సాక్షి, హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రేపో మాపో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే అందుకు సంబంధించిన రిజర్వేషన్ల ఖరారుపై కసరత్తులు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో ఉన్న 128 మున్సిపాలిటీలలో 121 మున్సిపాలిటీలతో పాటు 10 మున్సిపల్ కార్పొరేషన్లు అయిన కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, బోడుప్పల్, ఫీర్జాదిగూడ, బడంగ్‌పేట, నిజాంపేట, బండ్లగూడ, జవహర్‌నగర్, మీర్‌పేటలో ఎన్నికలు నిర్వహించనున్నారు. సాంకేతిక కారణాల దృష్యా, గడువు తీరక మరికొన్ని మున్సిపాలిటీల్లో తర్వాత జరగనున్నాయి.
అచ్చంపేట, జడ్చర్ల, నకిరేకల్, సిద్దిపేట, పాల్వంచ, మందమర్రి, మణుగూరు వంటి ఏజెన్సీ ప్రాంతాలు ఈ కేటగిరిలో ఉన్నాయి. కాగా, రిజర్వేషన్ల అంశం ఓ కొలిక్కి వచ్చిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది. మున్సిపాలిటీలో ఉన్న జనాభా ప్రకారం ఒక పోలింగ్ కేంద్రానికి 800 ఓటర్లను కేటాయించే అవకాశం ఉంది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ ముందు లేదా తర్వాత అన్ని రాజకీయ పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి అభిప్రాయాన్ని తీసుకోనుంది. ఈ సందర్భంగా ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశాన్ని నిర్వహించనుంది.
Comments
Please login to add a commentAdd a comment