15 రోజుల్లోగా ఎత్తేయండి!
జాతీయ, రాష్ట్ర రహదారులపై ఉన్న బార్లు, వైన్‌షాపులకు ఎక్సైజ్ శాఖ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జాతీయ, రాష్ట్ర రహదారులకు వంద మీటర్ల లోపు నెలకొల్పిన మద్యం విక్రయ కేంద్రాలను తొలగించే దిశగా ఎక్సైజ్ శాఖ అడుగులు వేస్తోంది. రహదారి భద్రతపై ఏర్పాటైన సుప్రీంకోర్టు కమిటీ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా జాతీయ, రాష్ట్ర హైవేలపై ఏర్పాటు చేసిన బార్లతో పాటు మద్యం దుకాణాలను 15 రోజుల్లోగా తొలగించి, అదే ప్రాంతంలో హైవేలకు 100 మీటర్ల దూరంలో ఏర్పాటు చేయాలని నోటీసులు జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వైన్‌షాపులు, బార్లతో పాటు అన్ని జిల్లాల్లో ఈ మేరకు ఎక్సైజ్ సూపరింటెండెంట్‌లు తాఖీదులు పంపించారు. దీంతో గత అక్టోబర్‌లోనే కొత్త లెసైన్సులు తీసుకొని మద్యం దుకాణాలు ఏర్పాటు చేసిన వారితో పాటు గత కొన్నేళ్లుగా రహదారులకు ఇరువైపులా బార్లు ఏర్పాటు చేసిన వారు కూడా ఎక్సైజ్ నోటీసులతో ఆందోళన చెందుతున్నారు.
సుప్రీం కోర్టు కమిటీ ఆదేశాలు
జాతీయ, రాష్ట్ర రహదారులకు వంద మీటర్ల లోపు మత్తు పానీయాల విక్రయాలు జరపకూడదని జస్టిస్ కె.ఎస్. రాధాకృష్ణన్ చైర్మన్‌గా రోడ్‌సేఫ్టీపై ఏర్పాటైన సుప్రీంకోర్టు కమిటీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. నూతన ఎక్సైజ్ పాలసీతో సంబంధం లేకుండా వెంటనే హైవేలలో మద్యం విక్రయాలపై నిషేధం విధించాలని, ఇప్పటికే ఏర్పాటైన దుకాణాలను తొలగించాలని ఆదేశించింది. ఈ మేరకు గత నెలలో ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలిస్తూ, తీసుకున్న చర్యలపై ఈ నెల 30వ తేదీలోగా పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.
రహదారుల నిబంధనకు పక్క‘దారి’
జాతీయ, రాష్ట్ర రహదారులకు వంద మీటర్ల లోపు మద్యం అమ్మకాలు ఉండకూడదనే నిబంధన ఎక్సైజ్ పాలసీలో ఉంది. అయితే ఆయా రహదారులు గ్రామాలు, పట్టణాల మధ్య నుంచి వెళుతున్నప్పుడు మాత్రం అనుమతి ఇవ్వవచ్చనే ‘అనుకూలమైన’ సవరణ చేర్చుకున్న ఎక్సైజ్ శాఖ తదనుగుణంగా అనుమతులు ఇస్తూ వస్తోంది. పనిలో పనిగా ఊళ్లతో సంబంధం లేకుండా జాతీయ రహదారులపై బార్లు, మద్యం దుకాణాలు ఏర్పాటయ్యాయి.
జూలైలో లేఖ రాసినా... సెప్టెంబర్‌లో కొత్త అనుమతులు
హైవేలకు 100 మీటర్లలోపు మద్యం అమ్మకాలను నిషేధించి, దుకాణాలను తొలగించాలని జస్టిస్ కేఎస్ రాధాకష్ణన్ చైర్మన్‌గా ఏర్పాటైన సుప్రీంకోర్టు కమిటీ సూచనలను ఆ కమిటీ కార్యదర్శి ఎస్.డి. బంగా గత జూలై 8న ట్రాన్స్‌పోర్టు జాయింట్ కమిషనర్‌కు లేఖ ద్వారా తెలిపారు. రాష్ట్రంలో 2,495.63 కిలోమీటర్ల మేర 13 జాతీయ రహదారులు ఉండగా, పది జిల్లాల్లో 2,023 కి. మీ. మేర 17 రాష్ట్ర రహదారులు ఉన్నాయి.
రాష్ట్రంలోని 2,216 మద్యం దుకాణాలకు గాను 500కు పైగా హైవేలపైనే ఉన్నాయి. బార్లు గత కొన్నేళ్లుగా రహదారులపైనే కొనసాగుతున్నాయి. కొత్త ఎక్సైజ్ పాలసీ కోసం వేచి చూడకుండా తక్షణమే హైవేలలో ఆల్కహాల్ విక్రయాలను రద్దు చేసి, సెప్టెంబర్ 30లోగా నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు కమిటీ జూలైలో సర్కార్‌కు రాసిన లేఖలో ఆదేశించింది. అయితే సెప్టెంబర్ 30 నాటికి సుప్రీంకోర్టు కమిటీకి నివేదిక ఇవ్వకుండా, ఆ తేదీ నాటికి రాష్ట్రంలో 2015-17 సంవత్సరాల కోసం (రెండేళ్లు) కొత్తగా మద్యం దుకాణాలకు అనుమతిచ్చారు. దీంతో అక్టోబర్ 1 నుంచి నూతన ఎక్సైజ్ పాలసీ ద్వారా వందలాది మద్యం దుకాణాలు హైవేలపై ఏర్పాటయ్యాయి. ఈ నేపథ్యంలో రహదారులపై ఆల్కహాల్ విక్రయాల నిషేధానికి తీసుకున్న చర్యలపై ఈ నెల 30లోగా నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు కమిటీ కోరింది.
గ్రేటర్ వ్యాపారుల ఆందోళన
సుప్రీంకోర్టు నిబంధనల నేపథ్యంలో హైవేలపై ఉన్న మద్యం విక్రయ కేంద్రాలను 100 మీటర్ల దూరానికి తరలించాలన్న ఆదేశాల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వ్యాపారులు కొంత ఆందోళనకు గురయ్యారు. ఏడాదికి రూ. కోటీ ఎనిమిది లక్షలు లెసైన్సు ఫీజుగా చెల్లిస్తూ లక్షలాది రూపాయల అడ్వాన్సులు, అద్దెలు చెల్లించే వీరు ప్రత్యామ్నాయ కోసం కొత్త దారులు వెతుక్కుంటున్నారు.