‘ఐసీడీఎస్’ కొత్త మెనూ
జోగిపేట:గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ‘ఇందిరమ్మ అమృత హస్తం’ పథకాన్ని సర్కార్ సమూలంగా మార్పులు చేసింది. పేరుతో పాటు మెనూ కూడా మార్చేసింది. ఒకపూట సంపూర్ణ భోజనం’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి జిల్లాలోని అన్ని ప్రాజెక్టుల పరిధిలోనూ అమలు చేయనుంది. మాతా, శిశు మరణాలు తగ్గించాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.
ఇప్పటి వరకు గర్భిణులు, బాలింతలకు నెలకు 18 ఉడికించిన కోడి గుడ్లు మాత్రమే అందించేవారు. ఇక నుంచి మారిన మెనూ ప్రకారం ప్రతి రోజు గుడ్లు, పాలు ఇవ్వనున్నారు. ప్రొటీన్లు, విటమిన్లతో కూడిన ఆహారాన్ని అందజేయనున్నారు. ఈ పథకం నిర్వాహణ బాధ్యతలు సైతం అంగన్‌వాడీలకే అప్పగించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 15వ తేదీ నుంచి ఒక పూట సంపూర్ణ భోజనం అనే కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
లబ్ధిపొందేవారు ఎవరంటే...
అమృతహస్తం పథకం స్థానంలో ఈనెల 15వ తేదీ నుంచి ‘ఒకపూట సంపూర్ణ భోజనం’ కార్యక్రమాన్ని అన్ని ప్రాజెక్టుల్లో ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా జిల్లాలో 3,009 మెయిన్, 375 మినీ అంగన్‌వాడీ కేంద్రాల్లోని 26,208 మంది గర్భిణులకు, 29,924 మంది బాలింతలకు, 1,02,304 మంది 3 ఏళ్ల నుంచి 6 ఏళ్ల లోపు ఉన్న పిల్లలు పౌష్టికాహారం అందించనున్నారు. అంతేకాకుండా 7 నెలల నుంచి మూడు సంవత్సరాల వయస్సు గల 1,20,892 మంది చిన్నారులకు నేరుగాఇంటికే ప్రతినెలా ఒక బాలామృతం ప్యాకెట్‌తో పాటు గుడ్డును పంపిణీ చేయనున్నారు. గర్భందాల్చినప్పటి నుంచి ప్రసవం అయిన తర్వాత ఆరు మాసాల వరకు కూడా మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు.
నిర్వాహణ బాధ్యత అంగన్‌వాడీలదే
ఒక్కపూట సంపూర్ణ భోజనం పథకం నిర్వాహణ బాధ్యతను అంగన్‌వాడీల కార్యకర్తలకే అప్పగించనున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న అమృతహస్తం పథకంలో సమైఖ్య సంఘాల సభ్యులు భోజనం వండి గర్భిణులు, బాలింతలకు అందజేస్తున్నారు. అయితే అంగన్‌వాడీ కార్యకర్తలు సమైఖ్య సంఘాల సభ్యుల మధ్య సమన్వయ లోపంతో ఈ పథకం అస్తవ్యస్థంగా మారిందనే ఆరోపణలున్నాయి.
దీంతో ఒక్కపూట సంపూర్ణ భోజనం పథకాన్ని అంగన్‌వాడీలకే అప్పగించాలని సర్కార్ నిర్ణయించింది. ఈ పథకం కోసం ఐసీడీఎస్ ద్వారా బియ్యం, పప్పు, కోడి గుడ్డు, నూనె, అందింస్తుండగా ..అంగన్‌వాడీ కార్యకర్తలు పాలు, కూరగాయలు, ఆకు కూరలు పెరుగు అందజేయాల్సి ఉంటుంది. అంగన్‌వాడీ కార్యకర్తల పేరిట జీరో అక్కౌంట్ తీస్తే, ప్రతినెల వారి ఖాతాల్లో ఖర్చు పెట్టిన సొమ్మును జమచేస్తారు.
కమిటీ సభ్యులు వీరే...
ఈ పథకం నిర్వాహణకుగాను ప్రభుత్వం ఓ కమిటీని కూడా వేయనుంది. కమిటీ చైర్మన్‌గా సర్పంచ్, లేదా వార్డు సభ్యుడు/కౌన్సిలర్ ఆశ కార్యకర్త, ఇద్దరు తల్లులు, సైన్స్ ఉపాధ్యాయుడు లేదా రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి, అంగన్‌వాడీ కార్యకర్త, ఇద్దరు గ్రామస్తులు సభ్యులుగా ఉంటారు.
త్వరలో మరిన్ని మార్పులు
‘ఒకపూట సంపూర్ణ భోజనం’ పేరును ప్రభుత్వం తాత్కాలికంగా నామకరణం చేసింది. త్వరలో అసలు పేరు ఖరారు చేయనుంది. కాగా అంగన్‌వాడీ వ్యవస్థలో వేళ్లూనుకున్న అవినీతి, అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోందని అధికారులు అంటున్నారు. లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న పప్పు, కోడిగుడ్లు, పక్కదారి పట్టకుండా నాణ్యమైన పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశంతో ఉన్న ప్రభుత్వం వాటిని పంపిణీ చేస్తున్న కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చే యాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
పథకం పేరు మార్పు: సీడీపీఓ ఎల్లయ్య
ప్రభుత్వం ఈనెల 15వ తేదీ నుంచి ఒక్క పూట సంపూర్ణ భోజనం పథకాన్ని నిర్వహిస్తుంది. ఇందిరమ్మ అమృతహస్తం పథకాన్ని పేరు మార్చి పకడ్బందీగా అమలు చేయాలని సర్కార్ నిర్ణయించింది. ప్రసవమైన తర్వాత కేంద్రానికి రాలేని బాలింతల ఇళ్లకే గుడ్లు, బాలామృతం ప్యాకెట్‌ను పంపుతాం. రోజుతో తరహా ఆహారం అందించేందుకు ప్రత్యేకంగా ప్రభుత్వమే మెనూను ప్రకటించింది. ఈ కార్యక్రమానికి సంబంధించి గ్రామ కమిటీని 11 మంది సభ్యులతో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
సంపూర్ణ భోజనమే..
Published Thu, Dec 11 2014 10:56 PM | Last Updated on Sat, Jun 2 2018 8:29 PM
Advertisement
Advertisement