సాక్షి, హైదరాబాద్ : పాలక టీఆర్‌ఎస్, మహాకూటమి, బీజేపీ, బీఎల్‌ఎఫ్‌లు అత్యంత ప్రతిష్టాత్మకంగా బరిలో దిగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోరుకు తెరలేచింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ సోమవారం ఉదయం విడుదలైంది. ఆయా జిల్లా కేంద్రాల్లో ఎక్కడికక్కడ నోటిఫికేషన్ గెజిట్‌ను అధికారులు జారీ చేశారు. ఇక నేటి నుంచి ఈనెల 19 వరకు ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు.
నామినేషన్ల దాఖలుకు ఈనెల 19 చివరి తేదీ కాగా, మరుసటి రోజు నవంబర్ 20న నామినేషన్ల పరిశీలన, 22 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. డిసెంబర్ 7న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 11న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఇక టీఆర్‌ఎస్ ఇప్పటికే 100కుపైగా స్ధానాల్లో అభ్యర్ధులను ప్రకటించి బీఫారాలు అందచేయగా, వారంతా నామినేషన్లకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
మరోవైపు మహాకూటమి చర్చలు నేడో, రేపో కొలిక్కిరానుండటంతో ఆశావహులు ఉత్కంఠతో జాబితా కోసం వేచిచూస్తుండగా, బీజేపీ, బీఎల్‌ఎఫ్ అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేసేందుకు సంసిద్ధమవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment