అంగన్‌వాడీ కేంద్రంలో భోజనం చేస్తున్న చిన్నారులు
ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తోంది. సర్కారు స్కూళ్లలో సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం పెడుతుంటే అంగన్‌వాడీల్లో దొడ్డు బియ్యంతో వండిపెడుతున్నారు. దీంతో తినేందుకు బాలింతలు, గర్భిణులు, చిన్నారులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. కొంతమందైతే కేంద్రాలకు రావడమే మానేశారు.
సాక్షి, వరంగల్ రూరల్: జిల్లాలోని పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 832 అంగన్‌వాడీ కేంద్రాలు, 76 మినీ అంగన్‌వాడీలు ఉన్నాయి. 155 అంగన్‌వాడీలు సొంత భవనాల్లో, 355 ప్రభుత్వ పాఠశాలలో, 398 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. 7 నెలల నుంచి మూడేళ్ల వయసు వారు 18,074, మూడు నుంచి ఆరు సంవత్సరాల వయస్సు వారు 12,140 మంది చిన్నారులు, గర్భిణులు, బాలింతలు 9,767 మంది ఉన్నారు.
కనిపించని గర్భిణులు
జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలలో దాదాపు గర్భిణులు, బాలింతలు కనిపించడంలేదు. రికార్డుల్లో పేర్లు ఉంటున్నాయి. వారి కుటుంబ సభ్యులు వచ్చి గుడ్లు, పాలు, భోజనం తీసుకువెళ్తున్నారు. ఈ దృశ్యం ఆత్మకూరు మండలం కామారంలోని అంగన్‌వాడీ కేంద్రంలో కనిపించింది.
పక్కదారి పడుతున్న రేషన్
ఆరోగ్యలక్ష్మి పథకం కింద మూడు నుంచి ఆరు సంవత్సరాల వయసు పిల్లలకు ఒక పూట భోజనం, ఉడికించిన గుడ్లు, కుర్‌కురేలు, గర్భిణులు, బాలింతలకు పోషక విలువలతో కూడిన ఒక పూట సంపూర్ణ భోజనం, 200 మిల్లీలీటర్ల పాలు, ఉడికించిన గుడ్లు ఇవ్వాలి. 7 నెలల నుంచి 3 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు నెలకు 2.5 కిలోల బాలామృతం, 16 గుడ్లు అందించాల్సి ఉంది. హాజరు పట్టికలో సంఖ్య చూపుతున్నా కేంద్రాలలో వారు కనిపించడం లేదు. హాజరుకాకపోయినా వచ్చినట్లు చూపిస్తున్నారు. దీంతో పౌష్టికాహారం పక్కదారి పడుతున్నట్లు తెలుస్తోంది.
ఆయాలే టీచర్లు..
అంగన్‌వాడీ కేంద్రాలలో ఆయాలే దిక్కవుతున్నారు. పౌష్టికహారం, ఆరోగ్య రక్షణ, అక్షరాలు నేర్పించేందుకు ప్రభుత్వం అంగన్‌వాడీ టీచర్లను నియమించింది. నిత్యం విధులకు హాజరుకావాల్సిన వారు సమయపాలన పాటించడంలేదు, చాలా మంది గైర్జాజరవుతున్నారు. టీచర్లు లేని చోట ఆయాలే అన్నీ చూసుకుంటున్నారు. పిల్లలకు అక్షర జ్ఞానం నేర్పేవారు కరువయ్యారు. చిన్నారులకు ఐదేళ్లు వచ్చినా పాటలు, అక్షరాలు ఏమీ రావడంలేదు. దీంతో పిల్లలను పంపడానికి వారి తల్లిదండ్రులు వెనుకడగు వేస్తున్నారు. దీంతో రోజురోజుకూ హాజరు శాతం తగ్గిపోతోంది.
చర్య తీసుకుంటాం
అంగన్‌వాడీ కేంద్రాల్లో సమయపాలన పాటించని వారిపై చర్యలు తీసుకుంటాం. టీచర్లు, ఆయాలు ఆలస్యంగా వస్తే గ్రామస్తులు సైతం ప్రశ్నించాలి. దొడ్డు బియ్యం ప్రభుత్వం నుంచే సరఫరా అవుతున్నాయి. వాటిని మార్చాలని సమావేశాల్లో చేస్పాం. ఆరోగ్యలక్ష్మి పథకం కింద మూడు నుంచి ఆరేళ్ల వయసు పిల్లలకు ఒక పూట భోజనం, ఉడికించిన గుడ్డు, కుర్‌కురే, గర్భిణులు, బాలింతలకు పోషక విలువలతో కూడిన ఒక పూట సంపూర్ణ భోజనం, 200 మిల్లీలీటర్ల పాలు అందిస్తున్నాం. – సబిత, జిల్లా సంక్షేమ అధికారి
Comments
Please login to add a commentAdd a comment