏటా సబ్‌ప్లాన్ నిధులు ఎస్సీలకు 6 కోట్లు, ఎస్టీలకు 10 కోట్లు ఖర్చు చేయాలని, వాటిని ప్రతి గర్భిణిపై కొంత ఖర్చు పెడితే దళితుల్లో శిశు మరణాలు తగ్గే అవకాశం ఉంటుందన్నారు.
ప్రతి నెలా రూ.3 వేలు వారికి అందేలా చూడాలని ఆంధ్ర,తెలంగాణ ప్రభుత్వాలను కోరారు. సంచార జాతులు స్థిరంగా ఉండేందుకు స్థలం కేటాయించాలని, దళితులకు మూడెకరాల భూమి, రెండు గదులతో ఇల్లు తెలంగాణ ప్రభుత్వం రెండు నెలల్లో ఇవ్వకుంటే స్త్రీలు చీపురు కట్టలు, చెప్పులతో టీఆర్‌ఎస్ భవన్‌కు ర్యాలీ తీయాలని ఆయన పిలుపునిచ్చారు.
రాష్ట్ర దళిత సేన అధ్యక్షుడు జె.బి.రాజు మాట్లాడుతూ.. తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించే జీవో చేయాలని డిమాండ్ చేశారు. ఉత్తర తెలంగాణ ఏజెన్సీలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు భూ పట్టాలు ఇవ్వాలన్నారు. ఇస్లావత్ నామా నాయక్ అధ్యక్షతన జరిగిన సభలో గొల్లపల్లి దయానంద్, దళిత నాయకులు ఏవీ పటేల్, బహుజన యునెటైడ్ ఫ్రంట్ ఉపాధ్యక్షురాలు స్వర్ణగౌడ్, జిల్లాల నుంచి వచ్చిన మహిళలు పాల్గొన్నారు.