రోడ్డు మీదున్న షాపులకు నోటీసులు
►31లోపు తరలించాలని హుకుం
సాక్షి, మెదక్: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జాతీయ, రాష్ట్రీయ రహదారుల సమీపంలో ఉన్న వైన్‌షాపులను మరో చోటికి తరలించాలంటూ ఎక్సైజ్ అధికారులు షాపు యజమానులకు నోటీసులు పంపారు. రోడ్డు సమీపంలో ఉన్న వైన్‌షాపుల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయంటూ దాఖలైన పిటిషన్‌పై కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు నోటీసులు అందజేశారు. జిల్లాలో మొత్తం 37 వైన్ షాపులు ఉండగా అందులో 31 షాపులకు నోటీసులు అందడం గమనార్హం.
జాతీయ, రాష్ట్రీయ రోడ్డుకు 500 మీటర్లలోపు ఉన్న వైన్ షాపులను 31 మార్చిలోగా తొలగించి ఏప్రిల్ 1 నుంచి కొత్త షాపుల్లోకి మార్చాలని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈలోగా కొత్త షాపులను ఎంపిక చేసుకోకపోతే ఏప్రిల్ 1 నుంచి షాపులను నిర్వహించడానికి ఇష్టపడనట్లుగా భావిస్తామని తెలియజేశారు. దీంతో వైన్ షాపు యజమానులంతా కొత్త షాపుల వేటలో పడినట్లు తెలుస్తోంది.